సంఘర్షణ పార్ట్ 5
మొదటి నాలుగు భాగాలు చదివిన తర్వాత ఇది చదవండి …
అమ్మా నేను వెళ్లి నాన్నగారి ని తీసుకుని వస్తాను అమ్మ అంది కరుణ.
నువ్వా వద్దు తల్లి ఆ ఫణి భూషణ్ రావు మంచి వాడు కాదమ్మా , నువ్వు వెళ్తే నిన్ను అక్కడే ఉంచేస్తాడు అంది కంగారుగా అనిత.
మనం ఇలా భయపడితే ఎలాగమ్మా నాన్న లేకుండా ఎలా మరి అయినా ఇంకెవరైనా ఉన్నారా వెళ్ళడానికి అంది కరుణ .
ఎవరూ లేరమ్మా కానీ నువ్వు అడపిల్లవు ఒక్కదానివి ఎలా వెళ్తావు .వాడు ఏమైనా చేస్తే ఎలా అంది అనిత.
ఏదో చేస్తాడు అని చేతులు కట్టుకుని కూర్చుంటామా అయినా ఆడ, మగ, ఏంటమ్మా ఈ రోజుల్లో నేను వెళ్లి నాన్న ను తీసుకొని వచ్చేస్తాను అంది ధైర్యంగా కరుణ .
అవునమ్మా ఈ రోజుల్లో ఇంకా ఆడ మగ ఏమిటి ? అమ్మాయి గారు ధైర్యంగా వెళ్తాను అంటున్నారు కదా. మీరు సరే అనండి అమ్మాయి గారితో పాటు నేను కూడా వెళ్తాను అని అన్నాడు నవీన్.
ఇద్దరు వెళతారు సరే, మరి మిమ్మల్ని కూడా అక్కడే ఉంచేస్తే నాకు ఎలా తెలుస్తుంది. అంది అనిత ఆందోళనగా, తెలియడానికి ఏముందమ్మా, ఏం చేస్తాడు ఏమీ చేయడు.
నేను వెళ్లి సమాధానం చెప్పి తీసుకొని వస్తాను. నువ్వు బాధ పడకు వెళ్దాం అంటూ ముందుకు కదిలింది పెళ్లికూతురు ముస్తాబు లో ఉన్న కరుణ.
ఏమోనమ్మ నాకేం పాలుపోవడం లేదు. ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. కానీ చాలా భయంగా ఉంది. మన చుట్టాలు ఎవరినైనా వెళ్తారు. ఏమో నీకు తోడుగా వస్తారేమో అడుగుదాం అంది అనితమ్మ.
వద్దమ్మా, వద్దు నాన్నను కూర్చోపెట్టారు అని తెలిస్తే చుట్టాలలో పరువు పోతుంది అని అన్నావు. ఇప్పుడు వాళ్ళందరికీ చెప్పడం ఎందుకు? అవసరమా, నేను ఉన్నాను కదా ,నేను చూసుకుంటాను. వెళ్తున్న నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ నవీన్ తో పాటు ముందుకు కదిలింది కరుణ.
వెళ్తున్న వాళ్ళిద్దర్నీ చూస్తూ ఏడుకొండలవాడా, వెంకటరమణ, మమ్మల్ని ఎలాగైనా కాపాడు అయ్యా అంటూ దండం పెట్టుకుని అనితమ్మ.
***
ఒరే అరుణ్ ఇది విన్నావా అంటూ అరుణ్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు అనిల్.
ఏంట్రా ఏమైంది అంత గాభరా పడుతూనే వస్తున్నావ్ ఏం కొంపలు మునిగిపోయేది ఇప్పుడు అన్నాడు అసహనంగా అరుణ్.
ఒరేయ్ నీకు ఈ పెళ్లి జరిగేలా లేదురా నువ్వు సంతోషంగా ఉండొచ్చుగాక నువ్వు అనుకున్నట్లు పెళ్లి పెటాకులు అయ్యేలా ఉంది అన్నాడు సంతోషంగా అనిల్.
ఓరి నీ అబ్బ ముందు విషయం చెప్పు రా బాబు. ఆ తర్వాత తీరిగ్గా మనం ఆనంద పడదాము. అసలు మ్యాటర్ ఏంటి రా అది చెప్పు అన్నాడు అరుణ్ చికాకు పడుతూ.
ఒరేయ్ ఒరేయ్ ఎల్లుండి పెళ్లి పెట్టుకుని ఇంతవరకు మీ మామ గారు అనబోతున్న అనిల్ ని ఆపి మామగారు కాదు ఇంకా అవలేదు. కాబట్టి నువ్వు వరుసలు కలపకు అర్థమైందా ,అంటూ చెప్పి సరే ఇప్పుడు చెప్పు ఏమైందో అన్నాడు అరుణ్.
సరే, సరే కూల్ కూల్ బాబు కూల్ ,నీకు కాబోయే మామగారు ఇంతవరకు మీరు రావడానికి బస్సు పంపించలేదు. మిమ్మల్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు.
అంటే ఇక రారు అన్నమాట మీరు వెళ్లకపోతే అక్కడ పెళ్లి జరగదు. నువ్వు అనుకున్నట్టుగానే నీ పెళ్లి పెటాకులు అవుతుంది అన్నాడు సంతోషంగా అనిల్.
నీ బొంద నువ్వు చెప్పింది అన్నది ఏం బాగా లేదు. నీకు మా నాన్న గురించి తెలియదు. ఎలాగూ స్నేహితుడే కాబట్టి ఖర్చు ఎందుకు దండగ అని ఎవరూ రాకుండా మేమే వస్తామని చెప్పారేమో ఎవరికి తెలుసు.
అయినా ఇల్లలకగానే పండగ కాదు. వాళ్ళు ఎవర్ని పంపక పోయినంత మాత్రాన పెళ్లి జరగదని అనుకోలేం. మా బాబు ఉన్నాడే ఆయన పెద్ద ముదురు. ఎప్పుడు ఏం చేస్తాడో ఎలాంటి షాక్ ఇస్తాడో అసలే తెలియదు.
మనం ఇప్పుడే సంతోష పడకుండా జరిగేది చూద్దాం అన్నాడు అరుణ్ కూల్ గా …
ఓర్నీ నేను ఎంతో సంతోషంగా ఈ విషయం చెప్పాలని వస్తే, నువ్వేంట్రా గాలి తీసేసావ్ అన్నాడు అనీల్. అవును రా బాబు మా నాన్న పెద్ద ముదురు అని చెప్పాను కదా ,ఇప్పుడు ఏలాంటి షాక్ ఇస్తాడో చూస్తూ ఉండు నీకే అర్థమవుతుంది అన్నాడు అరుణ్.
ఇంతలో ఒరేయ్ అరుణ్ ఎక్కడ ఉన్నావు అంటూ తండ్రి పిలుపు వినిపించింది. అదిగో చూసావా , పిలుపు లు మొదలు అయ్యాయి. అంటూ అనిల్ తో అన్నాడు అరుణ్ . అది చూద్దాం అన్నాడు అనిల్.
హడావుడి పడుతూ వచ్చిన శంకర్రావు గారు అరుణ్ నీ చూస్తూ ఇంకా ఇక్కడే ఉన్నావు ఏంట్రా, పద పద బస్ వచ్చేసింది. వెళ్లి ఎక్కి కూర్చో రేయ్ నువ్వు కూడా నీ లగేజ్ అంతా తీసి బస్ లో పెట్టుకో, ఏ ఒక్కటి మర్చిపోయినా మళ్లీ రావడం కుదరదు కాబట్టి, నువ్వు అన్ని చూసుకుని సర్ధుకో పదండి అంటూ హడావుడి చేశారు.
ఆ వెళ్తున్నాం నాన్న అదే మాట్లాడుకుంటున్నాం అంటూ అరుణ్ అక్కడి నుండి లోపలికి వెళ్ళాడు. అనిల్ మాత్రం అదేంటి అంకుల్ అమ్మాయి వాళ్ళు బస్ ఇంకా పంపలేదు, ఎవరు తీసుకు వెళ్ళడానికి రాలేదు కదా అన్నాడు, అయోమయంగా .
దానికి శంకర్రావు గారు ఆ దానికేముంది అసలే అమ్మాయి పెళ్లి హడావుడి లో పడి మర్చిపోయి ఉంటారు. అందుకే వాళ్ళు రాకున్నా, నేనే మా స్నేహితుడి తో మాట్లాడి బస్ ఏర్పాటు చేశాను.
అసలే వాడికి మతిమరుపు కాబట్టి నేనే ఇలా ఏర్పాటు చేశాను. అయినా నీకెందుకయ్య ఇవ్వన్నీ, వెళ్లి నీ స్నేహితుడి కి ఏం కావాలో చూసుకో ,అంటూ ఇదిగో ఏమొయ్ నువ్వు అన్ని సర్దేసావా అంటూ లోనికి వెళ్ళాడు హడావుడి గా..
అమ్మో ఏమో అనుకున్నాను కానీ అంకులు ఘటికుడు అరుణ్ గాడు చెప్పింది నిజమే. అనుకుంటూ ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా ఏమైనా అంటాడేమో అని అరుణ్ వెనకాలే పరిగెత్తాడు అనిల్.
మరి ఇంతలా రెడీ అయి వెళ్తున్న వీళ్ళకు మూర్తి గారి సమస్య తెలుస్తుందా లేదా మూర్తి గారు తన సమస్యను ఎలా తీర్చే స్తారు. కరుణ ,అరుణ్ ల పెళ్లి జరుగుతుందా లేదా చదవండి తదుపరి భాగంలో….
-భవ్యచారు
అబ్బో అరుణ్ తండ్రి ఘటికుడే…
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌