సంఘర్షణ పార్ట్ 2

సంఘర్షణ పార్ట్ 2

మనలోని బాధ ను పంచుకుంటూ , తోచిన సలహాలు, సూచనలు ఇస్తూ , వెన్నంటి నడిచే వాడే మిత్రుడు. వాడికి డబ్బుందా, లేదా, పేద గొప్ప , చిన్న , పెద్ద అనే తేడాలు ఏవి ఉండవు , స్నేహానికి వయసుతో పనిలేదు , అనుభవం తో పని లేదు , ఆడ మగ అనే తారతమ్యం లేదు.

మంచి స్నేహితుడు మంచి పుస్తకం తో సమానం అని పెద్దలు ఉరికే అనలేదు. మన స్నేహితుణ్ణి చూసి మనల్ని అంచనా వేయొచ్చు అని కూడా అంటారు.

********

ఒరేయి.. ఎంటా మాటలు నీకేమన్నా మతి పోయిందా ? చస్త అంటే ఎలా ? ఇంత చిన్న విషయం కోసం నువ్వు నీ జీవితాన్ని ఎందుకు చాలించాలి రా, తెలివి తేటలు బాగానే ఉన్నాయి లే , అందుకే ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ,

 అరేయి అరుణ్ చూడు ఒకటి చెప్తాను గుర్తు పెట్టుకో  మానవ జన్మ ఎత్తాలి అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి , అలాగే పుణ్యం కొద్ది వచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. అంతే కానీ చిన్న , చిన్న విషయాలకు చనిపోతాను అనే మాట కరెక్ట్ కాదు రా, ఈ జీవితాన్ని నిండు నూరేళ్ళు జీవించాలి. జీవితం మధ్యలో చాలించ కూడదు.

కొందరు మధ్యలోనే తల్లిదండ్రుల పైన కోపం తో చావాలని అనుకుంటారు, లేదా ఆవేశం లో చనిపోతారు. వాళ్ళకు వాళ్ళు బాగానే పోతారు. కానీ వారి జ్ఞ్యాపకాలు ఉన్న వాళ్ళు జీవితాంతం బాధ పడతారు.

కన్నవాళ్ళు కూడా కుమిలి పోతారు. పది నెలలు మోసి కన్నా తల్లి , ఆ జన్మకు కారణమైన తండ్రి ఎంతో బాధ పడతారు.  తాము ఎం చేస్తున్నామో తెలియని స్థితి లో ఆవేశం లో ప్రాణాలు తీసుకునీ తమ వారిని బాధ పెడతారు. ప్రేమించిన వాళ్ళు, లేదా స్నేహితులు అయినా కొన్నాళ్ళకు చనిపోయిన వారిని మర్చిపోతారు.

తమ జీవిత బాధ్యతల్లో పడతారు. కానీ చనిపోయిన వారి తల్లిదండ్రులు , తోబుట్టువులు , వారిని ప్రేమించిన వారు, వారిని కావాలనుకున్న వారు జీవితాంతం వారిని తలచుకుంటూ కుమిలి కుమిలి పోతారు.

ఇవన్ని ఆలోచించకుండా కేవలం ఎవరో ఎదో అన్నారని, ఉద్యోగం రాలేదని, చదువులో వెనక  బడ్డాము అని, ప్రేమించిన వారు దక్కలేదని , భార్య కూర బాగా చేయలేదని, భర్త తిట్టాడు అని , అమ్మ తిట్టిందని, నాన్న కోప్పడ్డాడు అనో ఇలా చిన్న చిన్న  వాటికే చాలా మంది ఆవేశం లో ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదు రా, ఎవరేం అన్నా, ఎంత పెద్ద సమస్య వచ్చినా బ్రతికి పోరాడాలి .

బ్రతికి సాధించాలి  కానీ  ప్రాణాలు  తీసుకోకూడదు. ఆవేశం లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచించాలి. సమస్య ఎంత పెద్దది అయినా నిదానంగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి. నీకున్నది పెద్ద సమస్య కానే కాదు , కుర్చుని సర్ది చెప్పాలి.

అయినా నీ తల్లిదండ్రులు వినడం లేదని అంటున్నావు కాబట్టి దానికి ప్రత్యామ్న్యాయం ఆలోచించు, రేపు పెళ్లి చేసుకుని వచ్చే అమ్మాయికి నీ సమస్య అంతా చెప్తే ఆమె నీకు సపోర్ట్ చేస్తుందేమో నిన్ను అర్ధం చేసుకుంటుంది ఏమో ఎవరికీ తెలుసు.

అందువల్ల నువ్వు ఇలాంటి మాటలు ఇంకోక్కసారి మాట్లాడావే అనుకో నిన్ను నేనే చంపేస్తా వెధవ, నిన్ను చూసి నేను ఇన్స్పిర్ అవ్వాలి అనుకుంటే నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు అంటూ  క్లాస్ పీకాడు అనిల్ అరుణ్ కి . 

******

సాయంత్రం వరకు వచ్చేయ్ అన్న అరుణ్ మాటతో అనిల్ వచ్చాడు తన బండి పైనే , రాగానే అరేయ్ అనిల్ అలా పొలాల వైపు వెళ్దాం అని అనగానే పద అంటూ వెంటే వచ్చిన అనిల్ తో పొలం లోనూ మోటారు పంపు దగ్గర నిల్చున్న అరుణ్ , అనిల్ అరేయ్ నేను చచ్చి పోతా రా అన్నాడు అరుణ్.

సంఘర్షణ పార్ట్ 2
సంఘర్షణ పార్ట్ 2

దానికే అనిల్ ఈ మాటలన్నీ చెప్పి ఊపిరి పీల్చుకుంటూ , ఒరేయ్ నీ పెళ్లి నీకు ఇష్టం లేదు కదా , కానీ నీ పేరెంట్స్ చేస్తారు తప్పదు చేసుకో ,రా ప్లీజ్ రా , నా మాట విను ఈ ఒక్కసారి. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం రా అనగానే అరుణ్ కోపంగా లేచి అక్కడి నుండి ఇంటి వైపు అడుగులు వేయసాగాడు.

ఏంట్రా చావడానికే వెళ్తున్నావా  ? నేను చెప్పింది కంఠ శోషేనా అయ్యో భగవాన్  ఎక్కడున్నా వయ్యా , వీడిని కాపాడవయ్య  అంటూ నెత్తి కొట్టుకుంటూ  అరుణ్ వెనకాలే  పరుగేత్తుతూ వెళ్తున్న  అతని అరుపులు వింటున్న అరుణ్ అగి , విసుగ్గా చావడానికి కాదు లేరా , ఆకలి వేస్తుంది.  మింగాలి కదా ఏదో ఒకటి అందుకే వెళ్తున్నా అన్నాడు అరుణ్ ,

ఓరీని వేషాలు తగలెయ్య , అంతేనా నేను ఇంకా బావిలోకి దూకేస్తావేమో అని భయపడ్డాను. అయితే పద అసలే పెళ్లి ఇంట్లో భోజనం అదిరి పోతుంది నాకు కూడా ఆకలిగా ఉంది, పొద్దుటి నీ హడావిడి కి అసలేం తిననే లేదు ,

అంకుల్, నేను మంచి భోజన ప్రియులం  . ఏమేం వండారో ఏమిటో ఒక పట్టు పట్టాల్సిందే . అంటూ తిన్నంత బిల్డప్ ఇస్తున్న స్నేహితుణ్ణి చూసి ,

నీ యబ్బ నాకు ఇక్కడ కాలుతుంది అంటే నువ్వు భోజనం రకాలు చెప్తావా , నిన్ను అంటూ వెంట పడగానే అమ్మ బాబోయ్ కాపాడండ్రోయి అంటూ పరుగెత్తాడు అనిల్ , వెంట పడ్డాడు అరుణ్. ఈ మిత్రుల గోల ఇలా ఉంటే . ..

********

ఏంటే నువ్వు అనేది నీకు పెళ్లి ఇష్టం లేదా , మరేం చేద్దామని అనుకుంటున్నావు అంది సుప్రజ, కరుణ తో . అది తెలియకనే కదా, నిన్ను సలహా అడగాలి అనే కదా అనంత పురం నుండి హైదరాబాద్ కి నిన్ను రమ్మని పిలిచింది. ఇప్పుడు నాకు ఏమీ తోచడం లేదు , ఏం చేయాలో అర్దం కావడం లేదు. ఏదన్నా చెప్పవే అంది చిరాగ్గా కరుణ.

అమ్మో నువ్విలా అడుగుతావని తెలిస్తే  ,నేను ఈ పెళ్లికి వచ్చేదాన్ని కాదు తెలుసా అయినా పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావ్ , మీ పేరెంట్స్ కి చెప్పవా మరి  నీకీ పెళ్లి ఇష్టం లేదని అంది సుప్రజ. చెప్పి, మొత్తుకున్నా వాళ్ళు వినడం లేదు .పెళ్లి చేసుకోకుండా బాగా చదువుకోవాలి, అయినా ఇప్పుడే పెళ్లి ఏంటి చెప్పు .

ఇంకా నాకు జీవితాన్ని ఎంజాయ్ చేయాలని ఉందే . అన్ని ఉర్లు తిరగాలి, చూడాలి, కొత్త స్నేహితులను పెంచుకోవాలి , వాళ్ళతో కలిసి పిక్నిక్ లు వెళ్లాలి. ఇంకా ఎన్నో చూడాలి, చేయాలి అంది ఆవేదనగా కరుణ. ఈ పెళ్లిని ఎలాగైనా తప్పించుకోవాలి. ఇక్కడి నుండి పారిపోవాలని నిన్ను తోడుగా ఉంటావని పిలిచాను అంది కరుణ. 

దానికి సుప్రజ కళ్ళు పెద్దవి చేసి కరుణను చూస్తూ గుండెల పై చేయి  వేసుకుంటూ  వామ్మో    నువ్వు ఇంత ప్లాన్ లో ఉన్నావా ? నన్ను పిలిచింది ఇందుకా తల్లి , నీకో దండం  ఈ  విషయాలన్నీ నాకు తెలియదు. ఏదో పెళ్లి ఉందంటే వచ్చాను. అంతే తప్ప నేను ఏదో పొడిచేస్తానని కాదు . నాకు ఇవన్నీ నువ్వు చెప్పలేదు, నేను వినలేదు , నన్ను ఇందులో కి లాగవద్దు . నేను ఇప్పుడే మా ఊరికి వెళ్లి పోతాను,

ఇలాంటివి సినిమాల్లో చూడటం తప్ప నిజ జీవితంలో చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందర్నీ ఏమార్చి ఇక్కడి నుంచి నువ్వు బయట పడలేవు. అందుకే నోరు మూసుకుని ముహూర్త సమయానికి పెళ్లి చేసుకో అంతే తప్ప ఇంకో ఆలోచన చేయకు.

నేను వెళ్తున్నాను నీ తిప్పలు ఏమో నువ్వు పడుకో , అంటూ తన బ్యాగు సర్దుకో సాగింది సుప్రజ. ఏయి   సుప్రజా నువ్వు  ఇప్పుడు వెళ్లావు అంటే మా అమ్మ వాళ్లకు ఇంకా అనుమానం వస్తుంది.  వద్దు నువ్వు వెళ్ళకు కానీ నాకు ఇష్టం లేని పెళ్లి నేను ఎలా చేసుకోవాలి అంది గునుస్తూ కరుణ .

ఏమో తల్లి నాకు ఇలాంటివన్నీ తెలియవు . నేనైతే నా పేరెంట్స్ ఎవర్ని చూపిస్తే వాళ్లనే చేసుకుంటాను, ఎలా చెప్తే అలా వింటాను. ఎందుకంటే మన పేరెంట్స్ మనకు ఏది మంచిదో ముందే ఆలోచించి పెడతారు. అందువల్ల నేను నా తల్లిదండ్రులు చెప్పిన మాటనే వింటాను అంది సుప్రజ .

సుప్రజ మాటలతో ఆలోచనలో పడిన కరుణ నువ్వు చెప్పింది నిజమే,  కానీ ఈ పెళ్లి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి అటు అమ్మ వాళ్ళు బాధ పడకూడదు.  నాకు చెడ్డపేరు రాకూడదు. కానీ నేను అనుకున్న విధంగా ఎంజాయ్ చేయాలి అంది కరుణ సుప్రజ తో.

నువ్వు అనుకున్న విధంగా జరగాలి అంటే ఏం చేయాలి నాకేం తట్టడం లేదే అంటూ ఆలోచనలో పడింది.  తాను కూడా సుప్రజ. ఇద్దరూ దీర్ఘంగా ఆలోచిస్తూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు.

ఇంట్లో పెళ్లి పనులు హడావిడిగా ఉంది.  ఎవరు వీళ్ళ గురించి పట్టించుకోవడం లేదు ఇద్దరు స్నేహితులు చాలా రోజుల తర్వాత కలిసి మాట్లాడుకుంటున్నారని అలా వాళ్ళని వదిలేశారు . కానీ వీళ్ళు ఇద్దరు ఇలా ఆలోచిస్తూ ఉన్నారనే విషయం ఎవరికీ తెలియదు.

చాలా సేపు ఆలోచించిన తర్వాత సుప్రజ ఐడియా అంటూ గట్టిగా అరిచింది . ఏంటి చెప్పు, త్వరగా చెప్పు త్వరగా అంటూ సుప్రజ దగ్గరికి వచ్చిన కరుణ తనని ఊపుతూ గట్టిగా అడగ సాగింది. అబ్బా ఆపవే తల తిరుగుతోంది. అలా ఊపకు నేను చెప్పేది కరెక్టో, కాదో నాకు తెలియదు.

కానీ ఆలోచన అయితే వచ్చింది చెప్తాను , కాస్త మంచి నీళ్ళు తాగనివ్వు అంది మంచం మీద కూర్చుంటూ సుప్రజ. ఇప్పుడు నీళ్లు తాగకపోతే నువ్వేమి చావవు  కానీ ముందు ఐడియా ఏంటో చెప్పి చావే అంది కరుణ చిరాగ్గా, ఇదిగో ఇలా చిరాకు  పడ్డావు అంటే నేను అసలే చెప్పను పో,  అంది బుంగమూతి పెడుతూ సుప్రజ.

అబ్బా ఆపవే బాబు ఇప్పుడు నువ్వు అలగకు కానీ  నిన్ను బ్రతిమాలే  ఓపిక నాకు లేదు . ఆ ప్లాన్  ఏంటో  చెప్పు  ఇదిగో నీళ్ళు  నేను తీసుకొచ్చి ఇస్తానులే అంటూ  కరుణ వెళ్ళి  టేబుల్ మీద ఉన్న గ్లాసులో నీళ్ళు  పోసి ఇచ్చింది కరుణ . అది అలా రా దారికి అంది  సుప్రజ గ్లాస్ తీసుకొని నీళ్లు తాగుతూ…

అబ్బ ప్లీజ్ చెప్పవే తొందరగా, నన్ను ఇలా చంపకు, నాకు చాలా ఆత్రుతగా ఉంది.  అది ఏంటో తెలుసుకోవాలి  అని అంది ఆత్రంగా కరుణ. 

మరి అది ఏంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా?  అయితే మీరు వచ్చే నెల వరకు ఆగాల్సిందే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *