సంగీత సాహిత్య సమలం కృతే
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా స్వప్నం నా ముంగిట నిలిచింది,
ఎన్నో పోరాటాలు, అలకలు, తిట్ల మధ్య నా కల నెరవేరింది
అన్నం మానేసిన రోజులూ, అర్ధాకలితో గడిపిన క్షణాలు
సూటి పోటి మాటలతో ఎత్తి పొడుపులు,
అత్తగారి చివాట్లు, మామగారి మౌనం,
భర్త గారు నిర్లక్ష్యం, ఆడపడుచు వేధింపులు,
గొడ్రాలు అనే సమాజం చిత్కార చూపులు,
బావగారి రహస్య బూతు మాటలు,
మరిది గారు చూసే ఆకలి చూపులు,
పక్కింటి బాబాయి గారు వేసే బూతు జోకులు,
అవన్నీ అవన్నీ మర్చిపోయి,
మారిపోయి ఇక భరించలేనంత బాధను కూడా అర్థం చేసుకోలేని తల్లిదండ్రులను వదిలి,
నాకు నచ్చిన, నా జీవిత ఆశయం కోసం అందర్నీ వదిలి ఈ అనంత ప్రపంచం లోకి ఆశగా, స్వేచ్ఛగా అడుగులు వేస్తూ,
నా ఆశ, శ్వాస అయినా సంగీత సాధనకై,
పంజరం విడిచిన రామచిలుకలా ఎగిరిపోయి ఇదిగో ఇక్కడ ఈ నిశ్శబ్ద తరంగాలు నాలో అణువణువు సంగీతాన్ని నింపగా నా హృదయం ఉప్పొంగి పోతుంటే ఇంకేం కావాలి ఈ జన్మకు… నా చివరి శ్వాస వరకు ఇదే నా కోరిక. సంగీత సాహిత్య సమలం కృతే…. .
– భవ్య చారు