రాచమార్గం
విశ్వనాధుల వారి వారసత్వాన్ని వినమ్రంగా పుణికి పుచ్చుకొని ‘విశ్వంభరం’గా ప్రభవించారు
విశ్వ సాహితీ సీమలో..!
తెలుగు భాష తేనియలను
కావ్య వసంతాలుగా మలచి మేధాక్షేత్రంలో మేరుపర్వతంగా నిలిచారు!
భారతీయతత్వాన్ని ఎల్లెడలా చాటిన సాహితీ హాలికులు మీరు!
మీ సహచర్యంలో తెలుగుతనం సాగరాలను దాటింది వినువీధులను మీటింది!
సహజ సిద్ధంగా అబ్బిన
శబ్దశక్తి, అర్థశుక్తి మీ కలాన్ని కదం తొక్కించింది గళానికి వన్నెలద్ధింది!
భారతీయ తత్వాన్ని ఎల్లెడలా చాటారు
తెలుగువాడి కలం వాడిని తేట తెల్లం చేశారు!
పటితులకు, ఔత్సాహికులకు అవకాశాలను విస్తృతం చేస్తూ
విరగని కలంతో
ఒరగని కలలతో
కాలం దామాషా ననుసరించి
కదిలి వెళ్లిపోయారు.
మీరు వదిలిన ఆనవాళ్లు
పాతిన మైలురాళ్లు రాబోయే తరాలకు రాచమార్గమే సినారె!
– మామిడాల శైలజ