సంబరం

సంబరం

 

ఆనందాన్ని వ్యక్తపరిచే క్షణాలనొదిలేసి
రిక్తహస్తాలను తలుచుకుని బాధపడటమెందుకు
బతుకును “రెక్కీ” చేయక
రెక్కలమర్చు !

నవ్వుకునే సందర్భాలు కళ్ళు చెమరించిన దృశ్యాలు
బొమ్మా బొరుసులా మారుతూనే ఉంటాయి
కాలం మాయాజాలం
కళ్ళపై తెరలు కప్పుతుంటే
జారిపోయిన కలను వెతుకుదాం
ఏ అర్థం స్ఫురిస్తుందో ఎవరికి ఎరుక
కినుక వహించిన మనసుకో కానుక ఇవ్వు!

నిన్న నేడు రేపు ఊరిస్తాయి,వేధిస్తాయి
జమిలిగా జతకట్టి
నిను ముందూ వెనక్కు జరుపుతుంటాయి
అనుభూతుల జారుడుబల్లపై
ఎక్కిదిగటం నేర్చుకుంటే
ఇంకిపోయిన బతుకులో నేరేడు మొక్కను నాటినంత సంబరమిక!

 

-సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *