రహస్యం
కళ్ళు మూసుకుంటే
కనిపించే చీకటికి వెనకాల
ఒక తలుపుంది
చడి చేయకుండా
నెమ్మదిగా లోపలికెళ్లాను
ఒక అందమైన మంద్రమైన
సంగీతం మోగుతూఉంది
ఆలకిస్తూనే
ఆ సంగీతం తెరల్ని కొంచెం
జరిపి ఇంకొంచెం లోపలికెళ్ళాను
మొన్నెప్పుడో
నన్ను వెన్నుపోటు పొడిచిన మనసొకటి
తన గాటుకు మందు రాసుకుంటూ కుట్లేసుకుంటూ కనపడింది
ఒళ్ళోకి తీసుకుని
జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి దువ్వి
కళ్ళల్లోకి చూస్తూ
లయ బద్దంగా జోకొడుతూ
హృదయాన్ని తాగించి ఊరడించాను
కళ్ళు మూసుకుంది
మెల్లిగా నిద్రలోకి జారుకుంది
మళ్లీ మెల్కోలేదు
ప్రపంచంలోని
దెబ్బలన్నింటికి
మందులు ఇక్కడే తయారవుతాయి
ఈ రహస్యాన్ని బయటకెళ్ళి అందరికీ చెప్పాలని
వేగంగా వెనక్కి వచ్చేసాను
-గురువర్ధన్ రెడ్డి