సంకెళ్లు
అప్పుడెప్పుడో నీ గురించి విన్నాను
నువ్వు కనబడకుండా నీకు నచ్చిన వారికి
ఎన్నెన్ని కిరీటాలు పెడతావో
తెలుసుకుని అబ్బుర పడిపోయాను.
నిన్ను చేరుకోవాలని ఎన్నెన్ని కలలు కన్నానో…
నీ దృష్టిలో పడాలని నక్క తోక తొక్కడానికి
ఎన్ని విన్యాసాలు చేసానో..
నువ్వు తోడు లేక ఎందరి జీవన ప్రయాణం
రాళ్లు రప్పల మధ్య నల్లేరు మీద నడకలా సాగుతోందో…
ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాల, కులమతాల
బేరీజులు వేయకుండానే కాలంతో జతగూడి
రాజునైనా సరే రాజీ లేకుండా
రోడ్డున పడేసే రాతి గుండె నీది
బికారికి కూడా పదవి కట్టబెట్టి
పూలదండ వేయించే పెద్ద మనసు నీది
అందరికీ కనిపించకుండా కవ్విస్తూ
కొందరినే కౌగిలి లో కరిగిస్తావు..
ఎంత విజ్ఞానం ఉన్నా,
ఆవగింజంత నీ ఆదరణ లేక
అణగారి పోయిన అభాగ్యులేందరో..
నిను చేరని జీవితం
వెన్నెలకు నోచుకోని
గుహలోని గుండ్రాయే…
అందుకే ఎంతో ఆబగా
నా చేతిని సుంతైనా తాకమని
ఎంతగా వేడుకున్నా వేడినిట్టూర్పే
వేలు పట్టుకుని నడిపించింది..
నువ్వు లేక సన్నగిల్లిన మా కుటుంబం
నాతో పాటు నువ్వు వస్తావని
వేయి కళ్ళతో ఎదురు చూసి
నీ ఉనికి కనపడక ఉసూరుమంది…
కొంతలో కొంతైనా కాలాన్ని కట్టడి చేస్తూ
సంకల్పం అనే సంకెళ్లు వేసి
నిన్ను సంగడీడుగా చేసుకోవాల్సిందే…
– సలాది భాగ్యలక్ష్మి