సంఘర్షణ ఆరో భాగం
జీవితంలో ఎప్పుడు ఎవరితో ఏ అవసరం పడుతుందో ఎవరు ఎలా పరిచయం అవుతారు తెలియదు. ఒకరు మనకు పరిచయం అయ్యారు అంటే వాళ్ళ వల్ల మనకు ఏదైనా ఉపయోగం జరుగుతుంది అనేది నిజం.
**********
పెళ్లి వారి ఇంటికి బస్సు బయలుదేరింది.. అరుణ్ కోసం ప్రత్యేకంగా ఒక కారు మాట్లాడుకున్నారు. అందులో అరుణ్ అతని స్నేహితుడు అనిల్ మాత్రమే ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ బస్సులో తమ చుట్టాలతో పాటు వస్తానంటూ చెప్పడంతో అనిల్ కారులో బయలుదేరారు.
వెళుతున్న ఎంతసేపు అనిల్ శంకర్ రావు గారిని పొగడడం తోనే సరిపోయింది. రేయ్ అరుణ్ ఏమో అనుకున్నాను, కానీ మీ నాన్నగారు ఘటికుడు. అక్కడ స్నేహితుడు ఏమి ఇబ్బంది పడుతున్నాడో అని ఆలోచించి బస్ మాట్లాడే వ్యక్తిని ఇప్పుడే చూస్తున్నాను, ఇలా ఎక్కడా జరగదు.
ఇంకా అమ్మాయి వాళ్ళను ఇబ్బంది పెడతారు తప్ప ఇది ఇలా సహాయం ఎవరూ చేయరు. ఎంతైనా మీ నాన్నగారు చాలా గొప్పవారు. ఇలా సహాయం చేసే గుణం కూడా ఉండాలి. రెండు వైపులా ఆలోచించారు అంటేనే ఆయన ఎంత గొప్ప వ్యక్తో అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తి నా స్నేహితుడి తండ్రి కావడం, వారి పరిచయం నా అదృష్టం రా అన్నాడు.
అరుణ్ కోపంగా ఆ మరే నువ్వు చెప్తే తప్ప ఆయన గొప్పతనం మాకు తెలియదు. నువ్వు నోరు మూసుకో, ఆయన గొప్ప కానీ కొడుకు మనసు కూడా తెలుసుకోలేనంత గొప్పతనం ఏముంది. నా మనసు తెలుసుకొని ప్రవర్తించాలి. కానీ నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం ఆయనకి సంతోషంగా ఉంది అన్నాడు కోపంగా..
ఏమోరా అరుణ్ పెద్ద వాళ్ళు ఏది చెప్పినా, ఏది చేసినా ,మన మంచికే చేస్తారు. అందుకే అన్నారు పెద్దల మాట చద్దన్నం మూట అని, మీ నాన్నగారు కూడా నీ భవిష్యత్తు కోసమే ఇలా చేస్తున్నారేమో ఆ వైపుగా ఆలోచించు అన్నాడు అనిల్.
నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, నన్ను ఇలా బందిఖానాలో పంజరం లో పెట్టాలని అనుకోరు. అయినా నీకు అర్థం కాదులే, నీకు సమస్య వస్తే తెలుస్తుంది. సముద్రం లో దిగిన వాడికే లోతు తెలుస్తుంది. కానీ ఒడ్డున కూర్చుని వాడికి ఏమీ తెలియదు. నీతులు బాగానే చెప్తావ్, నా ప్లేస్లో నువ్వు ఉంటే ఆలోచించు ఒకసారి అన్నాడు అరుణ్.
ఏమో రా నీ గురించి ఆలోచిస్తే నాకు పిచ్చెక్కుతుంది. కానీ మీ నాన్నగారు చేసేది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఓ వైపు స్నేహితుడు, మరోవైపు పెద్దవారు నేను ఎటు తేల్చుకోలేక పోతున్నా అన్నాడు అనిల్. నువ్వు కూడా ఆయన చుట్టం అయ్యావు గా, ఇంకేం చెప్తావ్ లే అంటూ పెద్దగా నిట్టూర్చాడు అరుణ్.
వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్న సమయంలో భోజనాల కోసం డ్రైవర్ ఒక దగ్గర కారు ఆపాడు. కారు దిగిన అరుణ్ చుట్టూ చూస్తూ ,ఒరేయ్ మన వాళ్ళ బస్సు ఏది రా అంటూ అని అడిగాడు. ఏమో రా నాకేం తెలుసు ,నేను నీతోనే ఉన్నాను కదా అన్నాడు అనిల్.
వెనకాల వస్తున్నారేమో సార్ అన్నాడు డ్రైవర్. ఆ అవును వెనకాల ఉన్నారో, ముందే వెళ్లిపోయారో ఎవరికి తెలుసు. పద ఆకలైతే చంపేస్తుంది. ముందు ఏదో ఒకటి తిందాం. అంటూ లోపలికి రెండు అడుగులు వేసాడు అరుణ్. ఇంతలో ఎల్లో కలర్ చుడీదార్ వేసుకుని ఒక అమ్మాయి పరిగెత్తుతూ వచ్చి, అరుణ్ పట్టుకుంటూ ప్లీజ్ నేను ఇక్కడ ఉన్నట్లు వాళ్లకి చెప్పకండి ,అంటూ అరుణ్ వెనకాల ఉన్న కారు చాటు కి వెళ్ళింది .
అరుణ్ ఆమెను చూసి పెళ్ళే, అనుకుంటే ఇది ఒకటి వచ్చింది. మాకిక దారేది అంటూ అడిగాడు అనిల్ని అనిల్ భుజాలు ఎగరేసాడు.. ఆమె కారు చాటునుంచి మెల్లగా తలెత్తి చూసి వచ్చారా ? అంటూ అడిగింది. ఎవరూ లేరండి మీరు ఎందుకు భయపడుతున్నారు చెప్పండి ముందు అంటూ అడిగాడు అరుణ్.
ఎవరూ రావడం లేదా ,అంటూ కారు వెనుక నుంచి బయటకి వచ్చిన ఆ అమ్మాయి అరుణ్ దగ్గరగా వచ్చి మమ్మల్ని ఇద్దరూ గుండాల తరుముతున్నారు. అందుకే మేము భయపడి పరుగెత్తుతున్నాము అంది.
ఏంటి నువ్వు, మేము ,మేము అంటున్నావు.మీరు ఒక్కరే కదా ఇక్కడ ఉంది. ఇంకా ఎవరున్నారు మీతో పాటు అంటూ అడిగాడు అనిల్.
నేను నా స్నేహితురాలు ఇద్దరం ఒక పని మీద వచ్చాము. కానీ వాళ్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. దాంతో ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాం .
నా స్నేహితురాలు వాళ్లకి దొరికిపోయి నట్టుగా ఉంది. అయ్యో ఇప్పుడెలా వాళ్ళు తనను ఏం చేస్తారో ఏమో అంటూ భయపడ సాగింది ఆ అమ్మాయి.
ఏంటండీ మీరు ఇంత ఈ రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. ఆమెని అలా ఎలా వదిలేసారు. కలిసి వచ్చినప్పుడు కలిసే కదా ఉండాలి. తనని అలా ఎలా వదిలేసారు. ఇంతకీ ఎవరు మిమ్మల్ని తరిమింది. నాకు చూపించండి అంటూ అడిగాడు అరుణ్.
సహజంగా అరుణ్ కి ఆడవాళ్లంటే కొంచెం గౌరవం ఉంది. పైగా ఎవరైనా ఇబ్బంది లో ఉంటే సహాయం చేసే గుణం కూడా ఉంది.
కాబట్టి ఎవరు ,ఏంటి అని ఆలోచించకుండా ఆమె కి సహాయం చేయాలని అనుకున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు ఎవరో రౌడీల చేతిలో పడిపోతుంటే చూస్తూ ఊరుకోలేక, సాటి మనిషిగా సాయం చేయాలనుకుని ఆ అమ్మాయిని అడిగాడు.
రండి సార్ చూపిస్తాను అంటూ ఆ అమ్మాయి నడవసాగింది. ఇలా నడుచుకుంటూ వెళితే మీ స్నేహితురాలిని కాపాడలేం కాని కారు లో వెళ్దాం పదండి అంటూ, ఆకలి మాట మర్చిపోయి , కారు తీశాడు అరుణ్.
లోపల తింటున్న డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతన్ని చూసిన అనిల్ ఇక్కడే ఉండు. మేం మళ్ళీ వస్తాం అంటూ గట్టిగా అరిచి చెప్పాడు. కారు ముందుకు కదిలింది.
****
మీకు అసలు బుద్ధుందా చేతికి వచ్చిన వాళ్లని వదిలేస్తారా. ఇద్దరమ్మాయిలను పట్టుకో లేకపోతే మీరే మనుషులు, మిమ్మల్ని మేపడం దండగ ,అంటూ గట్టి,గట్టిగా అతని అనుచరుల మీద అరవసాగాడు మనోహర్.
అయ్యో అన్న అది కాదు వాళ్ళు చాలా ఫాస్ట్ గా పరిగెత్తారు. మేము వాళ్ళని అందుకోలేకపోయాము. మా కళ్ళల్లో ఇసుక కొట్టి మమ్మల్ని వెధవల్ని చేశారు. వాళ్ళు గాని మా చేతికి దొరికి ఉంటే ఈ పాటికి మీ పెళ్లి జరిగిపోయేది. అన్నారు అనుచరుల్లో ఒకడు.
దొరికిన వాళ్ళని వదిలేసి, ఇప్పుడి మాటలు చెప్పడం అవసరమా ,వెళ్లండి వెళ్లి వెతకండి. దాంతో నా పెళ్లి జరగాల్సిందే. ఎంతో కష్టపడి వేసిన ప్లాన్ ఇలా అవ్వకూడదు. దాని పొగరు అణచాలి. అది నా కాలికింద చెప్పులా పడి ఏడవాలి అన్నాడు కసిగా మనోహర్.
ఏంట్రా ,ఏమైంది అంటూ వచ్చాడు ఫణి భూషణ్ రావు. ఏం లేదు నాన్నగారు, ఈ వెధవల వల్ల ఆ అమ్మాయి పారిపోవడం జరిగింది. కానీ వెంటనే వెనక్కి తీసుకు వస్తాను. నేనే రంగంలోకి దిగుతున్న ఇక అన్నాడు మనోహర్.
ఈ అబ్బా, కూతుర్ల కి ఎంత పొగరు రా ,ఇచ్చిన పైసలు తిరిగి ఇవ్వకుండా, నాకే నీతులు చెప్తాడా ? నా వంశాన్ని అంత మాట అంటాడా. దాని మెడలో తాళి కట్టడం ఆలస్యం. వాళ్లని నల్లిని నలిపినట్టు నలిపేస్తూ, నేనేంటో చూపిస్తా, అన్నారు ఫణి భూషణ్ రావు . వెళ్ళు తొందరగా వెళ్లి ఎక్కడున్నా పట్టుకురా అన్నారు కొడుకు తో…
మనోహర్ చాలా కోపంగా కరుణ ని వెతకటానికి వెళ్ళాడు.
ఇంతకీ అరుణ్ కాపాడాలనుకున్న ఆ అమ్మాయి ఎవరు? అతని సాయం చేయమంటూ అడిగిన అమ్మాయి ఎవరు ? కరుణ మనోహర్ కు దొరుకుతుందా? లేదా? ఇంతకీ కరుణ తన తండ్రిని కాపాడుకుందా ? లేదా ? చదవండి తదుపరి భాగం లో ….
-భవ్యచారు