సమ్మక్క -సారక్క(మేడారం జాతర)

సమ్మక్క -సారక్క(మేడారం జాతర)

1 తే.గీ.
ఓరుగలు జిల్ల మేడార మూరి వనము
మాఘ శుద్ధ పౌర్ణమి నాటి మంచి దినము
నవతరించెను సమ్మక్క అడవి తల్లి
పులులు సింహాలు కాపలా పుట్టినపుడె
2 తే.గీ.
కప్పమును కట్టలేకుండె కరువు వల్ల
కాకతీయుల సైన్యము కసిని బూనె
యుద్ధమున కోయరాజుల ఊపిరాగె
కాకతీసేన.రాజుల కక్ష తీరె
3 తే.గీ.
సమరమందున జంపన్న అమరుడాయె
ఎర్రబారెను సంపెంగ యేరుయంత
రెండు యేండ్లకు ఒకమారు మెండుగాను
మొక్కు లిడుదురు తల్లికి మొక్కవోక
4 తే.గీ.
సమరమున దూకె సమ్మక్క సారలమ్మ
తల్లి బిడ్డల నెదిరించ తరముగాక
కాకతీయుల సైన్యము కలత నొందె
వెన్ను పోటున గొట్టిరి వెనుక నుండి
5 ఆ.వె.
ఆది వాసి నంత ఆతల్లి గాపాడ
నెమలి నారచెట్టు నెలవు గాగ
కుంకుమా భరణిగ కూర్చున్న తల్లికి
గద్దె కట్టి పూజ గరపినారు
6 తే.గీ.
కుంభ మేళను తలపించు క్రుంకులిడుచొ
కోట్ల కొలదిగా భక్తులు కొలువ వచ్చు
పసుపు కుంకుమ గాజులు పళ్ళు పూలు
గద్దె పై బెల్లమేయుచు కావుమంద్రు
7 తే.గీ.
కాకతీ వేల్పు రాజుకు కలలొ వచ్చి
“తప్పు సవరించు కోకుంటె ముప్పు వచ్చు”
మరల మేడార మారాజు మరలి వచ్చి
ఏలుకొనుడని స్వేచ్ఛను యిచ్చి వెడలె
8 తే.గీ.
మూడు రోజుల జాతర మురిసి కొలిచి
కానుకలు యిచ్చి దేవిని కన్నులార
“చల్లగా చూడు”మని వేడి “మరల వత్తు”
మనుచు వనదేవతల మొక్కి వెను దిరుంగు

 

 

-కోట పెంటయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *