రెక్కల మీద నిలబడిన అమ్మాయి మూడవ భాగం

 రెక్కల మీద నిలబడిన అమ్మాయి మూడవ భాగం

జరిగిన కథ.. వసుంధర హరి అనాధలుగా ఆశ్రమంలో పెరిగి అక్కడే చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు.. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు..

వసుంధరకు మొదటినించీ తనకో కుటుంబం వుంటే బాగుణ్ణు అని వుండేది..అందువల్ల హరితో పెళ్లికి ముందే ఒక అనాధ దంపతులను వృద్ధాశ్రమం నుంచి దత్తత తీసుకుందాం అని షరతు పెడుతుంది.

హరి దానికి అంగీకరిస్తాడు. ఒక ఆదివారం నాడు సాయినాథ వృద్ధాశ్రమానికి వెడతారు..అక్కడ మానేజర్ కి చెప్పి అక్కడ వున్న ఓ జంట గురించి అడుగుతారు..

ఇక చదవండి..
#దత్తత ( మూడవ భాగం)..

“వారి గురించి పెద్దగా తెలీదమ్మా! ఈ మధ్య ఆరు నెలలే అయ్యింది వాళ్ళు వచ్చి. పెద్దగా ఎవ్వరితోనూ మాట్లాడరు .పెట్టింది తిని వారిమానాన వారుంటారు…మీరు ఓపిగ్గా రేపు వస్తే వారితో మీరు మాట్లాడడానికి ఏర్పాటు చేస్తాను..” అన్నాడు మానేజర్.

సరే అని బయలుదేరారు వసు హరి.. ఆ తరువాత ఇంకా భోజనానికి ముందు ఒకటి భోజనం అయ్యాక ఒకటి ఆశ్రమాలు చూసారు.. మిగతావి తర్వాత చూద్దాం అనుకున్నారు..వసుంధర వల్ల కావడంలేదు , అవి చూసొచ్చి సాయంత్రం అయిదయే సరికి వసుంధరకు తలనొప్పి వచ్చేసింది.. ” హరి కొంచెం కాఫీ తాగుదామా.. బాగా తలనొప్పిగా వుంది..” అన్నది వసు..

ఇద్దరూ హోటల్ కి వెళ్లి కాఫీ ఆర్డర్ చేశారు.. వసు హ్యాండ్ వాష్ దగ్గరకు వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చి కూర్చుంది…తన మనస్సంతా కకావికలం అయిపోయింది…

” ఏమిటి హరీ ఇది!! చూస్తున్న కొద్దీ గుండె మనస్సు రెండూ బరువెక్కిపోతున్నాయి.. ఇంత మంది తమ తల్లి తండ్రులను రోడ్డు మీద వదిలేశారా!! ఎంత నిర్భాగ్యులు వాళ్ళు..కుటుంబం యొక్క విలువ తెలిస్తే కదా!.. దేవుడు వాళ్లకు ముందునుంచే ఆ అదృష్టం ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి ఆ విలువ తెలీదు… చిన్నప్పటి నుంచీ గోరు ముద్దలు తినిపించి ఏ టైం కి ఏం కావాలో ఆ టైం కి అన్నీ చేసి పెట్టి పెంచే తల్లి , ఏది కావాలన్నా కొనిచ్చే,ఎంత చదువుకున్నా అప్పు చేసైనా సరే చదివించి ,పోషించే తండ్రి వుంటే , ఆ బాల్యం ఎంత చీకూ చింతా లేకుండా గడుస్తుంది.. ఎంత బావుంటుంది ఆ జీవితం.. అది లేకే కదా మనం అంత బాధ అనుభవించాం! జీవితంలో ఈ లెవెల్ కి రావడానికి ఎంత సంఘర్షణ పడ్డాం మనం!.. వేళ్టికి సరైన తిండి లేక సరైన ఆలనా పాలనా లేక ఎంత ఇబ్బందుల్లో మన జీవితం గడిచింది!.. అంత బాగా చూసుకున్న ఆ పెద్ద వాళ్ళను వారి మలిదశలో ఇంత ముద్ద పెట్టి , నాలుగు మాటలు ఆదరణగా మాట్లాడితే వాళ్ళ సొమ్మేం పోతుంది..అలాంటిది వాళ్ళని దిక్కూ మొక్కూ లేకుండా ఇలా ఎక్కడో వదిలేయడం అమానుషం కదూ!! అలాంటి వాళ్ళకి పుట్టగతులుంటాయా అస్సలు?” అన్నది ఎంతో ఆర్ద్రంగా..తలనొప్పితో తల పగిలేట్టు వుంది తనకు..ఇంతలో కాఫీ వస్తే ఇద్దరూ చెరో కప్ తీసుకుని తాగడం మొదలుపెట్టారు..

” హ్మ్ ..నిజమే!..మనిషికి ఏది లేదో అదే కావాలి.వున్నది అక్కర్లేదు..ఏం చేస్తాం?” అన్నాడు..

“అంటే నేను కోరింది కూడా నాకు లేని దాని మీద వ్యామోహంతో అది సంపాదించడానికే అని ఒకవేళ నిజంగా నాకు తల్లి తండ్రులు వుంటే వాళ్ళని పట్టించుకునే దాన్ని కాదు అనా నీ ఉద్దేశ్యం?” సూటిగా అడిగింది వసు, చాలా కోపంగా వుంది తనకి..

” అహ.. అలా కాదు వసు.. జనరల్గా జరిగేది చెప్పాను.. అంతే కానీ నీ ఉద్దేశ్యం తప్పని కాదు…నీలా అందరూ ఆలోచిస్తే ఈ వృద్దాశ్రమాల అవసరమే వుండదు కదా!!”అన్నాడు హరి..

” సరే ..రేపు ఎలాగూ నీకు నాకు వర్క్ వుంటుంది.. సాయంత్రం కొంచెం పర్మిషన్ తీసుకుని ముందుగా వచ్చావంటే ఆ ఆశ్రమానికి వెళ్లి ఆ దంపతులను కలిసొద్దాం.. సరేనా!!” అన్నాడు హరి.. వసు తన అంగీకారం తెలిపింది…

ఆ తర్వాత ఇద్దరూ కొంచెం సేపు మాట్లాడుకుని తర్వాత ఎవరి మార్గాన వాళ్ళు వెళ్ళిపోయారు..

మర్నాడు సోమవారం సాయంత్రం ఇద్దరూ కలిసి సాయినాథ వృద్ధాశ్రమానికి వెళ్లారు..
ఆశ్రమం మానేజర్ వీళ్ళని చూసి కూర్చోమని ప్యూన్ని పిలిచి ” ఆ ముప్ఫైరెండో రూంలో వున్న ప్రసాదరావు గారిని వారి భార్యను పిలుచుకు రా!” అన్నాడు..

వెంటనే హరి” సర్! మీకభ్యంతరం లేకపోతే మనమే అక్కడికి వెడదాం ..పాపం వాళ్ళని ఇక్కడికి పిలవడం దేనికి? ” అన్నాడు..

అతను సరే అని ప్యూన్తో ” సరే మేమే అక్కడికి వచ్చి మాట్లాడతాం అని చెప్పు.. ఇంకో రెండు నిమిషాల్లో అక్కడ వుంటాం అని చెప్పు” అని అన్నాడు….అలాగే అని ఆ ప్యూన్ వెళ్ళిపోయాడు..

“వాళ్ళకి నిన్న చెప్పానండి.. ప్రసాదరావు గారైతే విని పగలబడి నవ్వారు.. మీరు కొంచెం తేడా అని కూడా అన్నారండి..వారు అంత ఈసీ గా ఒప్పుకోరనుకుంటారని నేననుకోను…. మీ ఇష్టం మరి వారితో ఏం మాట్లాడతారో ఎలా ఒప్పించుకుంటారో !” అన్నాడు మానేజర్…
హరి వసుంధర అలాగే మాట్లాడి చూద్దాం అని అన్నారు…

ముగ్గురూ ఆ రూంలోకి వెళ్లారు. అదో చిన్న రూం అక్కడే పక్కన బాత్రూం కూడా వుంది . ఆ కాస్త చొట్లోనే మంచం కూడా వేసి వుంది.. అది కాక ఇంకో చిన్న కుర్చీ వుంది.. ప్రసాదరావు గారు వాళ్ళని అక్కడే మంచం మీద కూర్చో మన్నాడు తను చిన్న కుర్చీలో కూర్చున్నాడు..ఆ పెద్దావిడ మానేజర్ గారు నుంచుని వున్నారు…. హరి వసుంధర వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు..

ప్రసాదరావు” నా పేరు ప్రసాదరావు..ఈవిడ పేరు లక్ష్మి….నిన్న నిరంజన రావుగారు( ఆశ్రమం మానేజర్) మీ గురించి చెప్పారు.” అన్నాడు.. ఇంతలో మానేజర్ గారికి ఏదో ఫోన్ వచ్చిందంటే ఆయన వెళ్ళిపోయారు..

“మరి మీ అభిప్రాయం ఏమిటండి?” హరి అన్నాడు..
ఆయన లక్ష్మిగారు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు

“బాబూ! ఎందుకయ్యా మీకీ ఆలోచన వచ్చింది? అనవసరమైన శ్రమ కదా.. ఏదో మీకు మాకూ కూడా జీవితం నడిచిపోతోంది అలా నడిచిపోతే చాలదా!.. మళ్ళీ కొత్తగా ఈ బంధాలు అనుబంధాలు ఎందుకు? ఈ వయస్సులో మళ్ళీ మళ్ళీ జీవితంలో దెబ్బలు తినే ఓపిక మాకు లేదు..మమ్మల్ని వదిలేయ్ బాబూ!” అన్నాడు..

” మేము చిన్నప్పటినుంచీ అనాధలుగా నే పెరిగాం అండి.. ఇప్పుడు మాకు రెక్కలు వచ్చాయి, మేం మా బ్రతుకులు మేం బ్రతికే స్థితికి వచ్చాం..మాకు మీలాంటి దాతలేవరో పోషించబట్టే కదా ఈ స్థితికి వచ్చాం..మాకు మళ్ళీ తిరిగి ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు మాకు తోచింది మేం చెయ్యడంలో తప్పు లేదు కదండీ.. అదే కాక మాకు తల్లి తండ్రుల ఆదరణ అభిమానం కావాలన్న పిపాస కొద్దీ మేం మిమ్మల్ని అర్ధిస్తున్నాం.. మా కోరికను కొంచెం పెద్ద మనసు చేసుకొని మన్నిస్తారని ఆశ పడుతున్నాం..” అన్నాడు హరి..

“అస్సలు మా గురించి మీకేం తెలుసని మీరు మమ్మల్ని ఎంచుకున్నారు?” అడిగాడు ప్రసాదరావు..

” మీ గురించి ఏమీ తెలియనక్కరలేదు నాన్నగారు! మీరు చెప్తానంటే వినడానికి సిద్దమే.. కాదనం . లేదంటే మీ గతంతో మాకు సంబంధం లేదు.. ఇహ మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు అనేదానికి సమాధానం మా దగ్గర లేదు…బహుశా ఏదో జన్మల ఋణం వుండకపోతే మిమ్మల్ని చూడగానే నాకు మీరే నా తల్లి తండ్రులుగా వుండాలని అనిపించదు కదా!! నేను నా చిన్నప్పుడు ఎవరైనా ఆశ్రమానికి వచ్చి పిల్లలని దత్తత చేసుకుని తీసుకెడుతుంటే ఎవ్వరూ నన్నెందుకు తీసుకెళ్ళరు అని అనిపించేది..కానీ నాకు తర్వాత్తర్వాత అర్థం అయ్యింది .అది ఏ జన్మలోనో వారికి వారికి సంబంధం వుండి వుండాలి అందువల్ల వారు ఇప్పుడు కలిశారు అని.. అలాగే ఇది కూడా అని ఎందుకు అనుకోకూడదు? మాకు భార్యా భర్తలుగా వున్న జంట కావాలని వెతుకుతున్నాం.. మీరు మాకు ఆది దంపతులలాగా దర్శనమిచ్చారు..దయచేసి మమ్మల్ని కాదనకండి నాన్నగారూ ” వరసకలిపేసి గుండె లోతుల్లోంచి దుఃఖం వస్తుండగా పూడుకుపోయిన గొంతుతో అర్ధించింది..

ప్రసాదరావుగారికి వసుంధర మాటల్లో నిజం ఆమె ముఖంలో నిజాయితీ కనిపించాయి.

” నువ్వు చెప్పిందంతా నిజమే కావచ్చు మీరు నిజంగానే ఆదరణ అభిమానాల పిపాసులు కావచ్చు కానీ మీకు కావల్సిన అర్హతలు మాకు లేవు.. మీరనుకున్నట్లు మేం భార్యా భర్తలం కాదమ్మా!” అన్నాడు..

-భరద్వాజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *