రెక్కల మీద నిలబడిన అమ్మాయి చివరి భాగం
జరిగిన కథ: వసుంధర హరి అనాథలు, ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు..కానీ అంతకుముందు వారికో కుటుంబం వుండాలని పెద్దవారిని తల్లితండ్రులుగా దత్తత తీసుకోవాలని ఒక వృద్ధాశ్రమం చేరుకుని ఒక దంపతులను ఎన్నుకుని వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు..వారి కథ వింటారు.. ప్రసాదరావుది తుని నుంచి వలస వచ్చిన కుటుంబం .పట్నం వచ్చాక, అతని భార్య మరణం తరువాత, కొడుకు కోడలు ఆయన పట్ల నిరాదరణ చూపించడం జరుగుతుంది..మనవరాలి స్కూల్లో లక్ష్మి గారిని కలిసి ఆవిడ గురించి తెలుసుకుంటాడు.. ఆవిడ భర్తను కోల్పోయి, కొడుకుని కష్టపడి చదివించుతుంది.. కొడుకు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్ళిచేసుకుని వస్తాడు. ఆ పిల్లకు అత్తగారంటే గౌరవం వుండదు.. పనిమనిషికన్నా హీనంగా చూస్తుంది.. ప్రసాదరావు గారు, లక్ష్మీ గారు ఒకళ్లగురించి ఒకళ్ళు తెలుసుకుని బాధపడతారు, ఆ తరువాత స్నేహంగా వుంటారు.. అది వాళ్ళ వాళ్ళ పిల్లలకు నచ్చదు.. వారిని అవమానిస్తారు. ఆ తరువాత వారిద్దరూ ఇంట్లోంచి బయటికి వచ్చి వృద్ధాశ్రమం లో చేరుతారు..
వారి కథ విన్న హరి వసు వారి నిర్ణయం మారబోదని వారిని తప్పకుండా దత్తత తీసుకుంటామని వారి పిల్లల అడ్రెస్స్ తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు.. మర్నాడు వారి పిల్లల్ని విడి విడిగా కలిసి వాళ్లకు పెద్దవాళ్ళ పట్ల ఎటువంటి సదభిప్రాయం కానీ వారినిగురించి అక్కర గానీ లేదని తెలుసుకుని బాధపడి ఇక లాయర్ దగ్గరకు దత్తతకు కావాల్సిన ఏర్పాట్లు కోసం అడగడానికని వెడదాం అనుకుంటారు…
ఇక చదవండి. #దత్తత(చివరి భాగం)..
లాయర్ వల్లభరావు వయస్సులో పెద్దవాడు..అలాగే పేరుమోసిన లాయర్ కూడానూ…బాగా నిక్కచ్చైన మనిషి. ఉన్నది వున్నట్లు మొహం మీదే చెప్పేస్తాడు.. ఎప్పుడూ కూడా అధర్మం అని అనిపించిన కేసుని తీసుకొనే తీసుకోడు… అలాగే తీసుకున్న కేసుని గెలిచేదాకా వదలడు.. ఛార్జ్ కూడా అలాగే చేస్తాడు…వయస్సు మీద పడ్డా విషయ పరిజ్ఞానం కానీ, కోర్టులో కంచు ఘంటలా పలికే తన వాక్పటిమ గానీ ఎక్కడా తగ్గలేదు…
హరి వసుంధర ఇద్దరూ కలిసి ఆయన దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాలన్నీ ఆయనకు చెప్పారు..
” సర్, మాకు వాళ్ళు లీగల్ గా తల్లి తండ్రులుగా వుండటానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాల్సివస్తుందండి.. నాకు తెలిసి వాళ్ళ పిల్లలు వాళ్ళని మళ్ళీ కలవరనే అనిపిస్తోంది..వాళ్ళ దగ్గర్నుంచి నో అబ్జెక్షన్ లెటర్ ఏమైనా తీసుకురావాలంటారా? అవసరమంటారా?.. ఇంకా, వాళ్ళ సర్టిఫికెట్స్ ఏమీ మా దగ్గర లేవు. బహుశా వాళ్ళ దగ్గరా వుండి వుండవు…. అవేమైనా కావాలా సర్? అవసరమంటారా? ” గుక్క తిప్పుకోకుండా తను చెక్ లిస్ట్ లో రాసుకున్నవన్నీ టిక్ చేసుకుంటూ అడిగేశాడు…
ఇంకా ఏదో అడగబోయే లోపలే ” కాస్తాగవయ్యా! కొంచెం ఊపిరి తీసుకో!… మరీ అంత తొందరెందుకు? నేనూ ఎక్కడికీ పోను నువ్వూ ఎక్కడికీ పోవాయే…” అని..
” ఇప్పుడేవిటీ? ఆ పెద్ద వాళ్ళను దత్తత తీసుకుంటాం అంటారు అంతేనా!.. మీకు తెలుసా అస్సలు… పద్దెనిమిదేళ్లు లోపు పిల్లలను దత్తత తీసుకోవచ్చు కానీ అంత కంటేపెద్ద వాళ్ళను దత్తత తీసుకునే అవకాశం, అందునా ఒక పెద్ద వయస్సు వాళ్ళను తల్లితండ్రులుగా దత్తత తీసుకునే అవకాశం మన భారత రాజ్యాంగ వ్యవస్థ, న్యాయ శాస్త్రం కల్పించలేదని..” అన్నారాయన చిరునవ్వుతో…
ఇద్దరి మొహాలు నిరాశతో నిండిపోయాయి.. “అయ్యో! నిజమా! ” అన్నారు ముక్త కంఠంతో..
” వుండండీ! అలా నిరాశ పడిపొకండి మరీ!…మీకు ముందు కొన్ని విషయాలు చెప్పాలి.. చూడండి, మీరంటున్న ఆ పెద్దవాళ్ళు జీవితంలో చాలా ఢక్కా ముక్కీలు తిని వున్నారు కాబట్టి అంత తొందరగా ఎవ్వర్నీ నమ్మలేరు. మెల్లిగా బ్రతిమలాడి మీరే ఒప్పించుకోవాలి…అదలా వుంచి , వాళ్ళకా ఆస్తులు పాస్తులు లేవు, ఆరోగ్యం ఓ మాదిరిగా ఇప్పుడు బాగున్నా తర్వాత ఎలాంటి ఇబ్బందులు వచ్చినా రావచ్చు. అప్పుడు వాళ్లకు మందు మాకూ అనీ, హాస్పిటల్ ఖర్చులనీ సవాలక్ష వుంటాయి.వాళ్ళ వల్ల ఖర్చులు, లేని పోని తలనొప్పే తప్ప ప్రయోజనం వుండదు.. అదే కాక వయస్సొస్తున్న కొద్దీ చాదస్తం, ఆకలిబాధలు పెరుగుతాయి.. టైం టైం కి కరెక్ట్ గా, వాళ్ళు తినగలిగేట్టుగా చేసి పెట్టాలి. చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి.. పిల్లల్నైతే ఒక చరుపు చరిచి నోరు మూయించ వచ్చు కానీ వీళ్ళని అట్లా కాదు కదా!. చాలా ఓపికతో, శ్రద్ధతో చెప్పాలి, చాకిరీచెయ్యాలి.. అవన్నీ చూసుకునే వాళ్లకు ఇబ్బందులే మరి, అందువల్ల వాళ్ళ పిల్లలు వాళ్ళను మళ్ళీ వెనక్కి పిలుస్తారని నేననుకోను. కానీ ఆ సమస్య మీకూ వుంటుంది, అందువల్ల మీరు బాగా ఆలోచించుకొని ముందుకు రండి.. ఇప్పుడు మీరు వాళ్ళను తీసుకెళ్ళి దగ్గర పెట్టుకుని, కొంత కాలం తర్వాత మీరు కూడా వాళ్ళని భరించలేక మళ్ళీ ఆశ్రమానికే చేరిస్తే ఏ కోర్టు మీకు ఏ శిక్షవెయ్యక పోవచ్చు కానీ, అసలే గాయపడ్డ ఆ ముసలి హృదయాలు మీరిచ్చే ఆ షాక్ తట్టుకోలేవు.. వాళ్ల పిల్లల కంటే ఎక్కువగా మీరే వాళ్ళను ఇబ్బంది పెట్టిన వాళ్ళవుతారు….మీకు ఆ పాపం అంటుకుంటుంది…మీరు బాగా ఆలోచించే ఈ పని చేస్తున్నారా?” అన్నాడాయన..
హరి వసు ముఖ ముఖాలు చూసుకున్నారు..ఇద్దరూ దృఢంగా ” అవునండి ఆలోచించే చేస్తున్నాం ” అన్నారు..
” మరి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదు..చేసుకుంటారో లేదో తెలీదు..అది కూడా మీకు సమ్మతమేనా!” అడిగాడాయన..
“సర్ మాకు వాళ్ళ గతం కానీ వాళ్ళ ఇప్పటి వర్తమానం కానీ అక్కరలేదు..వాళ్ళ పెళ్లి అనేది వాళ్ళిష్టం..వాళ్ళు చేసుకుంటామంటే మేమే దగ్గరుండి చేస్తాం, లేదంటే వాళ్ళు అలాగే మా దగ్గర వుంటారు..మాకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు..వాళ్ళు మాకు పెద్దవాళ్లుగా వ్యవహరించడమే మాకు కావాల్సింది.. మా ప్రేమాదరణలు వాళ్లకు, వాళ్ళ వాత్సల్యం, ఆశీస్సులు మాకు వుండాలి..అంతే!” అన్నాడు హరి..
” మరింకేం! ఆ నమ్మకం మీదే వుండండి.. వాళ్ళను తీసుకెళ్ళి మీతో ఉంచుకోండి.. ఇంకేం కావాలి.. చూడు బాబూ! మనిషికి కావాల్సింది, తప్పొప్పులు తెలిసే విచక్షణ, ఇంకా మనస్సాక్షి ..తను చేసేది తప్పో ఒప్పో తనకే తెలుస్తుంది..తనకు మాత్రమే తెలుస్తుంది.. ఆ మనస్సాక్షి గొంతు నొక్కేసి తప్పు తప్పని తెలిసినా చేస్తూనే వుంటాడు మనిషి.. అలాంటప్పుడు ఏ కోర్టులు మాత్రం ఏం చేస్తాయి చెప్పు.. మనుషుల కోసమే ఈ క్రమశిక్షణలు, కోర్టులు ..అంతే కానీ వాటికోసం మనుషులు కాదు.. మీరు మంచి బుద్ధితో చేద్దామనుకుందిచేసెయ్యండి దానికి కోర్టుల అనుమతి అక్కర్లేదు.. మీ అంతరాత్మ, మనస్సాక్షే మీకు కోర్టులు. సరేనా!!
మీరు చేసే పని సామాన్యంగా ఎవ్వరూ చెయ్యరు.. స్వంతవాళ్లే ఎవ్వరూ పెద్దవాళ్లను ఇంట్లో ఉంచుకోకుండా గెంటేస్తున్నారు అందువల్లే కదా ఎక్కడ పడితే అక్కడ వృద్ధాశ్రమాలు పెరిగి పోతున్నాయి. అలాంటప్పుడు మీరు ఇలాంటి పని చేస్తున్నారంటే ఎంతో మెచ్చుకోదగ్గ విషయం. పర్సనల్ గా నాకు చాలా సంతోషంగా వుంది.. జీవితంలో ఎలా పుట్టాం, ఎలా జీవించాం అన్నది ముఖ్యం కాదు..ఎలా పోయాం అన్నదే ముఖ్యం జీవితమంతా కష్టపడి అలసిపోయిన ఆ ముసలి ప్రాణాలకు ప్రశాంత వాతావరణంలో దైన్యం లేకుండా జీవించి సంతృప్తిగా మరణించే అవకాశం ఇవ్వడమే వారికి మీరిచ్చే బహుమానం వారు అంతకంటే కోరేది ఏమీ వుండదు… భేష్ నాయనా! నీ సంకల్పం చాలా మంచిది..నువ్వూ నీ కుటుంబం మంచి వృద్ధిలోకి వస్తారు.. మీరు ముందు తరాల వారికి ఆదర్శవంతులౌతారు.. ఇంక నిర్భయంగా నిస్సంకోచంగా మీరు చేయదలచుకొన్నది చెయ్యండి” అని చెప్పారు…
హరి వసుంధర హమ్మయ్య అనుకొని గట్టిగా ,తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు..అక్కడ్నుంచి బయలుదేరి ఆశ్రమం చేరుకున్నారు..
వాళ్లకు వాళ్ళ పిల్లల దగ్గరకు వెళ్లిన విషయం లాయర్ దగ్గరకు వెళ్లిన విషయం.. వారంతా మాట్లాడింది, లాయర్ చెప్పిందీ అన్నీ చెప్పారు…
ప్రసాదరావు లక్ష్మి గార్లు వాళ్ళ పిల్లల విషయాలు విని చాలా బాధ పడ్డారు.. వారు తమను కాదనుకున్నప్పుడు తాము వాళ్ళను పట్టుకుని వెళ్ళాడడం మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చారు…
హరి వసు వత్తిడి మేరకు చివరికి సరే అనుకున్నారు.. అస్సలు అంతకు ముందు రోజే వారిద్దరూ హరి మాటకు ఒప్పుకుందామన్న నిర్ణయానికి వచ్చారు.. “చూద్దాం ఇదెలా వుంటుందో!.. ఒకవేళ మనకు అక్కడ కూడా చుక్కెదురైతే మళ్ళీ ఆశ్రమాలు వుండనే వున్నాయి కదా!!పాపం ఆ పిల్లను చూస్తుంటే చాలా మంచిదిలా వుంది.. పెద్ద వాళ్ళకోసం నిజంగానే ఎదురు చూస్తున్నట్టుంది ” అనంది లక్ష్మి… ప్రసాదరావు గారు కూడా అందుకు ఒప్పుకున్నారు.. ఆ విషయమే వాళ్లకు చెప్పారిప్పుడు..
హరి వసు ఎంతో సంతోషించారు..
ఇంక జరగాల్సిన కార్యాచరణ గురించి చెప్తూ హరి “నేను వసు జాయింట్ గా లోన్ పెట్టుకుని ఒక ఫ్లాట్ బుక్ చేశామండి.. అది ఇంకో ఆరు నెలల్లో వస్తుంది… అదీ కాక మేం కూడా వచ్చే నెలలో పెళ్లి చేసుకోదలచుకున్నాం అదీ మీ చేతుల మీదుగా.. ఆ తర్వాత అందరం కలిసే వుండొచ్చు.. ప్రస్తుతానికి మేం ఒక ఇల్లు అద్దెకు చూశాం .. దాంట్లో వసుంధర ఉండబోతోంది మీతో కలిసి.. రేపు ఆదివారం వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి మీ చేత పాలు పొంగించి షిఫ్ట్ అయిపోతుంది వసు… ” అన్నాడు ..
వసు లక్ష్మిగారి దగ్గర చేరి ఆవిడ ఒళ్లో తల పెట్టి పడుకుంది… ఆవిడ ప్రేమగా వసు తల నిమిరింది…
” బావుందోయ్ .. ఛాన్సు దొరికిందే చాలనుకుని దూరిపోయావా అత్తయ్యగారి దగ్గర” అన్నాడు నవ్వుతూ మురిపెంగా చూస్తూ హరి..
” మరీ! ఎన్నేళ్ళనుంచీ ఎదురు చూస్తున్నానని ఈ క్షణం కోసం” అంది వసుంధర తృప్తిగా లక్ష్మి గారి వంక చూస్తూ కళ్లమ్మట ఆనంద భాష్పాలు రాలుస్తూ…
ఓ ఏడాది తర్వాత….
హరి, వసుంధరల పెళ్ళై ప్రసాదరావు లక్ష్మి గార్లతో కలిసి వాళ్ళు కొనుక్కున్న ఫ్లాట్ లో వుంటున్నారు..అక్కడ అందరికీ వాళ్ళిద్దరూ వసు తల్లితండ్రులుగానే పరిచయం చేయబడ్డారు.. రోజూ ప్రొద్దున్నే వసుంధర లక్ష్మి గారు కలిసి వంట, టిఫిన్లు చేస్తారు..వసుంధర తనకు హరికి బాక్సులు కట్టుకుని ఇద్దరూ కలిసి ఆఫీస్ కి వెడతారు..సాయంత్రాలు అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకోవడం టి వి చూడడం చేస్తూ వుంటారు.. వారి మధ్య దాపరికాలు లేవు.. అందరూ కలిసే నిర్ణయాలు తీసుకుంటారు.. ప్రసాదరావు గారికి లక్ష్మి గారికి జీవితం ప్రశాంతంగా నడుస్తోంది..ఇల్లు నందన వనంలా వుంది.. ఇహ బుజ్జి గోపాలుడి రాక ఒక్కటే తక్కువ.. అది కూడా తొందర్లోనే జరుగుతుందనీ, వారి జీవితం ఇలాగే తృప్తిగా సాగుతుందని ఆశిద్దాం…
ఇది నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
– భరద్వాజ్