సవరింపు
పూల పరిమళం ముక్కుపుటాలకు సోకినట్టు
అల్లుకున్న జ్ఞాపకాలన్నీ పెనవేస్తుంటాయి
తెలిమంచు స్పర్శ తాకుతుండగా
వెచ్చని కిరణం నిను పలకరిస్తుంది!
లక్ష్యాలు,గమ్యాల కూడికలు,తీసివేతల
నిట్టూర్పుల సెగలు చుట్టుముడతాయి..
నవ్వుకుంటూ సాగిపోమని మనసు సముదాయిస్తుంటుంది!
బాధలు, భయాలు
ఓటమి, గెలుపుల పందేరాల తో
సంశయాల కూడలిలో కూలబడుతుంటే
కాలం కుదుళ్లు నిను కుదిపేస్తుంటే
కుదురుగా ఉండనివ్వదని జీవితంపై అలుగుతుంటావు
పోగేసుకునే క్షణాల ఆశల పల్లకి
ఆమని పిలుపులా నీ గుండె తలుపు తడుతుంటే
మనసులో ఓ చిన్న వెలుగు విస్తరిస్తూ
నీ చూపును సవరిస్తూ ఉంటుంది!
– సి. యస్ రాంబాబు