సాపేక్షత
చీకట్లున్నచోటే
వెలుగు తిష్ఠ వేసుకునుంటుంది
రాత్రి వెనకే ఉదయం వచ్చినట్లు!
అబద్ధమున్నచోటే సత్యముంటుంది
అమావాస్యను దాటి
పరుచుకుంటుంది పున్నమి వెన్నెలలా!
నిరాశల కొలనులోనుంచే
ఆశల పద్మాలు వికసిస్తాయి
పసిపాప ఏడుపును అమ్మపాట ఆపినట్టు!
ఆకలిగొన్నవాడికే అన్నం రుచి తెలుస్తుంది
గమ్యం గుర్తించినవాడే
గమనాన్ని కీర్తిస్తాడు!
-సి.యస్.రాంబాబు