సార్ధకత చేకూరిన క్షణం
నిత్యం చేసే జీవనయానంలో తారసపడే
అమానవీయ ఘటనలెన్నెన్నో
రోజూ చదివే దినపత్రికలు మోసుకొచ్చే
అఘాయిత్యాల అకృత్యాలెన్నో
ఇంటి నుండి బయటకి రాగానే తారసపడే
ఆకలికై అలమటిస్తూన్న అభాగ్యులెందరో
కారణాలేవైనా నడిరోడ్డున పడ్డ మధ్యతరగతి జీవితాల
చేదు అనుభవాల సంఘటనలెన్నెన్నో
కులమనీ మతమనీ ప్రాంతమనీ
వేర్పాటువాదుల విధ్వంస చిత్రణలెన్నో
చుట్టూ సభ్యసమాజంలో కనులముందే జరిగినా
నాకెందుకనుకునే మనుషుల నడుమ
అనాధల ఆర్తనాధాలని మనసుతో వింటూ
చేయూతనిచ్చు స్థోమత లేకున్నా సాయం చేస్తూ
ఉన్నంతలో పక్కమనిషికి సాయమందించిన క్షణంలో
మనసున కలిగే ఆనందం అనుభవైకవేధ్యమే
అపుడు ఆ క్షణాన మనిషి జన్మకు సార్ధకత లభించినట్లే…
నీ జన్మకు పరమార్ధం చేకూరినట్లే…
– ఉమామహేశ్వరి యాళ్ళ