రామాయణం కాదనుకుని
‘మా ఆడపడుచులు మా తల్లులు సీతమ్మలు
మగసిరిగల దొరలంతా మా తండ్రులు రామయ్యలు
లేదూ రావణబాధ మాకు రాదు ఏ కొరతా
రాముడే దేవుడైన రామాయణమే మా కథ
మావూరి దేవుడమ్మా చల్లంగ మమ్మేలు రాముడమ్మా!’
వేటూరి కలంలో వెల్లివిరిసిన ఈ పదాలు వింటుంటే తెలుగింటి గుండెచప్పుళ్లలో రామతత్త్వం ఏ స్థాయిలో కలిసిపోయిందో బోధపడుతుంది.
రాముడనే మానవుడు కేవలం మానవశక్తినే ఆలంబనగా చేసుకుని ఎన్ని విజయాలు సాధించాడో, కొన్ని కాలానుగుణమైన నియమాలకూ, నిబంధనలకూ కట్టుబడి ఎందరికి ఆదర్శప్రాయంగా నిలిచాడో మన పెద్దలు కథలు కథలుగా వర్ణించి చెప్పేవారు. వాటిలో వాల్మీకి విరచితమైన విశేషాలు కాస్తా అనేక పర్యాయాలు రూపాంతరం చెంది క్రియేటివ్ లిబర్టీలతో పదులకొద్దీ రామాయణాలయ్యాయి.
అసలు రాముడి గుణగణాల్ని, తల్లిదండ్రుల పట్ల అతని బాధ్యతను, గురుభక్తిని, సోదరప్రేమను ఇప్పటి తరానికి చక్కని దృశ్యకావ్యంగా అందించాలంటే ఎంచుకోవాల్సిన అంశాలు కేవలం అరణ్యకాండ, యుద్ధకాండలొక్కటే కాదు.
ఆదిపురుష్ దర్శకరచయితల ఆలోచనా విధానం మొదటినుంచీ బోధపడుతూనే ఉంది. వారి ప్రచారం కూడా మనం శ్రద్ధగా గమనించినట్లైతే చెడుపై ధర్మపోరాటంలో అంతిమవిజయం న్యాయానిదే అన్న సింగిల్ పాయింట్ అజెండాతో కేవలం ఓ పదిపదిహేను సన్నివేశాల సమాహారంగా తమ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారు.
తత్ఫలితంగా ఈ చిత్రంలో సంభాషణలు తక్కువ. తక్కువంటే మామూలు తక్కువ కాదు. బాగా తక్కువ. నృత్యరూపకాల్లో ప్రధానంగా కేవలం వాద్యపరికరాలో, పాటో వినిపిస్తూ కథ నడిపించినట్టు వీళ్లు చాలావరకూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మీద ఆధారపడిపోయారు.
రావణుడు ఏమీ మాట్లాడడు. శూర్పణఖ ప్రోద్బలంతో జానకిని ఎత్తుకొచ్చెయ్యాలనే కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. సీత అనే మాటా వినబడదు, సీత మాటా వినబడదు. అసలు సీతమ్మ కనబడే సన్నివేశాలే నాలుగైదు.
రాముడిగా ప్రభాస్ చాలా బావున్నాడు. చూడచక్కని రూపం, శరీరదార్ఢ్యం, కళ్లలో తీక్ష్ణత భలే బావున్నాయి. సంభాషణలు కూడా అరవైశాతం మేర బానే పలికాడు. పట్టించుకోకుండా వదిలేస్తే వనకాలి, రావనుడు, వెల్తున్నాను, గురుంచి… ఇలా చిత్రవధ చేసిపారేశాడు. ఎక్కడ డార్లింగ్ అనేస్తాడోనని కంగారొచ్చేసింది. ఎందుకంటే మాటల రచయితే పెద్ద లోపం ఈ సినిమాకి. అవి ఏ కోశానా ఇతిహాస ప్రధానమైన చిత్రాల సంభాషణల్లా లేవు.
గుడ్డముక్క నీ బాబుదే, తైలమూ నీ బాబుదే… భజరంగ్
కాలిందా? కాల్తేనే అర్ధమవుతుంది… ఇంద్రజిత్
చంపుతా బిడ్డా… ఇంద్రజిత్
ఏమ్మాటాడుతున్నావు?…. జానకి
ఇక రావణుడు, అతని సోదరులు అప్పుడే జావెద్ హబీబ్ సెలూన్ నుంచి వచ్చిన మోడల్స్‌లా ఉన్నారు. మన బోయపాటి సినిమాల్లో విలన్లకిమల్లే క్రూరాతిక్రూరమైన చూపులు, బలిష్టమైన శరీరాలు, డిప్పకటింగులు, హెయిర్‌కట్ల మధ్య పైనాపిల్ చెక్కుళ్లు, బవిరి గెడ్డాలు… ఇవన్నీ పథకం ప్రకారం ప్రోపగాండా ఆలోచనతోనే చేశాడని బోధపడుతుంది.
ప్రతి మంగళవారం మన తెలుగిళ్లలో వినబడే ఎం.ఎస్.రామారావుగారి సుందరకాండలో లంకానగర వర్ణన కడు రమణీయంగా ఉంటుంది. అటువంటి నగరం ఇందులో చీకటి గుహలా ఉంటుంది. మాయల దయ్యాల కొలువులా కనబడుతుంది. గబ్బిలాలకు ఆవాసమై అలరారుతుంది. ఎక్కడా ఓ గదిగాని, ఓ పెద్ద శయన మందిరంగాని కనబడవు. ఏమూల చూసినా దీపకాంతి మినుకుమినుకుమని కనబడుతుందే తప్ప ప్రకాశవంతమైన సభామంటపంగాని, అనేకులతో కొలువుతీరిన రాజమందిరంగానీ కనబడవు. గుబులు గుబులుగా, గుండెలదరగా ఉంటుంది.
అసలు లంకలో జీవులే పట్టుమని ఓ అరడజనుమందిని చూపిస్తాడు. జీవులని ఎందుకన్నానంటే వాళ్లు ఏ జాతికి చెందినవారో మనకేకాదు, వారికీ తెలియదు కాబట్టి. ఓ పెద్ద మైదానంలో ఒకేఒక పూలచెట్టు. దానికింద ఆ చెట్టునుంచే రాలిపడిన లేత ఆకులా జానకి. మరీ ఎక్కువ చెట్లు, గాలీ ఉంటే కృతీ సన్నమ్మాయి ఎగిరిపోయే ప్రమాదం ఉందనేమో, అలా పెట్టాడు.
కొండచిలువలతో ఒళ్ళు మర్దనా చేయించుకునే రావణుడు, స్వయంగా కమ్మరివృత్తి చేపట్టి కత్తులు తయారుచేసుకునే రావణుడు, తాలిబాన్ల ఆకారంలో కళ్లకు సుర్మాతో సహా కనబడే రావణుణ్ణి చూస్తేనే అర్ధమవుతుంది దర్శకుడి ఆలోచనావిధానం. సరే, వదిలేద్దాం.
ఇక స్త్రీపాత్రలూ అంతే. మండోదరి ఒకట్రెండుసార్లు కనబడుతుంది. చాలా స్లిమ్‌గా నవనాగరికంగా ఉంటుంది. విభీషణుడి భార్యకి వైద్యం తెలుసన్న విషయం మనకు ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. అదొక చిత్రవిచిత్రమైన గ్రాఫిక్స్ డాక్యుమెంటరీ.
అయితే ప్రారంభంలో సన్నివేశాలు మాత్రం మహాద్భుతంగా తీశాడు. ముఖ్యంగా సీతారాముల అనురాగం, బంగారులేడి కోసం పరుగెత్తడం, లక్ష్మణుడు పటిష్ఠమైన రక్షణాకవచాన్ని నిర్మించడం… ఈ దృశ్యాలన్నీ మనకు విభిన్నమైన శైలిలో కనబడి ఓ కొత్తదనాన్ని పరిచయం చేస్తాయి.
మన పౌరాణికాల్లో సీతారాముల మధ్య ఏ దర్శకుడూ యుగళగీతం వినిపించినట్టు చూడలేదు మనం. లవకుశ మినహాయిస్తే అసలు రాముడికి సీతపట్ల అవ్యాజమైన అనురాగం, అమితమైన ఇష్టం వ్యక్తపరిచేలా ఓ నాలుగైదు సన్నివేశాలు కూడా రాసుకోలేకపోయారు. కాస్తలో కాస్త బాపురమణలు నయం. శ్రీరామరాజ్యం చిత్రంలో తాంబూలసేవనం సన్నివేశంలో సరస సంభాషణల ద్వారా సీతారాముల అన్యోన్యతను రమణీయంగా చూపించే ప్రయత్నం చేశారు.
ఇందులో సీతాపహరణం కూడా చాలా విచిత్రమైన పద్ధతిలో కనబడుతుంది. వశీకరణ, చేతబడి మొదలైన విద్యలతో మనిషిని బంధించి, వెనక్కి విరిచిన విల్లులా వంచేసిన శరీరంతో తనంతట తానుగా గాల్లోకి లేచేటట్టు చేసే మంత్రగాళ్ల పద్ధతి చూస్తే ఆ మాయావికి ఏదైనా సాధ్యమేకదా అనిపిస్తుంది. ఎంతసేపూ భూమిని పెకలించి సీతను ఎత్తుకుపోవడాలవీ చూసివున్న మనకు ఆ సన్నివేశం ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. ఆ దృశ్యం మొత్తం తమ నేపథ్య సంగీతంతో బాగా ఎలివేట్ చేశారు అజయ్-అతుల్.
వాలిసుగ్రీవుల పోరాట సన్నివేశాలు కూడా భీకరంగా ఉంటాయి. చుట్టూ వేలాది కోతులు, ఉర్రూతలూగుతూ, ఉద్రేకంగా అరుస్తూ రెచ్చగొట్టడం చూస్తే నిజంగా అలాగే జరిగివుంటుందన్న భావన కలుగుతుంది.
అసలు వానర, భల్లూకాల ఆవాసాలను కూడా కాగడాలు, గుడ్డిదీపాల వెలుగులో గుహాంతర్భాగాల మధ్య చూపడం బావుంది. జాంబవంతుడు, సుగ్రీవుడు మనకు హాలీవుడ్ నుంచి దిగుమతైన బాపతులా కనబడినా పెద్దగా ఫీలవ్వడానికేం లేదు.
వనవాసమంటే నిజంగా వనవాసమే. ఎటుచూసినా దట్టమైన వృక్షాలు, జలపాతాలు, పక్షుల కూతలు, సౌకర్యాల లేమి… తప్పనిసరి తద్దినం కదా? పదునాలుగేండ్ల వనవాసానికి పయనమైన రామయతండ్రిని ప్రతి భారతీయుడూ ఎందుకంతగా ప్రేమిస్తాడో తెలియాలంటే కొన్నేళ్లపాటు ట్రైబల్ సర్వీస్ చెయ్యాలి. కావలసింది కావలసివచ్చిన వెంటనే అందకపోవడం తెలుస్తుంది. సరైన సమయంలో వైద్యసహకారం లేకపోవడం బాధిస్తుంది. ఆపత్సమయంలో ఆదుకునేవారు లేకపోవడం అవగతమవుతుంది. ఇవన్నీ ఉంటాయని తెలిసీ కట్టుబట్టలతో తయారైపోయాడు. ఓ మెడికల్ కిట్ గాని, ఓ నాలుగుజతల బట్టలుగాని, అవసరార్ధం ఓ కత్తిగాని లేకుండా స్వశక్తినే నమ్ముకుని బయటపడిన రాముణ్ణి చూస్తే అందుకే అంత గర్వం మనకి.
ఇందులో రామలక్ష్మణుల్ని చూస్తే మనకు ఆ భావన కలుగుతుంది. అచ్చంగా అడవులపాలైన అన్నదమ్ముల్లానే కనబడతారు. సహాయం కోసం అలమటించే ఆక్రోశం బాగా చూపించగలిగారు. ఏ పరిస్థితుల్లో కోతుల్నీ, ఎలుగుబంట్లనీ చేరదీశారో అర్ధమవుతుంది.
అదంతా ముందుగా చేసుకున్న ఒప్పందంలా తియ్యడం అలవాటు మన పూర్వ దర్శకులకి. వీరి ఆగమనం అక్కడున్నవారందరికీ ముందే తెలుసన్న వాతావరణంలో చూపించారు పూర్వం. నిజానికి ఆ స్నేహానికి దారితీసే పరిస్థితుల్ని ఇందులో బాగా ఆవిష్కరించారు.
విలన్ని మరీ క్రూరంగా చూపించే అలవాటున్న బోయపాటి, రాజమౌళిల పంథాలో రావణాసురుడి సన్నివేశాలు రాసుకుని పెద్ద పొరపాటే చేశారు దర్శకరచయితలు. చేస్తే చేశారు, ఆ వేషాలేవీ మన పౌరాణికాలకు పొంతనలేకుండా చెయ్యడం, పీకలు కోసే పీటర్ హెయిన్స్ ఫైట్లతో మరింత పిచ్చెక్కించారు.
సగానికిసగం బాలేకపోతే మిగతాసగానికి సగం మార్కులు వెయ్యాలన్న మూడెలా వస్తుంది? ఆ కోపంలో ఓ రెండు దెబ్బలేసి మూడో, నాలుగో మార్కులేసేసి త్వరగా బయటికొచ్చెయ్యాలనిపిస్తుంది.
కోట్లమంది చూడాలనుకున్నప్పుడు వారికేది నచ్చుతుందో చూపించడం ఒక్కటేకాదు, వారికేది నచ్చదో తెలుసుకోవడమూ బాధ్యతే. అది మరిచిపోయి, తన బుర్రలో ఏ దెయ్యాలు తిరుగుతున్నాయో వాటన్నిటికీ ఓ రూపం కల్పించి టీజర్ల రోజులనుంచీ మనకొక అవగాహన కల్పిస్తూ వచ్చిన ఓం రవుత్ మంచి స్పష్టతతోనే ఉన్నాడని అర్ధమవుతుంది. మనకే అర్ధం కాలేదు. ఈవిల్ పవర్‌ని ఈవిల్స్ డెన్‌లానే చూపించాడు. నిస్సహాయుల్ని నిస్సహాయులుగానే ముందుకు తీసుకొచ్చాడు.
రామాయణం కాదనుకుని చూడండి. బాధనిపించదు.
-కొచ్చెర్లకోట జగదీశ్