పున్నామ నరకం

పున్నామ నరకం

 

“ఏమిటండీ ఇది …ఈ చోద్యం ఎక్కడైనా ఉందా? తరతరాలుగా వస్తున్న మన ఆచారాలు, సాంప్రదాయ పట్టింపులు  గాలికి వదిలేస్తే ఎలా? మన ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి మనమేమైనా ఆటవిక సమాజంలో ఉన్నామా…

మనకంటూ మన పెద్దలు పెట్టిన  పద్ధతులంటూ కొన్ని ఏడ్చాయి.. వాటిని కాదని ఒక ఆడపిల్ల తండ్రికి తలకొరివి పెట్టడమా? మీరంతా మాట్లాడరేమిటండీ…”

అవధానిగారి పార్థివదేహం ముందు కూర్చుని ఉన్న ఊరి పెద్దలు, బంధుగణం వైపు చూస్తూ బుగ్గలు నొక్కుకుంటూ అడిగారు శివయ్య గారు.

“అవునవును..ఇలా అయితే మన సాంప్రదాయాలు మంట కలిసి పోవూ…వత్తాసు పలుకుతూ అన్నారు కైలాసం పంతులుగారు.

“పుత్రుడు ఉన్నదే పున్నామ నరకం నుంచి తప్పించడానికి.. అతగాడు ఎక్కడున్నా రావాల్సిందే.. తండ్రికి దహన సంస్కారాలు చేయవలసిందే… ఆడపిల్ల ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం ఊరికే అరిష్టం..” నొక్కి వక్కాణించారు కామేశం గారు.

ఒక్కసారిగా అక్కడ కలకలం బయలుదేరింది. ఎక్కడో దూర దేశాలలో ఉన్న కొడుకు తండ్రి అంతిమ కర్మల కోసం వస్తాడా? రాకపోతే పరిస్థితి ఏంటి?… అందరి దృష్టి తండ్రి విగత శరీరం పక్కన ఎక్కడో అనంతమైన శూన్యంలోకి చూపులు నిలిపి ఇక్కడ జరుగుతున్న తతంగం పట్ల తనకేమీ సంబంధం లేనట్లుగా కూర్చుని ఉన్న ఓంకారేశ్వరి పై పడింది.

అవధానీ గారు అగ్రహారంలో పౌరోహిత్యం చేసేవారు.. అవధాని సావిత్రమ్మ గార్ల దంపతులకు లేకలేక కలిగిన సంతానం కాశి. కాశీ పుట్టిన రెండేళ్లకు ఓంకారేశ్వరికి జన్మనిచ్చి పురిటి బిడ్డను కళ్లారా చూడకముందే సన్నిపాత జ్వరంతో కన్నుమూసింది సావిత్రమ్మ.

అప్పటి నుండి పిల్లలిద్దరినీ అన్నీ తానై పెంచారు అవధాని గారు. పెద్ద చదువులు చదువుతానని పంతం పట్టి పట్నం వెళ్ళిన కాశీ పట్నవాసపు పోకడలను వంటబట్టించుకొని సాంప్రదాయ అగ్రహార జీవితాన్ని ఏవగించుకుని పుట్టిన ఊరిని కన్నతండ్రిని నిర్లక్ష్యం చేసి పెద్దవాళ్ల హితబోధను పట్టించుకోకుండా ఏది ఏమైనా నేను ఇంతే అనే స్థితికి వచ్చాడు.

తన తరువాత పౌరోహిత్య బాధ్యతలను అప్పగించాలని ఆశపడ్డ తండ్రికి నిరాశే మిగిలింది. క్రమేణా కొడుకు మారుతాడని తనను ఇంతవాడిని చేసిన ఊరిని కన్నవాళ్ళని ఆదరిస్తారని దేనికైనా సమయం రావాలి  అని ఓపికగా నిరీక్షించారు అవధాని గారు.

కానీ కాశీలో ఇసుమంతైనా మార్పు రాలేదు సరికదా పై చదువులకు అమెరికా పోతానని అందుకు కావాల్సిన డబ్బు సిద్ధం చేయాలని లేకుంటే మీకు కొడుకు అనే వాడు లేకుండా పోతాడని బెదిరించి ఇల్లు తాకట్టు పెట్టించి మరీ విదేశాలకు వెళ్లి పోయాడు.

ఎప్పటికైనా కొడుకు మారతాడు,బాధ్యతలను తెలుసుకుంటాడు అని ఆశ పడ్డ  అవధానిగారికి ఆవగింజంత అదృష్టం కూడా లేకుండా పోయింది. ప్రాణప్రదంగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు పర దేశాలకు వెళ్లిపోవడంతో కుంగిపోయారు అవధాని గారు.

కూతురు పెళ్లి చేయడానికి వున్న ఒకే ఒక్క ఆధారమైన ఇల్లు కూడా లేకపోవడంతో తన తదనంతరం కూతురు పరిస్థితి ఏమిటన్న బెంగతో మంచం పట్టారు. ఈ పరిస్థితిలో తండ్రికి ధైర్యం చెప్పి అతనికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చింది ఓంకారేశ్వరి.

గుడిలో నైవేద్యం తయారు చేస్తూ,చిన్న పిల్లలకు పాఠాలు చెబుతూ ఇంటిని నడుపుతూ తండ్రిని జాగ్రత్తగా చూసుకుంది. అన్నకు ఫోన్ లో తండ్రి పరిస్థితి చెప్పి ఒక్కసారి వచ్చి పొమ్మని ఎంతగానో ప్రాధేయపడింది.

కానీ తనకు ఉద్యోగం దొరికిందని సెలవులు దొరకడం కష్టమని తండ్రికి ఏమైనా అయితే చివరి కార్యక్రమాలు కూడా నువ్వే పూర్తి చేయాలని మళ్లీ ఫోన్ చేసి విసిగించద్దని చెల్లెల్ని హెచ్చరించాడు కాశి.

కనీసం కొడుకుతో ఒక్కసారి మాట్లాడాలి అన్న కోరిక కూడా తీరకుండా తన తలకొరివి పెట్టడానికి కూడా కొడుకు వస్తాడో రాడో అనే బెంగతో కూతురి భవిష్యత్తు పట్ల చింతతో ఒకరోజు నిద్రలోనే ప్రాణాలు విడిచారు అవధానిగారు.

“ఏమైందండీ ఇంకా ఎప్పుడు శవాన్ని లేపుతారు. అపర్ణహ వేళయింది. కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలిగా.. అవధాని గారి అబ్బాయి వస్తున్నట్లేనా?..”రెట్టించి అడిగారు శివయ్య గారు..

అప్పటివరకు తండ్రి  వైపే తదేకంగా చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్న ఓంకారేశ్వరి అప్పుడే బాహ్య స్మృతిలోకి వచ్చినదానిలా ఒక్కసారిగా లేచి నిలబడింది. హఠాత్తుగా అందరి కళ్ళు ఆమె వైపు తిరిగాయి.

ఓంకారేశ్వరి స్థిరమైన చూపులు అక్కడ నిలబడి ఉన్న అందరిని ఒక్కసారిగా కలియచూశాయి. ఆమె నిబ్బరమైన చూపుల తీవ్రత అక్కడ నిలబడి ఉన్న ఉగ్గుపాలతో సహా సనాతన బ్రాహ్మణతను నరనరాన జీర్ణించుకున్న ఉద్దండ పిండాలలాంటి తలపండిన వైదిక శ్రేష్టులను సైతం ఏదో తెలియని కలవరపాటుకు గురిచేసింది.

ఆమె చెప్పబోయేది ఏదో అసాధారణంగా ఉండబోతోంది అన్న సంకేతాలు అన్యాపదేశంగా అందరి మెదళ్ళలోకి చేరిపోయాయి..కాకపోతే ఆమె ఏం చెప్పబోతోంది అనే ఉత్కంఠత అందరి ముఖాల్లో స్పష్టంగా గోచరిస్తోంది

చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆ పరిసరాలను అలుముకుంది. ఆ నిగూఢమైన నిశ్శబ్దాన్ని చేదించుకొని ఓంకారేశ్వరి స్వరం స్పష్టంగా వినిపించింది.

“చూడండి నా తల్లిదండ్రులైన అవధానులు,సావిత్రమ్మగారి ఏకైక పుత్రికను నేను. తండ్రి యోగక్షేమాలను చివరికంటా చూసుకున్న పుత్రికగా వారి ఆశలను ,ఆదర్శాలను పుణికిపుచ్చుకున్న వారి వారసురాలిగా నా తండ్రి గారైన అవధానులు గారి అంత్యక్రియలను నేనే నిర్వర్తించాలని  నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు.”

“ఏమిటా అపభ్రంశ మాటలు.. కడుపున పుట్టిన కొడుకు ఉండగా…. ఒక ఆడపిల్ల తండ్రికి తల కొరివి పెట్టడమా? ఇది ఎక్కడా కనీవినీ ఎరగం. ఇలా చేస్తే అనాదిగా వస్తున్న అగ్రహార పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతాయి. అయినా ఒక బ్రాహ్మణ వంశంలోని ఆడపిల్ల ఇలా నలుగురిలో సాంప్రదాయ కట్టుబాట్లకు వ్యతిరేకంగా మాట్లాడడమా ..?”

“అవును కలికాల మహత్యం అంటే ఇదేనేమో? ఒక ఆడపిల్ల అందులోనూ హైందవ వంశంలోని స్త్రీ ఇలా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలను కించపరచడమా ?… ఆవేశంగా అన్నారు శాస్త్రులు గారు.

“ఏది ఏమైనా  పుత్రుడు మాత్రమే తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పించగలడు. పుత్రుడి చేత తలకొరివి పెట్టించుకున్న తండ్రి ఆత్మ మాత్రమే పుణ్యలోకాలకు చేరుతుంది. అప్పుడే అతని ఆత్మ పితృదేవతలలో విలీనం అవుతుంది.

అంతేకానీ .తండ్రి అంత్యక్రియలు నిర్వహించే అర్హత ఎప్పుడూ పరాయి ఇంటి గౌరవాన్ని నిలబెట్టే ఆడపిల్లకు లేదు ..రాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ తరతరాలుగా వస్తున్న ఆచారాలు గంగలో కలిసి పోతుంటే చూస్తూ ఊరుకోం..”

ఒక్కసారిగా ఓంకారేశ్వరి వదనంలో తీక్షణత్వం సంతరించుకుంది. తాను చెప్పబోయేదే అంతిమ శాసనంగా ..

” కొడుకు అనే వాడు తల్లిదండ్రులు పోయాక వారిని పున్నామ నరకం నుండి తప్పించేవాడు కాదు. వారు బ్రతికుండగా నరకం చూపించని వాడే నిజమైన కొడుకు.

తల్లిదండ్రులను బాధపెట్టిన కొడుకు ఉన్నా లేకున్నా ఒకటే. తల్లిదండ్రులు బతికుండగా వారి బాగోగులను పట్టించుకోని కొడుకు వారు పోయాక స్వర్గలోకానికి చేరుస్తారు అని గనుక మీ శాస్త్రాలలో రాసి ఉంటే ఇకనైనా మార్చుకోండి వాటిని.

ఆడ అయినా మగ అయినా తల్లిదండ్రులను సంతోషంగా చూసుకున్న వాళ్లకే ఇకనుంచి ఆ అర్హత ఉంటుంది అని ఆ విధంగా మార్చుకోండి మీ చట్టాలను…

అంటూ అందరూ అవాక్కయి చూస్తుండగా  ముందుకు కదిలింది ఓంకారేశ్వరి.

  ………. సమాప్తం……

 

-మామిడాల శైలజ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *