సంక్రాంతి అంటే….
సంక్రాంతి అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ముగ్గులేగా. ఎప్పుడైనా ఎక్కడైనా పెద్ద పెద్ద ముగ్గులు కనిపిస్తే మనసుకు తోచేది కూడా సంక్రాంతే కదా.
అబ్బా! ఒక్క ముగ్గులేనా… అలా ఎలా! సందెగొబ్బెమ్మలు, పూలు, భోగిమంటలు, గంగిరెద్దులు, గాలిపటాలు, హరిదాసులు, బొమ్మలకొలువులు, భోగిపళ్ళు, పిల్లలు, పిండివంటలు, పేరంటాలు, అమ్మ చేతి ముద్దలు, అమ్మమ్మ పెట్టే ముద్దులు, కొత్త పంటలు, కొత్త బట్టలు, కోలాహలం, సంబరాలు, నవ్వులు. అలవిమాలిన సంతోషం.
సంక్రాంతంటేనే పెద్ద పండగ! సంక్రాంతంటే మనసు నిండుగా, కన్నుల పండుగ! సంక్రాంతంటే అందుకే మరందరికీ, మనందరికీ మరీ మరీ స్పెషల్.
అక్కావాళ్ళూ, వాళ్ళ నేస్తురాళ్ళూ. ఇంకా యింటోవున్న బొట్టికాయ చెళ్ళెళ్ళూ, డిప్పకాయ వెధవలూ, అక్కా మేమూనే అంటూ తయారు.
చలికే వణుకు పుట్టే చలిలో, బద్ధకం మరికాసేపు బబ్బోమని కావిలించుకు వదలనన్నా విదిలించుకు, పొద్దున్నే ఏ నాలుగింటికో ఇంకాస్త ముందేనో లేచి ఎక్కడెక్కడి పేడకళ్ళ కోసం ఆవులు గేదెల్ని వెతుక్కుంటూ ఊరంతా పరుగులు.
అసలు ధనుర్మాసం అంటేనే వేల్టికి పాలందకపోయినా, బుట్టెడు పేడందాలనుకునే రోజులు. అక్కడో ఇంత, ఇక్కడో అంత పేడ దొరికించుకుని, ఆపైన ఏ అంజత్తగారి రుక్కుల్నో ఏమార్చి దాన్తట్టలోంచీ ఒకింత కొట్టుకొస్తే కానీ తీరని ఆత్రం.
ఇల్లు చేరి ఇంటిముందంతా చిమ్మి, కళ్ళాపిజల్లమని అమ్మన్నిలవనీకండా నానా యాగీ చేసి ఆ తడి నేల ఆరిందో లేదోంటో కాలుగాలిన పిల్లులమల్లే ఒకటే తిరుగుడు.
నాలుగో నీషాన ఇక మనసాగక ఓ చిన్న దీపంబుడ్డి పక్కన పెట్టుకోని ఏ పదార్చుక్కల్తోనో మొదలెడితే… ఆ తీగ సరిగా కలవకనో, ఈ చుక్క తొందర్లో కలపకనో, మొత్తానికి ఈ కాస్తా తుడపటం, ఆ కూసింతా అలకటం. మరింకోసారి వేళ్ళ సందుల్లోంచి సన్నగా ఆ ముగ్గు ధారగా ముందుకు సాగుతో…
ఓసేయ్.. ఓసి మీ ముగ్గుల సంబడంగూలా! ఇదేం ఓగాయిచ్చం పిల్లమ్మా ఒక్కోత్తీనూ.. ఇదిగో, యిహన్నా కొంపల్లోకి తగలడ్తారా లేదా? హవ్వ్వ… ఆ సూన్నాణమూర్తి తెల్లఘా సగవాఁకాశం నిండా వొచ్చే.
ఈడొచ్చినాడపిల్లలు, మొహం కడుక్కోవాలన్న ఙానవుఁడక్కర్లా? లక్ష్వీ అమ్మవారికాగ్రహం అన్న యింగితవన్నా లేకండానూ…
అయినా ఏవే సూచ్చలా, దాని వయసుకు తెలీపోయినా నీ మనసుకైనా బుద్ధుండక్ఖల్లేట్టే, ఇహనో ఇవ్వాళో పదినాళ్ళకో పిల్లన్జూసుకుంటావనెవళేనా కబురంపిస్తే ఇల్లాగే మడ్డిముంతని కూచ్చోబెడతావా ఏం?
పండగనాడేవిటీ అవతారాలూ పాచిమొహల్తోనీ, అని అమ్మతో సహా ఇంటిల్లిపాదినీ, వీధిలో ఏ మామ్మో కోప్పడితేగాని ఆ రథం ముగ్గో, చక్రం ముగ్గో పూర్తయ్యేది కాదు.
పైనించీ రంగులద్దటవూ, గొబ్బెమ్మలూ, వాటిమీదిన్ని గుమ్మడీ, కారబ్బంతులూ, ముద్దబంతి పూలూ, గుప్పెడు పసుపూ, కుంకం… కళ్ళు చెదిరేట్టుగా అలంకారం! ఇంటిముందు వెల్‌కమ్!!
ఈమధ్యలో విరిగిన సన్నాయి, డోళ్ళతో ఓ డజను గంగిరెడ్లూ, పదిమంది హరిదాసులూ, తలో దోసెడు బియ్యం. నాన్ననడిగి మరో పదిపైసలో, పావలో.
మాయమ్మే, మళ్ళేటికి పెళ్ళై మీయాయిన్తో వొచ్చి నీదో పాతచీరా నీ మొగుడిడిసిన దోవతులిప్పియ్యాలన్జెప్పి, అయ్యగారికో దణ్ణం పెట్టూ, సిన్న దొరసానికో దీవెన సుట్టూ అంటే, తలాడించి దీవించే డూడూబసవన్న నోటికో అరటిపండూ!
ఇదో యిందాక ఓసి భడవాకానల్లాలా… అన్తిట్టిపోసిన మామ్మే మళ్ళీ ఇంటిముందర ముగ్గులందం చూసి మురిపోతూ నాగౌరమ్మే, నామహలక్ష్మే..
వీధంతటికీ నీ ముగ్గేనే అందం తల్లీ.. అని మెటికలు విరిచి మరీ ఒక్కోళ్ళకూ ముద్దులు. మహరాజంటి మొగుడొస్తాడని దీవెన్ల కొసర్లు.
అట్నుంచీ కాసిని, ఛీ.. పో మామ్మాలూ, అమ్మా చూడేలూ, సిగ్గులూ, ముసిముసి నవ్వులూ… ఆ పైన తలంట్లూ, కొత్తబట్టలూ. ఇల్లిల్లూ ఓయబ్బ, ఒకటే కోలాహలం. సంబరం.
సంక్రాంతంటే ఆవాళ మరి బొమ్మలకొలువు పేరంటం కదా! ఇంట్లో అన్నయ్యగాళ్ళ మీద అథార్టీ, పెత్తనం. మెట్లు తక్కువనో, ఎక్కువనో, ఎత్తనో, పైన పరచిన దుప్పట్లు మడతలనో…
వాడి నడుం విరిగిందాకా గోల. అయ్యో అది అమ్మవార్రా ముదనష్టపాడా, అన్నింటికంటే ఆపైన పెట్టాలన్తెలీదూ అంటూ తిట్లూ విసుర్లు.
అమ్మా, చూడే… బొమ్మలన్నీ వీడిష్టవొచ్చినట్టెలా పెట్టేస్తున్నాడోనంటూ పితూర్లు. పార్కు చెయ్యటానికి ఇంకా ఇసక తేలేదేమనంటూ తట్లు తేలేట్లు వాడి వీపుకి చేత్తో గుర్తు చైడాలూ!
పులి మీద పుట్రలా, మూలిగే నక్క మీద రాలిపడ్డ తాటి పండులా, ఆఁ! దేనికిరా ఆ ఇస్సూలూ ఉశ్శోలూ… ఎవర్నేం వుద్ధరించేవనీ?
ఇంటాడపడుచుకామాత్రం బొమ్మలకొలువు ముచ్చట తీర్చడానికే అలుపూ, అలకానా? ఇప్పుడే ఈమాత్రం వొళ్ళొంగకుండావుంటే, రేపు నీకు తాడుపోసి నీచేతినో పిల్లదాన్నెట్టేదొచ్చిన్నాడేం చేస్తావో మేం చూడమా, ఆట్ఠే ఏంజేసేవు గాడ్దెకానా… లే లెమ్మని అమ్మో, అత్తయ్యో, అవతలింటి పిన్నో అదిలింపు.
కోప్పడ్తున్నారని మనసు ఒక్క క్షణం గునిసినా, పొద్దున్న శివాలయం వీధిలో, ముగ్గు మధ్యన గొబ్బెమ్మనలంకరిస్తూ తనన్చూసి సిగ్గుమొగ్గై నవ్వుదాచుకుంటూ ఇంట్లోకి పరిగెత్తిన ఎర్ర ఓణీ, మువ్వల పట్టాలు గుర్తొచ్చిన పులకరింపు.
ఆ వాల్జడలోంచి రాలి తన జేబులో దాగిన గులాబి పువ్వు ముందు ఎన్నెన్నో డెబ్భైరెండోసారి మళ్ళీ హృదయం మోహరింపు. ఆ గులాబిమొగ్గని తాకీతాకనట్లు మరొకమారు ప్రేమ పలకరింపు.
ఏ గులాబి బుగ్గనో మెత్తగా ముద్దాడినట్లు మనసులో మూగగా కలవరింపు. ఎదలో ఏమూలో ఎందుకో తెలియని సన్నని సలుపు!
ఏరా అన్నయ్యా, నా బొమ్మల కొలువు వదిలేసి ఏ బొమ్మ కోసం ఈ మైమరపంటూ చెల్లాయి వెక్కిరింపు! నోరుముయ్యవే, బండమొద్దూ అంటూ ఉలికిపడ్డ ఆ కంగారులోనే దాన్ని బెదిరింపు. చుట్టూవున్న పెద్దా చిన్న ఆడమళయాళం నవ్వులకి అందరి ముందూ బింకంగా కోరచూపు.
సాయంకాలం పేరంటం ముందు కొత్త లంగా ఓణీ, బోల్డు కొత్త గాజులు, గోరింటాకు పండిన ఎఱ్ఱటి చేతుల్తో ఇదిగోరా అన్నయ్యా అని కాసినక్షింతలు చేతికిచ్చి చటుక్కున వొంగి కాళ్ళకు దణ్ణం పెడితే, ఏవిటో.. అప్పటిదాకా వేధించిన అలసట, నడుంనెప్పి మాయం.
నా చెల్లెలు యిదన్న మురిపెం. మా ఇంటి బంగారం, శ్రీమహాలక్ష్మి పాదం అన్న గారం. ఈ లోకం దాని కాల్చెప్పుకు సరితూగదన్న గర్వం.
ఎందుకో కంటో చుక్క నీళ్ళు తిరిగితే అమ్మా నాన్నా చూడకుండా తుడుచుకునే ప్రయత్నం. మొహానింతో వెఱ్ఱి నవ్వుతో యింటో దుమ్ము లెమ్మని వూరుకోటం.
చూసికూడా అమ్మ చూణ్ణట్టూర్కోటం. చెల్లెళ్ళంటే ఎంత గారాబమో నా పిచ్చినాయనకని మనసులో కొండంత సంతోషం. ఆ తండ్రి కడుపున పుట్టిన శ్రీరామచంద్రుడు నాబిడ్డంటూ నిస్వార్థంగా ఖ్యాతి ఇంటాయనకు ధారపోసి, అందులోనే తన నీడనూ చూసుకోటం!
వొచ్చిన పేరంటాళ్ళకి రండ్రండని నవ్వుతూ ఆహ్వానం. అందరూ కలిసి ముచ్చట్లూ, మెహర్బానీలూ, పిల్ల సన్నాసులకు మరిన్ని భోగిపళ్ళూ, ఓటో నాలుగో చిల్లర పైసళ్ళూ.
వెరసో రెండు మంగళహారతులు. పండూ శనగలూ తాంబూలం వాయనం. మరి మేం వెళ్ళోస్తామంటూ మెల్లగా ఎవరిళ్ళకు వాళ్ళు తరలడం.
మళ్ళొచ్చే ఏడాదికి ఇంకెన్ని సంబరాలో అనుకుంటూ ఇవ్వాళనుండే ఆశలు పోగేసుకోటం. ఈ పండక్కి ఇంకా ఏమేం చేసాం, వేరెవరెవ్వరిని కలిసామనుకుంటూ కనుమ పూర్తిగా కాలటు పెట్టకుండానే సంతోషాల భోషాణం పెట్టె చుట్టూ మనసు తిరగటం!!
మనమూ మనవాళ్ళే కాకుండా, కానోళ్ళయినా మన చుట్టూవున్న ప్రతివాళ్ళూ తమ కష్టాలు, కక్షలు, కుట్రలన్నీ భోగిమంటలో దగ్ధం చేసి, అందరం కలిసిమెలిసి స్నేహంగా సంతోషంగా వుండాలని కోరుకోవటం!
సంక్రాంతి. మాయింటి పండుగ. మనందరి పండుగ. ప్రతి తెలుగింటి పెద్ద పండుగ. తెలుగుదనంలో వెలుగులు నింపే కన్నుల పండుగ!!
-కొండుభొట్ల చంద్రశేఖర్
ముద్దబంతి పువ్వుల జడ వేసుకున్న అచ్చతెనుగు ముగ్ధ కన్నుల ముందు తిరుగుతుంటే ఎంత ఎంత సంతోషంగా ఉంటుందో…అచ్చం అలాగే ఉంది మీ “సంక్రాంతి” కథానిక🙏😍🤗
అద్భుత జ్ఞాపకాలు గుదిగుచ్చి మరింత అధ్బుతంగా వాటిని పేర్చి, మధ్యలో కళ్ళు కాస్త చమరింపజేసి రాశారు. అభినందనలు
ఎన్ని అనుభవాల్ని నెమరువేసుకునేలా చేశారు. అధ్బుతం చందూ గారూ.
ధనుర్మాసవంటే వేల్టికి పాలందక పోయినా, బుట్టెడు పాలందాలనుకునే రోజులు… ఎంత బా చెప్పారు!! 👌👌
ధనుర్మాసవంటే వేల్టికి పాలందక పోయినా బుట్టెడు పేడందాలనుకునే రోజులు .. ఎంత బా చెప్పారు !!👌👌
సంక్రాంతి సందడంతా ఒకే పెద్ద గజమాలగా గుచ్చి అమ్మంతంగా మెడలో వేశేసారు చందూ గారౌ. మెడ మీద బరువుకంటే, ఆ రోజుల జ్ణాపకాల సంతోషభారం పెక్కుగా అనిపించింది. వచ్చేయేటి సంక్రాంతి సంబరాలతో పాటుగా చందూ గారి మరొక మాలిక కోసం ఎదురుచూస్తూ!