సాగిపో మిత్రమా
ఆలోచనలన్నీ కిరణాల తోరణాలై
వెలుగులు చిమ్ముతూ ఉంటే
మనసంతా ఆశల దీపాల కొలువు
హారతి పడుతు ఆశయాలన్నీ వేడుక చేస్తాయి
అనుమానాల అగాథంలోకి జారిపోతున్న ప్రతిసారీ
మార్గం చూపే మాధవుడు నీలోనే ఉంటాడు
నిశీధి మాటున నీకు గురిపెట్టే నిరాశకు అడ్డుగోడవుతాడు!
కాలం జారిపోతుంటే
కలల వాహినిలో మునిగి తేలకు
నిన్న నేడు రేపుల సంగమమై
కర్తవ్యం దారిలో ఒంటరిగానైనా సాగిపో మిత్రమా!
-సి.యస్.రాంబాబు