సైనికుడి స్వగతం
నేనో జవాన్ ని…
ఈ దేశం విసిరిన బాణాన్ని
పహరా కాసే ప్రాణాన్ని
విలువలేని జీవాన్ని…!!
సరిహద్దుల్లో
జీవితపు హద్దులు చెరిపేస్తూ
మృత్యువుకే ముద్దులు పెడ్తూ
మరణాల కౌగిలింతలతో
దోబూచులాడుతూ…
ఎవరికీ ఏమీకాని
ఏకాకినై…!!
మీకు దూరమై
మిమ్మల్ని అనాథల్ని చేస్తూ
జీవితంలో ఓడినా…
తుపాకీలో తూటానై
యుద్ధంలో గెలుస్తాను…!!
అందుకే
ఏం జరిగినా…
నాకోసం నువ్వేడవొద్దు…
పిల్లల భవిష్యత్తే
నీ కన్నీటిచుక్కని తుడిచేస్తుంది…
అమ్మానాన్న పదిలం…!!
ఎటొచ్చీ నువ్వే…
అమాయకురాలివిగా…
నేను లేకుండా
నువ్వెలా…!??
నీలో నవ్వెలా…!??
నను తొలిచేస్తుంది ఈ ప్రశ్నే…!!
సమాధానం…….
నీ కన్నీటిచుక్కంత ఉప్పది…!!
నా దేశమంత గొప్పది…!!
-గురువర్ధన్ రెడ్డి