పుస్తక జ్ఞానం – లోక జ్ఞానం
తరుణ్ వరుణ్ ఇద్దరూ ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. ఇద్దరివి పక్కపక్క ఇళ్ళే, ఇద్దరూ చాలా తెలివిమంతులు. తరుణ్ వాళ్ళ నాన్నగారు బ్యాంకు మేనేజర్ అవడంతో తరుణ్ని తనలాగే బ్యాంకు మేనేజర్ గా చేయించాలని ఎప్పుడూ చదువుకోమంటూ ప్రొద్దున ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రకరకాల ట్యూషన్స్ పెట్టించేవారు.
తరుణ్ కి ఆడుకోవడానికి అసలు సమయం ఉండేదే కాదు. ఇక వరుణ్ విషయానికి వస్తే వరుణ్ వాళ్ళ నాన్నగారు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా వరుణ్ ని ఎప్పుడు చదువుకోమని అనగా చూడలేదు ఈ విషయం తరుణ్ వాళ్ళ నాన్నగారికి ఏమాత్రం నచ్చేది కాదు.
అప్పుడప్పుడు వరుణ్ వాళ్ళ నాన్నగారిని మండలిస్తూ ఉండేవాడు పిల్లలకి చదువు చాలా ముఖ్యం. మీరు మీ వాడిని సరిగ్గా పెంచడం లేదు వాడికి ట్యూషన్స్ పెట్టించండి 24 గంటలు గ్రౌండ్ లోనే ఆడుకుంటూ ఉంటాడు అంతేతప్ప ఒకసారి కూడా పుస్తకం కొట్టిన పాపాన పోలేదు. మీరు ఇప్పుడు వాడిని సరిగ్గా పట్టించుకోకపోతే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అంటూ ఉచిత సలహాలు ఇస్తూ ఉండేవాడు దానికి వరుణ్ వాళ్ళ నాన్నగారు పోనీలెండి ఇప్పుడు ఆడుకోకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటారు వాళ్ళకి చదువు విలువ తెలిసినప్పుడు వాళ్లే చదువుకుంటారు అయినా మా వాడికి మార్కులు బాగానే వస్తున్నాయి అన్నారు.
దానికి తరుణ్ వాళ్ళ నాన్నగారు నవ్వుతూ అవునవును ఎప్పుడూ మీ వాడికి వచ్చేది బీ,సీ గ్రేడ్లే, అదే మా తరుణ్ ని చూడండి. ఎప్పుడూ ఏ గ్రేడ్ కిందకి రాలేదు. అయినా మీకు లేని ఆసక్తి నాకెందుకు లేండి చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. అతను అన్న మాటలు వరుణ్ వాళ్ళ నాన్నకు కాస్త కోపం తెప్పించినా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వరుణ్ గురించి నాకేమీ బెంగ లేదు వాడికి అన్నీ తెలుసు వాడేం చేసినా చదువులో ముందు ఉంటాడు మొదట ఎవరు వచ్చిందన్నది ముఖ్యం కాదు లాస్ట్ లో మొదట ఎవరు ముందు వచ్చిందన్నది ముఖ్యం అని అనుకుంటూ తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు.
ఇలా కొన్ని రోజులు గడిచాయి బాగా చదవడం వల్ల తరుణ్ కి మంచిర్యాంకులు వచ్చినా 24 గంటలు పుస్తకం పట్టుకోవడం వల్ల కళ్ళజోడు వచ్చింది. వరుణ్ మాత్రం హ్యాపీగా అటు చదువుకుంటూ, ఇటు ఆడుకుంటూ అన్ని విద్యల్లో అరితేరాడు. వాడికి స్కూల్లో ఆట పోటీలలో చాలా బహుమతులు కూడా వచ్చాయి అది చూసి వరుణ్ వాళ్ళ నాన్నగారు ఎంతో సంతోషించారు.
కానీ తరుణ్ వాళ్ళ నాన్నగారు మాత్రం ఈ ఆటల పోటీలు మీకేమన్నా కూడు పెడతాయా చదువుకోమని చెప్పండి అంటూ మళ్లీ ఎప్పటిలాగే సలహాలు ఇవ్వడం మానుకోలేదు. అలా ఒకరోజు తరుణ్ వాళ్ళ నాన్నగారు తరుణ్ ట్యూషన్ లో దింపేసి ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ రావడంతో వెళ్లిపోయారు. అలా వెళ్లడం వెళ్లడం రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చారు ఆలోపు ఇంట్లో అందరూ చుట్టుపక్కల వాళ్ళు గుమ్మిగూడి ఉండడం చూసి ఏమైంది అనుకుంటూ లోపలికి వచ్చారు.
భర్తను చూడగానే తరుణ్ వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ ఏమండీ తరుణ్ ట్యూషన్ నుంచి ఇంటికి రాలేదు వాడికి ఏమైందో నేను ట్యూషన్ వాళ్ళ కి ఫోన్ చేసి చెప్తే అతను ఎప్పుడో వెళ్లిపోయాడు అని చెప్పారు అంతే తప్ప ఇప్పటివరకు వాడు ఇంటికి రాలేదు అంటూ ఏడుస్తూ అతని గుండెల్లో వాలిపోయింది. ఇంతలో చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు అవును పిల్లల్ని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా ఇదేమైనా న్యాయమా ఈరోజుల్లో పిల్లలను కిడ్నాప్ చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారు ఎవరైనా పిల్లల్ని కిడ్నాప్ చేశారా వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటూ ఉచిత సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు.
దాంతో తరుణ్ వాళ్ళ నాన్నకి గుండెల్లో బాకు గుచ్చినట్లుగా అయింది ఇంతవరకు రాలేదంటే నిజంగానే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా కిడ్నాప్ చేసిన వాళ్లయితే ఇప్పటికీ ఫోన్ వచ్చి ఉండాలి కదా అని అనుకుంటూ ఫోన్లు ఏమైనా వచ్చాయా అంటూ భార్యని అడిగాడు ఏమీ రాలేదు అంటూ చెప్పిందా ఆవిడ. ఇంకా చూస్తారేంటండి వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటూ చుట్టుపక్కల వాళ్ళు ఒత్తిడి చేయడంతో ఇక ఏమీ అనలేక పోలీస్ స్టేషన్ కు బయలుదేరుతున్నారు.
ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలిసిన వరుణ్ వాళ్ళ నాన్నగారు వరుణ్ తో పాటు ఇంటికి వచ్చి ఏంటండీ తరుణ్ ఇంకా ఇంటికి రాలేదంట ఏమైంది అసలు సమస్య ఏంటి అంటూ అడిగాడు. తరుణ్ వాళ్ళ నాన్నగారు ఉన్న విషయం చెప్పారు. నేను తరుణ్ ని ట్యూషన్ లో దింపి ఆఫీస్ నుంచి అర్జెంటుగా కాల్ రావడంతో వెళ్ళిపోయాను ఆ తర్వాత తరుణ్ ని పట్టించుకోలేదు నాకు వచ్చేసరికి ఈ సమయమైంది నేను వచ్చేసరికి ఈవిడ ఏడుస్తూ ఉన్నారు. పిల్లని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని అనుమానంతో పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం అంటూ ఉన్న విషయం చెప్పారు.
ఆ మాట విన్న వరుణ్, అంకుల్ మీరు ఏం కంగారు పడకండి పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు మనం ట్యూషన్ టీచర్ వద్దకు వెళ్లి వెతుకుదాం అప్పటికీ దొరకకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అంటూ చెప్పడంతో వరుణ్ వాళ్ళ నాన్నగారు కూడా అవును అదే నిజం ముందు మనం వెతుకుదాం ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అని అన్నారు.
తరుణ్ వాళ్ళ నాన్నగారికి కూడా అదే నిజం అనిపించింది ఎందుకంటే తను వచ్చింది ఇప్పుడు తన భార్యకు ట్యూషన్ ప్లేస్ తెలియదు ఒక ఫోన్ నెంబర్ తప్ప ఇంతవరకు ఎవరు కూడా వెతకలేదు కాబట్టి ఒకసారి వెతికి చూస్తే తప్పులేదు అని అనిపించింది. దాంతో సరే వెళ్దాం పదండి అంటూ వరుణ్ వరుణ్ వాళ్ళ నాన్నగారు తరుణ్ వాళ్ళ నాన్నగారు బండి పై బయలుదేరారు.
వాళ్లు ట్యూషన్ చెప్పే ట్యూషన్ టీచర్ ఇంటి వరకు వెళ్లేసరికి అక్కడ ఎవరూ లేరు ఆ ఇంటి తలుపు తట్టి ట్యూషన్ టీచర్ ని అడిగారు మా తరుణ్ గాని వచ్చాడా అంటూ లేదండి పిల్లలందరిని నేను సాయంత్రం పంపించాను అంటూ ఆవిడ టక్కున తలుపు మూసుకుంది. ఆ విషయం వినగానే ఇప్పుడేం చేద్దాం అన్నట్లుగా తరుణ్ వాళ్ళ నాన్నగారు వరుణ్ వాళ్ళ నాన్నగారి వైపు చూశారు. అప్పుడు వరుణ్ అంకుల్ మీరేం బాధపడకండి నేను ఇప్పుడే వెళ్లి వెతికి వస్తాను మీరు నా వెంట రండి అంటూ ఆ చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టాడు.
వరుణ్ వెనకాలే తండ్రులు ఇద్దరు బయలుదేరారు. తరుణ్ వాళ్ళ నాన్నగారు మాత్రం మనసులో వీడేంటి చూపించేది అని అనుకుంటున్నా కూడా కొడుకు పై ఉన్న తీపి అతని వెనకాల వెళ్లేలా చేసింది. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా అక్కడ వాళ్లకి ఒక బస్టాప్ కనిపించింది. అది కనిపించగానే వరుణ్ అంకుల్ అదిగో చూడండి ఆ బస్టాప్ లో ఎవరో ఉన్నట్టున్నారు పెళ్లి చూద్దాం పదండి అన్నాడు.
అక్కడ బస్ స్టాప్ ఉన్న సంగతి ఇన్నేళ్లలో తరుణ్ వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ గమనించనే లేదు. అవును ఇక్కడ బస్టాప్ ఉన్న సంగతి నీకెలా తెలుసు అంటూ అడిగాడు తరుణ్ వాళ్ళ నాన్నగారు. అంకుల్ మేము రోజు ఆడుకోవడానికి ఇక్కడికే వస్తాము ఈ బస్టాప్ వెనకాల పెద్ద గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ లోనే మేము రోజు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాం అందువల్లే నాకు ఈ విషయం తెలుసు అంటూ చెప్పాడు.
ముగ్గురు కలిసి బస్టాప్ లోకి వెళ్లారు. అక్కడ బస్ స్టాప్ లో ఎవరో ముడుచుకుని పడుకున్నట్లు అనిపించింది ఇంతలో వరుణ్ వాళ్ళ నాన్నగారు తన ఫోన్ తీసి టార్చి వేశారు. వరుణ్ అతను దగ్గరగా వెళ్లి చూసి అంకుల్ ఇదిగోండి తరుణ్ ఇక్కడే ఉన్నాడు మన తరుణ్ దొరికాడు అంకుల్ అంటూ ఆనందంగా చెప్పాడు. ఏమిటి ఇతనేనా వీడేనా తరుణ్ నిజంగా దొరికాడా అంటూ ఆశ్చర్యపోయాడు వాళ్ళ నాన్నగారు. బ్యాగులు తలగడలా తల కింద పెట్టుకొని ముడుచుకొని పడుకుని ఉన్నాడు తరుణ్ చలికి గజగజ వణుకుతున్నాడు. వరుణ్ తరుణ్ ని లేపు అన్నాడు వరుణ్ వాళ్ళ నాన్నగారు.
తరుణ్ తరుణ్ అంటూ వరుణ్ మెల్లగా అతని నిద్ర లేపాడు. కళ్ళు నలుముకుంటూ లేచిన తరుణ్ పక్కనే ఉన్న కళ్ళజోడు పెట్టుకొని ఎవరు అంటూ చూసేసరికి తండ్రి, వరుణ్, వరుణ్ వాళ్ళ తండ్రిగారు కనిపించారు. వెంటనే వెళ్లి తరుణ్, తరుణ్ తన తండ్రిని కౌగిలించుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్నగారు నన్ను తీసుకెళ్లడానికి ఎందుకు రాలేదు? నాకు దారి తెలియక ఎటు వెళ్ళాలో తెలియక నేను ఈ బస్ స్టాప్ లో చాలాసేపటి నుంచి కూర్చునే ఉన్నాను బాగా ఆకలి వేసింది, దాహం కూడా వేసింది నీళ్ళేమో లేవు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు.
సారీ నాన్నా నాకు ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ రావడంతో వెళ్ళిపోయాను మీ విషయమే మర్చిపోయాను అంటూ దగ్గరికి తీసుకున్నాడు తరుణ్ వాళ్ళ నాన్నగారు. చూశారా పిల్లలకి పుస్తకాలే ప్రపంచం చేయకూడదు ఇలా ఊరంతా తెలిసేలా చేయాలి పక్క గల్లీలో ఉన్నా ఇంటికి కూడా అతను రాలేకపోయాడంటే అతను ఎంత తెలివిమంతుడో మీకు తెలిసే ఉండాలి. అతన్ని మీరు ఒక పుస్తక పురుగుని చేశారు తప్ప లోకజ్ఞానం తెలిసేలా చేయలేదు.
పుస్తకాలు చదవడం, చదువు నేర్చుకోవడం రెండు ముఖ్యమే కానీ కాస్త లోకజ్ఞానం కూడా ఉండి ఉంటే మీ తరుణ్ ఇప్పుడు ఇలా చలిలో పడుకునే వాడు కాదు కదా, ఎప్పుడో ఇంటికి వచ్చేసేవాడు. మీరు వాడిది ఇంట్లో నుంచి ట్యూషన్ కి ట్యూషన్ నుంచి స్కూలుకు స్కూల్ నుంచి మళ్లీ ఇంటికి తప్ప వేరే ఎక్కడికి తీసుకు వెళ్లరు కనీసం ఆడుకోనివ్వరు.
పిల్లలు ఎంత సేపు చదవాలో అంతసేపే చదవాలి మిగతా సమయంలో ఆడుకోవడం వలన వారికి లోకజ్ఞానం అనేది తెలుస్తుంది. మన ఊరు ఎలా ఉంది ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తే ఏమొస్తుంది? ఎక్కడ మెడికల్ షాపులు ఉన్నాయి, ఎక్కడ ఆసుపత్రులు ఉన్నాయి, ఎక్కడ హోటల్స్ ఉన్నాయి అనేది తప్పకుండా తెలియాలి లేదంటే ఇదిగో ఇలా అవుతుంది షం ఒకసారి ఆలోచించండి.
ఈపాటికి మీ పిల్లల్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే మీ సంగతేంటి వాడి జీవితం ఏమైపోవాలి కాబట్టి పిల్లలకి లోకజ్ఞానం ఎంతైనా అవసరం. కనీసం పోలీస్ స్టేషన్ నెంబర్, అంబులెన్స్ నెంబర్ ఆ ముఖ్యమైన నెంబర్స్ అన్ని నోట్ చేయించాలి. అలాగే ఎవరైనా కిడ్నాప్ చేయడానికి వచ్చినప్పుడు కరాటే కూడా నేర్పిస్తూ ఉండాలి ఆటలు ఆడితే శరీరం గట్టిపడుతుంది అప్పుడు తనని కిడ్నాప్ చేయడానికి ఎవరైనా వచ్చినా కూడా అతను ఎదుర్కొనేలా మనం ప్రోత్సాహం అందించాలి అంతే తప్ప చదువే ప్రపంచం, పుస్తకాలే ప్రపంచం అంటూ నీతి సూత్రాలు బోధించకూడదు.
నేను ఇది మిమ్మల్ని ఏదో కించపరచడానికి చెప్పడం లేదు ఉన్న విషయం చెప్తున్నాను చూడండి మనం మా వరుణ్ కి ఈ ఊరంతా తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఎక్కడికి ఎలా వెళ్లాలి తిరిగి ఎలా రావాలి అనేది అన్నీ తెలుసు. అలాగని వాడు చదువులో తక్కువ కాదు బి గ్రేడ్ సి గ్రేడ్ వచ్చినా కూడా వాడు ఆటపాటల్లో చురుకుగా ఉంటున్నాడు.
మీరు నన్ను ఎద్దేవా చేసినందుకు కక్ష పెట్టుకొని నేను ఏమీ చెప్పడం లేదు పిల్లలు ఎవరికైనా పిల్లలే… పిల్లలంటే దేవుడితో సమానం కాబట్టి ఇప్పటికైనా మీ పిల్లవాడికి కాస్త లోకజ్ఞానం తెలియజేయండి అంటూ చెప్పి బండి స్టార్ట్ చేశాడు వరుణ్ వాళ్ళ నాన్నగారు. అవునండీ మీరు చెప్పింది నిజమే వాడికి దారి తెలియక పోవడం వల్లనే ఇంటి వరకు రాలేదు నాది తప్పయింది ఇకనుంచి వాడికి అన్నీ నేర్పిస్తాను నాకు చాలా సహాయం చేశారు అంటూ చెప్పారు తరుణ్ వాళ్ళ నాన్నగారు.
తెల్లారి ప్రొద్దున ఎనిమిది గంటలకు వరుణ్ క్రికెట్ బ్యాట్ తో నాన్న నేను గ్రౌండ్ కి వెళ్లి వస్తాను అని విన్న తరుణ్ వాళ్ళ నాన్నగారు తరుణ్ వెళ్లి వరున్ తో ఆడుకోపో అంటూ తరుణ్ కూడా వరుణ్ తో పాటు పంపించారు.
పుస్తకమే లోకంగా బ్రతికినా కూడా మనుషులకు లోకజ్ఞానం కూడా అవసరమే అని ఈ సంఘటన వల్ల తెలుస్తుంది.
– భవ్య చారు