రాబంధుల గూటికి పుల్లలై!
దినమేదో దినోత్సవమేదో
సంబరమేదో సంతర్పమేదో తెలియదు…
బతుకు పాఠాలు కడుపును నింపుకొనే
ఆకలి పోరాటం కొరకే కాని…హక్కుల కొరకై
పోరాడాలనే కార్మికునిగా చేయలేక పోయాయి
యుగానికొక పురుషుడైతే అవతారానికొక
రూపం మాది…
విషయంగా చెప్పుకోలేని పుక్కిటి
పురాణం మా జీవితం…ఒక దీనవ్యధ…
ఆశయాలను సాధించాలను కొంటే పూట
గడవని వైనంతో ఆకలి మంటల అర్పనలో
దేహాన్ని కాల్చుకొనలేక…కూటి కొరకు
కోటి విద్యలని అంకిత భావం లేని సంక్షేమ
పథకాలు యుక్తంలేని సూత్రాలై… పోరాటాల
ఆవష్యకథలకు దూరమవుతున్నాము…
అడిగే హక్కు స్వాతంత్ర్యమై పిలిచినా…
దగాకోరుల రాజ్యంలో అడుగు మెత్తధనం
అంకుశమై పొడువలేక… మా కొరిగిన
హక్కులు ఏమున్నాయని పోరాడాలి…
కరిగిన చైతన్యాన్ని పులిసిన వేదనతో
ముంచేస్తూ పగిలిన ప్రాయచిత్తాలతో
చరిత్ర పుటలలో మా కార్మిక దినోత్సవాన్ని
ఏ రోజును గుర్తించుకోవాలి…
భగ భగ మండే ప్రపంచాగ్నిని
ఏ లోపాన్ని పూరిస్తున్నావని అడగాలి…
మా హక్కల సూర్యోదయం ఎరుపెక్కలేక
నిరుత్సాహాల చలిమెలు ఎండిన చకోరాలై
నేనున్నాననే స్నేహపు బంధాలు…
రాబంధుల గూటికి పుల్లలై ఇరుక్కు పోయిన
మా బతుకున కార్మికుని జెండా పిడికిలి
కాలేక పోతుంది…
-దేరంగుల భైరవ