సంస్కారం
చదువుకోవడం వల్ల సంస్కారం అబ్బుతుందని మన తల్లిదండ్రులు మనల్ని చదివిస్తారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వాళ్ళు తిన్నా, తినకపోయినా తాము చదువుకోలేదని తమ పిల్లలైనా చదువుకోవాలని ఆశపడి కష్టపడుతూ రెక్కలు ముక్కలు చేసుకొని చదివిస్తారు.
ఉద్యోగం చేస్తాడని, తమను ఉద్ధరిస్తాడని కాకుండా తన బ్రతుకు తాను బ్రతుకుతాడని సంస్కారవంతంగా అందరితో మెలుగుతాడని భావించి చదివిస్తారు. అయితే చదివిన అందరూ సంస్కారవంతులు కాకపోవచ్చు. చదువు లేని వారంతా సంస్కారులు అవ్వచ్చు.
ఇక్కడ చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం అనేది జన్మతా రావాలి లేదా పరిస్థితులను బట్టి తమ కుటుంబ సభ్యులను బట్టి రావాలి అయితే కుటుంబమైన వ్యవస్థ అయిన కొందరి మనుషుల మీద విపరీత ప్రభావం చూపిస్తుంది. అయితే చదువుకున్నా కూడా సంస్కారహీనులుగా ప్రవర్తించే కొందరి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
ఈ మధ్య సోషల్ మీడియా అనేది చాలా మంది కి చాలా కామన్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏదో ఒక సోషల్ మీడియాలో అకౌంట్ తెరవడం వారికి నచ్చిన హీరో నో హీరోయిన్ ఫోటలతో హల్చల్ చేయడం, రీల్స్ లో డైలాగ్స్ చెప్పడం లాంటివి ఎన్నో జరుగుతున్నాయి.
అలాంటి సోషల్ మీడియాలో ఒకటి ట్విట్టర్ ఇందులో రకరకాల వ్యక్తులు వారి వారి అభిరుచికి అనుగుణంగా రాయడం వంటివి చేస్తుంటారు. అలాగే ఫేస్ బుక్, ఇన్స్ స్టాగ్రామ్ లాంటి వాటిల్లో కూడా తమకు వచ్చిన ప్రతిభతో కొందరు రాణిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చింది.
చదివిన వారు, చదువు లేని వారందరు ఇందులోకి రావడం మంచి మార్పే కానీ ఇప్పుడు కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అదెలాగంటే ఫేక్ ఐడి లతో అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ఆడవారిని తిట్టడం, అశ్లీల మెసేజ్లు ఫొటోలు వీడియో లు పంపడం. వారికి వ్యక్తిగతంగా సందేశాలను పంపుతూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు.
చదువు రాని వారంతా అమ్మ, అయ్య అని మాట్లాడుతూ ఉంటే చదువు వచ్చిన వారంతా నీ అమ్మ, నీ అయ్యా అని మాట్లాడడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. ఇంకా యూ ట్యూబ్ లో అయితే డబ్బులు వస్తాయి అంటూ పిచ్చి వీడియోలు చేస్తూ అశ్లీల ప్రాంక్స్ పేరిట వదులుతూ డబ్బులు సంపాదిస్తున్నారు.
చాలా మంది ఈజీ మనీ కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తామేం చేసినా జనాలు చూస్తారు అనుకుంటూ ఇలాంటి చేస్తున్నారు. అందులోనూ చదువు ఉన్న వారే అధికులు. ఒకరి తో మరొకరికి లింకులు (ఈ మాట అనడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా అనక తప్పడం లేదు) అంటగడుతూ బూతు మాటలు మాట్లాడుతూ దిగజారి పోతున్నారు.
ఇదంతా చదువుకున్న మూర్ఖులే ఈజీ మనీ కోసం కొందరిని తమ వైపు తిప్పుకోవడం కోసం చేసే చిల్లర వేషాలుగా భావించవచ్చు. చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే అందులో ఎంత కూరుకుపోయారో అర్థమవుతుంది. ఈజీ మనీ కి అలవాటు పడిన వారు కూడా పెద్ద చదువులు చదివి ఉన్నత ఉద్యోగం చేసే వారే.
ఇదే తరహా వాళ్లు ఫేస్బుక్లో ట్విట్టర్లో మనకు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటారు వాళ్లు ఇలా అనడం వల్ల పొందే రాక్షస ఆనందం ఏమిటో ఎవరికి అంతుపట్టదు. ఒకరిని నిందిస్తూ మరొకరితో అక్రమ సంబంధాలను అంటగట్టడం వల్ల వారికి ఒరిగేది ఏమిటో అర్థం కాదు. చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగాన్ని చేసుకోక ఉచితంగా వచ్చే డబ్బు కోసం ఎంతకైనా దిగజారే జనాలను చూస్తుంటే జాలి పడక తప్పడం లేదు.
ఇలాంటి వాళ్లు ప్రతీ సోషల్ మీడియాలోనూ మనకు తారస పడుతూనే ఉంటారు. వారిని చూసి జాలిపడి మానసిక రోగులుగా గుర్తించి పక్కకు తప్పుకోవడమే మనం చేసే పని. అంతేతప్ప మనమేదో వారిని ఉద్ధరించాలని అనుకోవడం మన పొరపాటే అవుతుంది.
ఎందుకంటే మానసిక రోగుల్ని ఎవరూ మార్చలేరు అది జగమెరిగిన సత్యం. అందుకే పెద్దలు ఏనాడో చెప్పారు చదువుకున్న వాడికన్నా చాకలి మేలు అని. మీకు కూడా ఇలాంటి వ్యక్తులు ఎప్పుడో ఒకప్పుడు తారసపడే ఉంటారు ఈ సామెత నిజమని మీరు నమ్ముతారా? ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఎదురయ్యాయా? సమీక్ష రూపంలో తెలపండి ధన్యవాదాలు.
– అర్చన