రెక్కలు మీద నిలబడిన అమ్మాయినాలుగవ భాగం

రెక్కలు మీద నిలబడిన అమ్మాయినాలుగవ భాగం

 

జరిగిన కథ.. వసుంధర హరి అనాధలుగా ఆశ్రమంలో పెరిగి అక్కడే చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు.. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు..వసుంధరకు మొదటినించీ తనకో కుటుంబం వుంటే బాగుణ్ణు అని వుండేది..అందువల్ల హరితో పెళ్లికి ముందే ఒక అనాధ దంపతులను వృద్ధాశ్రమం నుంచి దత్తత తీసుకుందాం అని షరతు పెడుతుంది. హరి దానికి అంగీకరిస్తాడు. ఒక ఆదివారం నాడు సాయినాథ వృద్ధాశ్రమానికి వెడతారు..అక్కడ మానేజర్ కి చెప్పి అక్కడ వున్న ఓ జంట గురించి అడుగుతారు.. మళ్ళీ మర్నాడు వచ్చి వాళ్ళని కలిసి ఒప్పించడానికి ప్రయత్నిస్తారు..కానీ వాళ్ళు అందుకు అర్హులు కాదని వాళ్లసలు భార్యా భర్తలే కాదని చెప్తారు…

ఇక చదవండి..

#దత్తత( నాలుగో భాగం)…

“ఏమిటీ!” వసు హరి ముక్త కంఠంతో ఒక్కసారిగా అడిగారు.

” హ్మ్..నిజం..మేం భార్యా భర్తలం కాదు..” అని ఆయన తన కథ చెప్పుకొచ్చారు…

” మాది తుని దగ్గర దేవవరం అనే పల్లెటూరు..నేను తెలుగు మాస్టారుగా ఒక ప్రైవేట్ స్కూల్లో పని చేసేవాడిని..నా భార్య పేరు శ్యామల.. మాకు ఒక్కడే కొడుకు పేరు శ్రీనివాస్. పెద్దగా ఆస్తిపాస్తులు లేని వాడ్ని, శ్యామల కూడా ఎంతో పొదుపుగా సంసారం సాగించడంవల్ల, పిల్లాడు కూడా కష్టపడి బాగా చదవడంవల్ల అప్పులు లేకుండానే నా రెక్కల కష్టం మీదనే వాడిని ఇంజనీరింగ్ వరకూ చదివించాను.. అక్కడే వాడికి ఒక స్టార్ట్ అప్ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది.. శ్యామల అన్న కూతురు వల్లినిచ్చి పెళ్లి కూడా చేశాం.. వాడికి ఒక ఆడపిల్ల .. అంతా బాగానే వుంది అనుకుంటూవుండగా ఎలా ఎవరివల్ల పుట్టిందో తెలీదు కానీ వాళ్ళకి హైదరాబాద్ వెళ్లి అక్కడ ఉద్యోగం వెతుక్కోవాలని బుద్ది పుట్టింది…ఎంత చెప్పినా వినలేదు.. ఇక్కడైతే నేనూ ఉద్యోగం చేస్తున్నాను, ఇంట్లో పెరిగే కూరలు నారలతో ఆట్టే ఖర్చు లేకుండా జీవితం నడిచిపోతోంది.. పిల్లను గవర్నమెంట్ స్కూల్లో వేస్తే పెద్ద జీతాలు కూడా వుండవు..జీవితం ప్రశాంతంగా నడిచిపోతుందిరా..పట్నంలో వుంటే ఇలా సాగదురా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను…అయినా వినలేదు వాడు ఇక్కడుంటే ఎదుగూ బొదుగూ లేని జీతం జీవితమూనూ , అక్కడైతే ఏదైనా ఎం.ఎన్.సిలో ఉద్యోగం చేస్తే బోలెడు జీతం, పిల్లకి మంచి కాన్వెంట్లో చదివించొచ్చు,జీవితం కూడా బాగుంటుంది, అక్కడైతే నేను కూడా ఉద్యోగం చెయ్యక్కర లేదు ..హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు..అంతే కానీ ఈ పల్లెటూర్లో పడి ఏడిస్తే ఏం లాభం అని ఒకటే గొడవ పెట్టాడు.. ఇహ తప్పక అందరం అక్కణ్నుంచి మకాం మార్చేశాం…

ఇక్కడికొచ్చాక పరిస్థితులన్నీ ఊహించిన విధంగా లేవు..బోలెడు అద్దెలు, పిల్లకి పెద్ద స్కూల్లో పెద్ద పెద్ద ఫీజులు , పట్నపు పొకడల వల్ల మారిన అలవాట్లు, పెరిగిన పరిచయాలు వాటికి తగ్గట్టు పెరిగిన ఖర్చులు.. వాటితో వాడి జీతం ఎక్కడా సరిపోయేది కాదు.. పొనీ నేను మళ్ళీ ఉద్యోగం చేద్దామా అంటే అసలే ఇది నగరం ఇక్కడ తెలుగు టీచర్లు ఎవరిక్కావాలి? అందుకని మా కోడలు తన పిల్ల చదివే స్కూల్లోనే ప్రైమరీ స్కూల్ టీచర్ గా చేరింది..దాంతో తను ఇంటిపని బొత్తిగా ముట్టుకునేది కాదు.. నేను బయట పన్లకి ,శ్యామల ఇంటి పన్లకి అంకితమై పోయాము… దాంతోటి శ్యామలకు ఆరోగ్యం పాడైంది… ఏమైందో తెలుసుకోడానికి, డాక్టరుకి చూపించడానికి ఎవ్వరికీ టైములు లేవు..నాకా ఈ వూరు కొత్త.. పోరగా పోరగా ఒకసారి తీసుకెళ్ళి డాక్టరుకు చూపించాడు శ్రీను.. హార్ట్ వీక్ అయిందని ఆవిడకు రెస్ట్ కావాలని చెప్పారు డాక్టర్.. కానీ ఆవిడకు రెస్ట్ ఎక్కడినుంచి దొరుకుతుంది?… ఓ వారం రోజులు వల్లి సెలవు పెట్టి చూసుకుంది… తర్వాత నుంచి పొద్దునే లేచి వంట మాత్రం చేసి వెళ్లేది కానీ మిగతా పన్లు?.. శ్యామల అలాగే లేచి మెల్లిగా అన్నీ చేసేది..ఆ రకంగా దాని ఆరోగ్యం పూర్తిగా పాడై ఒకరోజు పడుకున్న మనిషి లేవనే లేదు…

ఆవిధంగా తోడు కోల్పోయిన నేను చాలా రోజులవరకు మామూలు మనిషిని కాలేక పోయాను…వాళ్ళు మాత్రం మెల్లిగా వాళ్ళ రొటీన్ లోకి పడిపోయారు ..కొన్నాళ్లకు వల్లి ఉద్యోగం మారి ఇంకా ఎక్కువ జీతంతో వేరే స్కూల్లో జాయిన్ అయ్యింది..అప్పటినుంచి నాకు మిగతా పన్లతో పాటు పిల్లను స్కూలుకు తీసుకెళ్లే పని అదనంగా పడింది.. రోజూ స్కూల్లో దింపడం, క్యారియర్ పట్టుకెళ్ళి లంచ్ టైం లో పిల్లకు పెట్టడం , మళ్ళీ సాయంత్రం తీసుకురావడం చేసేవాడిని..

ఒకరోజు అక్కడే ఈ లక్ష్మి గారూ కనబడ్డారు. ఆవిడా వాళ్ళ మనవడికి అన్నం తీసుకొచ్చేవారు…. మా మనవరాలు,వాళ్ళ మనవడు స్నేహితులు కావడం వల్ల , ఇంకా క్లాస్మేట్స్ కూడా అవడం వల్ల వాళ్ళు అన్నాలు తిన్నాక కాస్సేపు ఆడుకుంటుంటే వుండి చూసేవాళ్ళం.. అప్పుడే మేం ఒకళ్లకొకళ్ళం పరిచయం అయినాము.. ఒకళ్ళ గురించి ఒకళ్ళం తెలుసుకున్నాము.. లక్ష్మి గారిది మరీ దారుణమైన కథ..

ఆవిడ ఒక కాలేజ్ లెక్చరర్ గారి భార్య. వాళ్ళకి ఒక్కడే కొడుకు… పెళ్ళై ఎన్నే ళ్లైనా పిల్లలు పుట్టకపోతే రాఘవేంద్ర స్వామికి మొక్కుకుంటే ఈ పిల్లాడు పుట్టాడట..రాఘవ అని పేరు పెట్టి అతన్ని చాలా గారాబంగా పెంచారట.. పిల్లాడిని మంచి స్కూల్లో వేసి చదివించుకుంటున్న టైం లో ఒక రోజు ఆవిడ భర్త కాలేజ్ నుంచి ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ జరిగి అక్కడక్కడే మరణించాడట… అసలే పల్లెటూరిలో పెరిగిన తను ,ఎప్పుడూ ఇల్లు దాటి బయట కాలు కూడా పెట్టి ఎరుగనిది , మొట్టమొదటి సారిగా పిల్లాడిని ఎలాగైనా పెంచి పెద్ద చెయ్యాలనే ఉద్దేశ్యంతో, వేరే గత్యంతరం లేక అదే కాలేజ్ లో ఏదైనా ఉద్యోగం ఇమ్మని యాజమాన్యం వారిని అర్ధించిందట.. వారు ఆవిడపై సానుభూతి చూపించి లైబ్రేరియన్ గా పనిచ్చారుట. అప్పటినుంచి కొడుకే జీవితంగా మనుగడ సాగించిందటావిడ.

రాఘవ బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో చేరగానే ఆవిడ కష్టాలన్నీ తీరాయని ఎంతో సంబరపడిపోయిందటావిడ.. కానీ అప్పుడే ఆవిడ కష్టాలు మొదలయ్యాయని తెలీదు పాపం ఆవిడకు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు రాఘవ ఒక అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చి పెళ్లి చేసుకున్నానన్నాట్ట.. ఆవిడ చూసి అవాక్కయిందిట.. ఏవిట్రా ఈపని అంటే మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందామని అనుకున్నాం కానీ వాళ్ళ వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు..తనకి వేరే సంబంధం చూసి పెళ్లి చేయబోయారు అందువల్ల వెంటనే మేము పారిపోయి పెళ్లి చేసుకావాల్సి వచ్చింది అన్నాట్ట.. కనీసం తనకైనా ముందుగా ఒకమాట చెప్పలేదని వాపోయిందట ఆ తల్లి.. ఆ తర్వాత ఏదైతేనేం పెళ్లే కదా చేసుకున్నాడు మంచిదే కదా అని, ఆవిడ కోడల్ని సాదరంగా ఆహ్వానించిందట.. అటువైపు ఆమె తల్లి తండ్రుల ప్రేమను కూడా తానే పంచాలని ఆశ పడిందట పాపం… కానీ దేనికో నెయ్యి అన్నం ఇమడదని సామెత కదా! ఈవిడ ఎంత బాగా చూసుకున్నా ఆ అమ్మాయికి ఈవిడ ఆచార వ్యవహారాలు నచ్చలేదట.. .ప్రతిదానికీ సాధింపులు అలకలుట.. ఈవిడ ఎంత సద్దుకున్నా ఎప్పుడూ ఏదో ఒక గొడవట..

కొన్నాళ్ళకు ఆమెకు పిల్లాడు పుట్టాడట ..అప్పుడు ఆవిడ తల్లి తండ్రి వచ్చి పిల్లాడిని చూసి కూతురిని అల్లుడిని ఆదరించి అభిమానించారుట.. ఆతరువాత నుంచీ వాళ్ళ మధ్య రాకపోకలు సాగాయట.. ఇంక వాళ్ళ వత్తాసు చూసుకున్న ఆ పిల్లకి అత్తగారంటే మరీ చులకన అయిపోయిందట. అటు కొడుకా పట్టించుకోడు.. కోడలేమో ఈరకం.. ఉద్యోగం వున్నంత వరకూ లక్ష్మిగారు ఒక విధంగా కొంత సేపైనా ప్రశాంతంగా వుండేవాళ్ళుట కానీ రిటైర్ అయ్యాక జీవితం మరీ పనిమనిషి కన్నా హీనం అయ్యిందట.. ఇంటా బయటా పన్లన్నీ తన నెత్తినే పడ్డాయట.. ” పన్లు చెయ్యడం నాకు కొత్త కాదండీ.. నా భర్త పోయిన దగ్గర్నుంచీ నేనే చేస్తూ వచ్చాను.. కానీ మనిషిని మనిషిగా కూడా చూడకపోతే ఎంత బాధగా వుంటుంది.. అత్తగారని కాదు కనీసం సాటి మనిషిని ,పెద్దదాన్ని అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ప్రతి చిన్నదానికి అవమానం చెయ్యడం,ఆఖరికి నా తిండి తిప్పల మీద కూడా ఆంక్షలు పెడుతుంటే ఎలాగండి బ్రతకడం.. నా ఇంట్లోనే నేను అడుక్కుని తినే దాన్నై పోయినట్లు అనిపిస్తోంది.. నాకు చావు కూడా రాదు..ఎక్కడికైనా పోదామంటే ఎక్కడికీ పోను ఇప్పుడు” అని భోరున ఏడ్చింది ఆవిడ.. నాకు చాలా బాధ వేసింది..కానీ నా బ్రతుకు అంతకంటే గొప్పగా ఏమీ లేదుగా అనిపించింది..

తల్లి తండ్రులు పిల్లల్ని కష్టపడి పెంచి పెద్ద చేస్తే చివరికి వాళ్ళు చేసేది ఏమిటి? వారికి వారి సంసారం పిల్లలు బాధ్యతలు వుంటాయి కాదనను కానీ తల్లి తండ్రుల బాధ్యత వుండదా వారికి?..ఆమాటంటే మేమేం తక్కువ చేశాం? తిండి బట్ట మందులు అన్నీ సమకూరుస్తూనే వున్నాం కదా! అని అంటారు..అంతేనా పెద్దవాళ్ళకు కావాల్సింది?..జైల్లో పెట్టినట్టు టైం టైం కి ఇంత కూడు పడేస్తే సరిపోతుందా? పిల్లలు తమను కూడా తమ కుటుంబసభ్యులుగా అనుకోవాలి , వాళ్ళతో మంచి చెడు మాట్లాడాలి.. అవసరం అనుకుంటే వారి సలహా తీసుకోవాలి. ఆదరంగా అభిమానంగా వుండాలి ..వారి ప్రేమను పంచి పెద్దవారి ఆశీర్వాదం పొందాలి అంతేకానీ ఎవరో మూడో మనిషి ,అక్కర్లేని మనిషి , వాళ్ళింట్లో వుండదగని మనిషిలా చూస్తే ఎందుకు వాళ్ళు అక్కడ వుండడం చెప్పండి.. అక్కడ వున్నా ఒకటే ఇదిగో ఇలాంటి ఆశ్రమాల్లో వున్నా ఒకటే… కాదంటారా?
చాలా రోజులు మేం మాట్లాడుకునే వాళ్ళం ఒకళ్ళని ఒకళ్ళం ఓదార్చే వాళ్ళం..
ఈ వయస్సులో కావాల్సింది మనసులో మాట చెప్పుకోవడానికి ఒక తోడు. దానికి ఎవరు ఏం పేరు పెట్టుకున్నా సరే. మేం మాత్రం దాన్ని స్నేహం అనే అంటాం..

కొన్నాళ్ళకు మా స్నేహం గురించి మా మా ఇళ్ళల్లో తెలిసింది.. శ్రీను ఎంతో దారుణంగా మాట్లాడాడు..”అమ్మ పోయి ఎన్నో ఏళ్ళు కాలేదు అప్పుడే నీకు వేరే తోడు కావాల్సివచ్చిందా?.. పిల్లను స్కూల్లో దింపిరమ్మంటే నువ్వు చేసే నిర్వాకం ఇదా? నీ వయస్సేమిటో కూడా మర్చిపోయి ఇలాంటి ప్రేమ వ్యవహారాలు నడపడానికి నీకు సిగ్గుగా లేదా ?”అని అన్నాడు..నేనేమైనా చిన్నావాడినా చితక వాడినా? ఇలా బోనులో నుంచోపెట్టి ముద్దాయిని అడిగినట్లు అడగడానికి నేను చేసిన తప్పేమిటి? .. నాకు చాలా అవమానం అనిపించింది… వాడికి పరిస్థితి ఇదీ అని వివరించబుద్ధి కూడా కాలేదు.. ” నువ్వు చేసిన నిర్వాకం చాలు గానీ ఇహనుంచీ ఇంట్లోనే వుండు బయటకు పోనక్కరలేదు” అన్నాడు గట్టిగా..అంటే!.. నా కదలికల మీద కూడా ఆంక్షలా!… తను మాట్లాడేది తన తండ్రితో అన్న జ్ఞానం వుండే మాట్లాడుతున్నాడా! .. మనస్సుకు ఎంతో బాధ వేసింది.. గదిలో శ్యామల ఫోటో ముందు కూర్చుని కన్నీరు పెట్టుకున్నాను.. ఇదిలా వుండగా లక్ష్మిగారు నాకు ఫోన్ చేశారు , అదీ వాళ్ళ లాండ్ లైన్ నుంచి.. అది విని నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు..

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *