రెక్కల మీద నిలబడిన అమ్మాయిఐదవ భాగం
జరిగిన కథ: వసుంధర హరి అనాథలు, ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు..కానీ అంతకుముందు వారికో కుటుంబం వుండాలని పెద్దవారిని తల్లితండ్రులుగా దత్తత తీసుకోవాలని ఒక వృద్ధాశ్రమం చేరుకుని ఒక దంపతులను ఎన్నుకుని వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు..వారి కథ వింటారు..
ప్రసాదరావుది తుని నుంచి వలస వచ్చిన కుటుంబం .పట్నం వచ్చాక, అతని భార్య మరణం తరువాత, కొడుకు కోడలు ఆయన పట్ల నిరాదరణ చూపించడం జరుగుతుంది..మనవరాలి స్కూల్లో లక్ష్మి గారిని కలిసి ఆవిడ గురించి తెలుసుకుంటాడు..
ఆవిడ భర్తను కోల్పయి, కొడుకుని కష్టపడి చదివించుతుంది.. కొడుకు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్ళిచేసుకుని వస్తాడు. ఆ పిల్లకు అత్తగారంటే గౌరవం వుండదు.. పనిమనిషికన్నా హీనంగా చూస్తుంది.. ప్రసాదరావు గారు, లక్ష్మీ గారు ఒకళ్లగురించి ఒకళ్ళు తెలుసుకుని బాధపడతారు,ఆ తరువాత స్నేహంగా వుంటారు.. అది వాళ్ళ వాళ్ళ పిల్లలకు నచ్చదు..వారిని అవమానిస్తారు..
ఇక చదవండి
దత్తత ( అయిదో భాగం)..
ఆవిడ మొబైల్ లాగేసుకున్నారట.. ఇంట్లో పెట్టి తాళం వేసి స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే వెళ్లారట.. చాలా అసభ్యంగా మాట్లాడారని.. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే వృద్ధాశ్రమంలో చేర్చి వదిలేస్తామని, జీవితంలో మళ్లీ ఆవిడ ముఖం చూడమని , ఆవిడతో తెగతెంపులు చేసుకుంటామని బెదిరించారని చెప్పారావిడ… వాళ్ళ అంతరంగం నాకు పూర్తిగా అవగతమయ్యింది..
ఎలాగోలా ఈ ముసలాళ్ళ పీడ వదిలించుకోవడానికే ఇలా కోడిగుడ్డుకు ఈకలు పీకినట్లు ,ఏమీ లేని చోట గంటు పెట్టుకుని మరీ పొట్లాటకు సిద్దం అవుతున్నారని నాకు అర్థమైపోయింది నాకు తక్షణమే ఒక ఆలోచన వచ్చింది” అన్నాడు ప్రసాదరావు.
వెంటనే లక్ష్మీగారు కల్పించుకుని ” ఆ క్రిందటి రోజు రాత్రి వాళ్ళు నా గురించి మాట్లాడుకున్న మాటలు విని నాకు చెవుడొచ్చినా బాగుండేది అనిపించిందమ్మా… నేను ఈవయస్సులో శారీరక సంబంధంపెట్టుకోవడం కోసం మగ తోడుకోసం చూస్తున్నానని అది వాడితో చెప్తోంది..
“ఈపాటికే ఈవిడ ఎంత దూరం వెళ్లిందో తెలీదు.. నాకు వల్లి గారు చాలా మంచి ఫ్రెండ్ ఆవిడ ముఖం నేనెలా చూసేది ఇకనుంచి? ఛీ! ఛీ! ఏళ్లొచ్చాయి కానీ ఏం లాభం?..ఏం చేస్తోందో, ఏవిటో ఆలోచించక్కర్లా! అంత స్వార్ధమా! అయ్యో పిల్లలు ,వాళ్ళకి అవమానం జరుగుతుందేమోనని ఆలోచించక్కర్లా! తన ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా ప్రవర్తించడమేనా!” అని వాడికి చెప్తోంది ..
ఆ వెధవ దాని దవడ పళ్లు రాలగొట్టకుండా అది చెప్పిందానికల్లా ఊ కొడతున్నాడు.. వాడికి పదేళ్ల వయస్సులో మా వారు పోయారమ్మా.. పిల్లాడ్ని ఎవరికన్నా దత్తత ఇచ్చి , నన్ను మళ్ళీ పెళ్లి చేసుకొమ్మని మా వాళ్ళు ఎంతో నచ్చజెప్పారు నాకు….నాకు అలాంటి జీవితమే కావాలనుకుంటే ఇంతకాలం ఇలా వుండేదాన్నా? .ఒక్క క్షణం వాడు నాకు పుట్టలేదనుకుని వదిలేసి వెళ్లుంటే నా జీవితం ఎలా వుండేది?
ఎవరికోసం నా జీవితమంతా ఇలా అడవి గాచిన వెన్నెల చేసుకున్నాను..దానికిదా ఫలితం..”నోట్లో చెంగు కుక్కుకుని ఏడుపు మొదలెట్టిందావిడ..ఒక్క అంగలో వసు వెళ్లి ఆవిడని కావాలించుకుని ఓదార్చింది.. దాంతో ఆవిడ బాధ రెట్టింపై గట్టిగా ఏడ్వడం మొదలెట్టింది..
” పోనీ పసిపిల్లాడి ముఖం చూసైనా సద్దుకుపోదామనుకున్నా వాణ్ణి కూడా నాకు కాకుండా చేస్తున్నారు.. వాడికి ఏం చెప్పారో ఏమో నాతో మాట్లాడడం నాదగ్గరకు రావడం మానేశాడు.. ఇంకెవరికోసం నేను బ్రతకడం..ఏదైనా ఇంత పుచ్చుకుని హరీమందామనిపించింది..” అన్నది కళ్ళు తుడుచుకుంటూ..
మళ్ళీ ప్రసాదరావు గారు మొదలెడతూ “ఆవేల్టికి ఆవిడ్ని ఓదార్చి దీనికో పరిష్కారం చూస్తాననీ , ఆట్టే బాధపడొద్దనీ, తొందరపడి ఏ అఘాయిత్యం చెయ్యొద్దని చెప్పి ఫోన్ పెట్టేసాను ..
దేవుడి దయవల్ల నన్ను ఇంట్లో పెట్టి తాళం వెయ్యలేదు మా ప్రబుద్ధుడు.. ఎవ్వరూ కనబడకపోతే వాళ్ళూ స్కూలుకే అఘోరించారు కాబోలు అనుకున్నాను.. ఆలోచించి ఆలోచించి చివరికి ఆవిడతో చెప్పి ఒప్పించి ఇలా బయటకు వచ్చేసాము..మొదట ఈవిడ ఒప్పుకోలేదు ‘అలా బయటకు వెళితే బతికే దారి లేదు పైగా వాళ్ళ అనుమానం మనం నిజం చేసిన వాళ్ళమౌతాం’ అని అన్నారు…
నేను ‘వాళ్ళైనా మమ్మల్ని ఆశ్రమంలోనే కదా దింపుతామని బెదిరించారు వాళ్ళదాకా ఎందుకు మనమే ఆశ్రమంలో చేరదాం.. కనీసం ఒకచోట పడి వుంటాం కదా! వాళ్ళు మనని కాదనుకున్నాక, కనీసం సాటి మనుషులం, పెద్దవాళ్ళం , వాళ్ళని కన్నవాళ్ళం అన్న ధోరణి లేకపోయాక వాళ్లేమనుకుంటే ఏమిటి అది లెక్క చెయ్యక్కరలేదు’ అని చెప్పి ఆవిడ్ని ఒప్పించాను..
అన్ని బంధాలు వదిలించుకుని ఇలా బయట పడ్డాము.. మమ్మల్ని వెతికే ప్రయత్నం కూడా వాళ్ళు చేసినట్టు లేరు.. ఇప్పటికిప్పుడు ఈ వయస్సులో సంపాదించుకుని తినలేము కదా! ఎక్కడ తిన్నా ఈ ముష్టి కూడే!.. అది ఎలాగూ తప్పదనుకున్నప్పుడు ఎక్కడైతే ఏమిటి అని ఇలా వచ్చేశాం..
ఇప్పుడు చెప్పమ్మా మాకు మళ్ళీ ఆ బంధాలు అవసరమా? బ్రతికే కొన్ని రోజులు ఇలా ప్రశాంతంగా, ఒక్కళ్లకొకళ్ళం మనసులో మాట చెప్పుకోడానికైనా తోడుగావుంటూ ఇలా బ్రతికితే సరిపోదా మాకు?” అన్నాడాయన..
అన్నీ విన్న హరి ” మావయ్యగారు.. మీరిద్దరూ చాలా బాధను అనుభవించారు.. జీవితంపై రోసి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు కాదనను..కానీ మా నిర్ణయం కూడా అంతే గట్టిది.. మా వల్ల మీకు ఎలాంటి బాధ వుండదు..కాకపోతే మీ పిల్లలు మీ గురించి ఏమనుకుంటున్నారు , మిమ్మల్ని మళ్ళీ తీసుకెళ్ళి గౌరవంగా చూసుకునే ఉద్దేశం వుందా అనే విషయం మాకు తెలియాలి..
వాళ్ళు మారి మిమ్మల్ని పోగొట్టుకున్నాం అని బాధపడుతుంటే మిమ్మల్ని వాళ్లనించి విడదీయటం మళ్ళీ వాళ్ళను కూడా మాకు మల్లెనే పెద్దల అండదండలు లేకుండా చెయ్యడం భావ్యం కాదు , అది మా ఉద్దేశ్యం కూడా కాదు..ఒక్కసారి వాళ్ళ అడ్రస్ ఇవ్వడి..మీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీ పట్ల వాళ్ళ అభిప్రాయం కనుక్కుని వస్తాను..
వాళ్లకు గనక మీరు అక్కర్లేని పక్షంలో మాత్రం మీరు మాదగ్గరే జీవితాంతం వుందురు గానీ… మాకు పెద్దల అండదండలు కావాలి, మాకో కుటుంబం కావాలి. పుట్టబోయే మా పిల్లలికి అమ్మమ్మ తాతయ్యలు , వారి ఆలనా పాలనా అవసరం. వాళ్ళు మాకుమల్లే ఎవ్వరూ లేనివాళ్లలా పెరగకూడదు. వాళ్లకు ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటో వాటి విలువలు ఏమిటో తెలియాలి.. అది మాత్రం నూటికి నూరు పాళ్ళు జరిగి తీరుతుంది..” అన్నాడు దృఢంగా.
వసుంధర కళ్ళవెంబడి నీళ్ళు కారుతుండగా ప్రసాదరావు గారి పాదాల దగ్గర కూర్చుని ఆయన చేతులు పట్టుకుని ప్రాధేయ పడుతూ ” మాకు మీ అవసరం ఎంతైనా వుంది నాన్నగారూ! మీరు ఎలా జీవించదలచుకున్నా మీకు పూర్తి స్వాతంత్ర్యం వుంటుంది..
కావాలంటే అలా అని మేము రాసిస్తాము .. మీరు ఆనందంగా హాయిగా వుండటమే మాకు కావాల్సింది..” అన్నది.. పెద్దవాళ్ళిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. వసుంధర స్పర్శలోనే ఆమె యొక్కఆపేక్ష, ఆదరణ, ఆవేదన అర్థం అయ్యింది ఇద్దరికీ .
హరి వాళ్ళ దగ్గర వాళ్ళ పిల్లల అడ్రెస్స్ తీసుకుని ఇక బయలుదేరతామని , పూర్తిగా ఆలోచించుకొమ్మని చెప్పి ఇద్దరూ వెళ్ళిపోయారు…
ఆ మర్నాడు వసుంధర హరి సాయంత్రం పూట బయలుదేరి శ్రీనివాస్నీ రాఘవనీ విడివిడిగా కలిసొచ్చారు.. వాళ్ళెక్కడికెళ్ళారో వాళ్లకు తెలీదనీ, తెలిసినా వాళ్లకు అవసరం లేదని ఇప్పటికే సమాజంలో వాళ్ళ మూలంగా తాము ఎంతో అవమానాలపాలైనామని చెప్పుకొచ్చారు…
చూస్తుంటే వాళ్లకు పెద్దవాళ్లను వెతికే ప్రయత్నం ఏమీ చెయ్యదలచుకోలేదల్లే వుంది.. వాళ్ళు మళ్ళీ తిరిగొచ్చినా మళ్ళీ ఇంట్లోకి రానిచ్చేట్లు లేరు..కనీసం ఇంట్లోంచి బయటకెళ్ళిన వాళ్ళు ఎలా బ్రతుకుతారు..అస్సలు బ్రతుకున్నారా లేరా అని కూడా ఆలోచించడం లేదు వీళ్ళు..
వాళ్ళ ప్రవర్తనకు వసుంధరకు చెప్పలేనంత కోపం వచ్చింది.. కానీ హరి ఊరుకోమని సైగ చేసేసరికి తమాయించుకుని ఊరుకుంది.. పెద్దల అండ దండలు పొందలేని వీళ్ళు ఒట్టి నిర్భాగ్యులు అనుకొని వసు హరి బయటకు వచ్చేశారు..
ఇహ చేయవలసిందల్లా ఒక్కటే అని ఒక లాయర్ దగ్గరకు వెళ్ళారు..అస్సలు పెద్దవాళ్లను ఇలా లీగల్గా దత్తత తీసుకోవచ్చా , లేదా.. ఒకవేళ తీసుకోవచ్చు అంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, చేయవలసిన ప్రాసెస్ ఏమిటీ అని తెలుసుకోవడానికి…
-భరద్వాజ్