సంక్రాంతి జ్ఞాపకాలు
నాన్నగారు సెంట్రల్ గవర్నమెంటులో యువకులకు ప్రత్యేకంగా హ్యుమానిటీస్ విభాగంలో పని చెయ్యటం వల్ల జనవరి 12న స్వామి వివేకానంద వారి పుట్టినరోజు వేడుకలు జిల్లాలో కొన్నిప్రాంతాల్లో పాల్గొని భోగి రేపనగా సాయంత్రానికి అమ్మమ్మ ఇంటికి చేరేవాళ్ళం.
కబుర్లతో అర్ధరాత్రి దాటి పోయేది. తెల్లారితే భోగి, తెల్లారుజాము నాలుగు అవుతుంటేనే, అందరినీ నిద్ర లేపేసేవారు.
వేడినీళ్ళు, కుంకుడికాయలతో తలస్నానం. స్నానానలు అయ్యాక పొయ్యలో బూడిద, విభూదిలాగ బొట్టు పెట్టుకునే వాళ్ళం.
అప్పటికే పెద్దమ్మవాళ్ళ అమ్మాయిలు (అక్కలు) మాకోసం భోగి పిడకలు చేసి వుంచేవారు. ఇంటికి, నాలుగిళ్ళలవతల వినాయకుడి గుడి ముందు భోగి మంట వేసేవారు.
అక్కడికి వెళ్ళి వేసేవాళ్ళం. అమ్మమ్మ సున్నుండలు, పాకుండలు, అరిసెలు జాడిల్లో సర్ది వుంచేది. స్నానం, బొట్టు పెట్టుకున్నాక పిండివంటలు తినేవాళ్ళం.
పెసరపప్పు వేసి పులగం చేసేవారు. బెల్లం, నెయ్యి, పచ్చి పులుసుతో తినేవాళ్ళం ముగ్గులు అక్కలు వేస్తే, చూసే వాళ్ళం. సంక్రాంతి రెండో రోజు పెద్ద పండగ.
ఆరోజు పరమాన్నం, ముద్ద పప్పు, గారెలు చేసేది పెద్దమ్మ. పెద్దలకు పెరటం పెట్టేది. కనుమ రోజు నైవేద్యం, కోడిని కోసి, పూర్ణం బూరెలు చేసేవారు.
హరిదాసు వచ్చేవారు. గంగిరెద్దులు మేళం వచ్చేది. పెద్దమ్మ పిల్లలు, మేము కలిపి ఎనిమిది మంది. మేము అక్కడ పండగ మూడురోజులు మాత్రమే వుంటాం కాబట్టి, అందరికీ బియ్యం, పిండి వంటలు మేమే ఇచ్చేవాళ్ళం.
అమ్మమ్మ ఊరుకు అమ్మవారు అర్లమ్మ గ్రామదేవత సాయంత్రం ఊరంతా తిరుగేది. ప్రతి ఇంటి ముందుకు వచ్చేది. అమ్మవారు వచ్చే ముందు ఇంటిముందు కళ్ళాపి జల్లి, ముగ్గు పెట్టేవారు.
ఒక మూత పెట్టిన నల్ల కుండలో చల్ల నింపి, కుండకు రెండు వెండి కళ్ళు పెట్టి కళ్ళ చుట్టూ పసుపు ముద్దగా రాసి, బొట్టుపెట్టి అమ్మవారుగా కొలిచేవారు.
ఊరిలో చాకలివాళ్ళు ఎవరో ఒకరు కుండను ఎత్తుకుని ఊరంతా తిరిగేవారు. అమ్మవారిని ఎత్తుకున్న మనిషికి పసుపు నీళ్ళు కాళ్ళ మీద పోసి, చిన్న పసుపు ముద్దను అమ్మవారికి ఇచ్చేవారు.
ఒక గ్లాసులో మజ్జిగ, బియ్యం, పళ్ళు, పిండి వంటలు ఏదొటి పెట్టేవారు. సాయంత్రం ఊరంతా పండగ సంబరం. మధ్యలో రెండుసార్లు రాములువారి పల్లకి సేవతో పూజారిగారు ఊరంతా తిరిగేవారు.
బియ్యం, పండ్లు, పువ్వులు ఇచ్చేవారు. కొంచెం పెద్దగా అయ్యాక, అందరం కలిసి కొత్త సినిమాలకు వెళ్ళేవాళ్ళం. అప్పటికి ఇప్పటికి మేము పెరిగాం కానీ, సంబరాలు మాత్రం అలాగే జరుగుతున్నాయి.
-బి. రాధిక
మీ అనుభవాలు చాలా బాగున్నాయి.. గంతమేంతో మధురం కదా.. మీకు అభినందనలు ..💐💐💐💐💐💐💐