రోమాంచిత వాస్తవం
అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నా! మాది గవర్నమెంట్ స్కూల్ కావడంతో చదువు అంతంత మాత్రమే ఉండేది.. అందులో నేనింకా డల్ స్టుడెంటునే! దాంతో ట్యూషన్ కి వెళ్లేదాన్ని ఇంగ్లీష్ కి లెక్కలకి.. మా వీధి చివరలో ఉన్న నర్సింహ రెడ్డి సార్ దగ్గరకు.. ఆయనేమో ఉదయం అయిదు గంటల నుండే క్లాసెస్ చెప్పేవారు..
అయితే రోజూ నన్ను మా అక్కనో అమ్మనో అన్ననో దింపేవారు.. ఒకరోజెందుకో ఎవరూ లేవ లేదు సరెలే నాకేమన్నా భయమా? ఈ చివరకే కదా! ఆ మాత్రం వెళ్లలేనా? అనుకుని ధైర్యంగా బయలు దేరాను.. మా వీధిలో అన్నీ పెద్ద పెద్ద చింత చెట్లు ఉంటాయి.. ఆ చీకట్లో చింత చెట్లు దయ్యాల్లా కనిపిస్తున్నాయి.. ఎంతో ధైర్యంగా బయలు దేరిన నాకు భయం ఆవహించింది..
వెనుక ఎవరో వస్తున్నట్టు గుండె వేగంగా కొట్టుకోవడం మెుదలైంది రోమాలన్నీ నిక్కపొడుచు కుంటున్నాయి.. పరిగెత్తినట్టే ఎలాగోలా ఆ పెద్ద గేటు తీసుకుని సార్ వాళ్లింట్లోకి దూరాను అంతే!! ఆ రోమాంచిత వాస్తవం తలుచుకుంటే ఇన్నేళ్లకైనా భయం కలుగుతుంది..
ఆ ఒక్క రోజే అలా వెళ్లాను మళ్లీ ఎప్పుడూ మా అమ్మ అలా పంపించ లేదు.. ఎందుకంటె ఆ ఆరోజు అలా భయపడి జ్వరం తెచ్చుకున్నా మరి అందుకే అమ్మ ఎప్పుడూ ఒంటరిగా పంప లేదిక.. అమ్మ ఉంటే ఎంత బాగుంటుంది కదా!
– ఉమాదేవి ఎర్రం