రాగం
*****
సంగీతంలో “రాగం”, చాలా ప్రధానమైన అంశం.
ఈ రాగం, లక్షణాన్ని బట్టి అనేక రకాలుగా క్రమ పరిణామం
చెందింది. కాబట్టే రాగాలు అనేక రకాలుగా ఆవిర్భవించాయి.
ఈ రాగాలు చాలాపురాతనమైనవి కూడా. సంగీత కచేరీల్లో
రాగాలాపనకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని కొన్ని రాగాలు చాలా విస్తృతమైన ఆలాపనకు యోగ్యమై ఉంటాయి. మన సంగీతంలో రాగాలు ప్రధానంగా రెండు రకాలు.
అవి జనక రాగాలు,జన్య రాగాలు.
జనక రాగాలను మేళ కర్త రాగాలని, రాగాంగ రాగాలని అని కూడా అంటారు. వీటి సంఖ్య 72. అందులో మొదటి 36, శుద్ధ మధ్యమ రాగాలు, తర్వాత వచ్చే 36, ప్రతి మధ్యమ రాగాలు. ఇక జన్యరాగాలు, వీటిని క్రియాంగ రాగాలని కూడా అంటారు. ఇవి అనేకం. ఈ రాగాలను వక్ర, వర్జ,ఉపాంగ,
భాషాంగ రాగాలుగా వర్గీకరించారు.
5 శతాబ్దికి చెందిన మతంగుడు, తన
బృహద్దేశి గ్రంథంలో రాగాన్ని గురించి, మొదట “యోసౌ ధ్వని
విశేషస్తు స్వర వర్ణ విభూషితః — రంజకో జన చిత్తానాం
సచరాగ ఉదాహృతః ” అని నిర్వచించాడు.
( స్వరాల కలయికతో పుట్టే ధ్వని విశేషం… జన
హృదయాలను రంజింప చేయాలి,. అప్పుడది రాగంగా
పరిగణింపబడుతుందని ఆ శ్లోకార్థం.) అలాంటి రాగాన్ని గురించి నాలుగు మాటలు మీతో పంచుకుందామని……
ఆలాపన
రాగం…
ఓ స్వర సంగమం
అదొక నాద ప్రవాహం
అద్భుత ప్రయోగం.
తరతరాలుగా స్వర పునాదులపై
నిలబడి వెలుగొందుతున్న
స్వర సౌందర్యం.
మనోధర్మ సంగీతంలో
మకుటం లేని రారాజులా…
వెలుగొందుతున్న స్వర శిఖరం.
ఆ ఆలాపన…
ఎన్నో గమక విధానాల్ని
తన హృదిలో నింపుకొని
విద్వాంసుని విన్యాసాలతో
వీనులు విందు చేస్తూ
అన్య స్వరాలతో అలరిస్తూ
రంజక ప్రయోగాలతో
రస హృదయాలను జోకొడుతూ
జంట దాటు వరుసలతో
త్రి స్థాయి ఆలాపనలతో
పాట వైభవాన్ని చాటే
స్వర సమ్మోహనం.
ఆ స్వర గమనం…
కోమల తీవ్ర స్వరాలను
వక్ర వర్జ సంచారాలను
సమయోచితంగా
తనలో ఇముడ్చుకొని
స్ఫురిత గమకాలతో
మనల్ని మైమరపిస్తుంది.
ఆ స్వర ఝరి…
జన హృదయాలను
రంజంపచేసే….
స్వర సంచార యోగం.
అది ఆదిగా….
మతంగుని బృహద్దేశిలో
మెరిసి మురిసిన, స్వర సమ్మేళనం
-గురువర్ధన్ రెడ్డి