రంజాన్ నెలవంక
రంగుల టోపిని పెట్టుకుని
ఇష్టమైన అత్తరును చల్లుకుని
శుభ్రమైన మనసుతో
రంజాన్ వేడుక తలుపు తట్టింది నెలవంక
మొదటి ఒక్క పొద్దును
అల్లాకు సమర్పించి
ఖర్జూరపు తీపిని అందరికీ పంచింది
ఉపవాస దీక్ష ముగియగానే
మజీదు వద్ద నెలవంక
పావురాళ్ళకు గింజల్ని చల్లింది
వేసవి తీవ్రతకు వడలినా
సాయంకాలం కర్బూజ ఫలహారంతో
అల్లాకు ధన్యవాదాలు సమర్పించింది
తన ప్రయాణం తనది కాదని
నిర్దేశించిన గమ్యం నిరాకారునిదని తెలిశాక
పరుగును ఆపి పదుగురు మేలు కై
నమాజుకు మరింత ఇష్టంగా తలవంచింది
తన వెలుగు ఒక్కరికే కాక
అందరికీ పంచాలన్న అల్లా హుకూంకు
చందమామ ఎడారి సెగపై
వెన్నెలై కాసింది
గ్రీష్మం మునిమాపున
ఆయన మది ద్వారం చెంత
జమిలిగా ఫలహారములను
సామూహికంగా భుజించుట
ఎంత గొప్ప అనుభూతో…
-గురువర్ధన్ రెడ్డి