సంస్కార విద్యా వర్థతే.!
రేయనగా..పగలనకా..ఏ కష్టాన్ని లెక్కచేయక..
రెక్కలు ముక్కలు చేసుకుని..కాసిన్ని డబ్బులు పోగేసి..
తాము పస్తులుండి..బిడ్డల ఆకలితీర్చే తల్లిదండ్రులు..
తమకు లేని చదువును..పిల్లలకు అందించే ఆరాటంలో
కొత్త బట్టలు కొడుక్కి కొనిచ్చి..తాము చిరిగిన దుస్తులేసి
మోటారు సైకిల్ వాడికిచ్చి వారు కాలినడకన పనులకేగి
లోపల మంచం వాడికేసి..వారు ఆరుబయట పరుండి
సుఖ నిద్రను పుత్రునికిచ్చి దోమలతో చేసే సావాసంలో
పిల్లాడి చదువు కోసం..పచ్చని పొలాన్ని తాకట్టుపెట్టి
పరీక్ష ఫీజుల కోసం..పుస్తెలతాడును తెగనమ్ముకుని
జల్సాల కోసం ఇంకా వేధిస్తున్నా మారతాడని నమ్మి
వాడి భవిష్యత్తు కోసం సమిధలై చేస్తున్న యజ్ఞంలో
అలసిపోయిన అమాయక అమ్మానాన్నలకేం మిగిలింది
రెక్కలొచ్చిన పిల్లలు తల్లిదండ్రులను బరువనుకుంటే
చదువిచ్చిన సంస్కారాన్ని మరిచి కన్నవారినే కాలదన్ని
ఎండకన్నెరగకుండా పెంచిన వాళ్లనే నడివీధిలోకి నెట్టేస్తే
ఇది కాదు చదువంటే..ఇది కాదు సంస్కారమంటే..
జన్మనిచ్చిన వారికి జీవితాన్నర్పించాలనుకున్నప్పుడు
చదువు చెప్పిన గురువుల పాదాలను కడిగినప్పుడు..
సంస్కారంతో నిండిన విద్య సార్థకమై ప్రకాశిస్తుంది.!
– ది పెన్