ప్రేమ సదనం
హిమజ చాలా కాలం తరువాత సంతోషంగా నవ్వుతూ ఉంది. ఆ నవ్వులో సంతృప్తి ఉంది. చాలా కాలంగా నెరవేరని కల నెరవేరిందన్న ప్రశాంతవదనం స్పష్టంగా తెలుస్తుంది.
అది చూసిన భర్త విఘ్నేష్ ఏమిటి ఈ ప్రశాంతత. ఎందుకింత సంతోషం మేము కూడా తెలుసుకోవచ్చా అంటాడు. అంతలో పిల్లలు భారతి, శాంతిలు డాడీ మీకు ఇంకా తెలీదా అమ్మ సంతోషానికి కారణం. మాకు తెలుసుగా…కానీ మీకు మాత్రం చెప్పం అంటూ ఆటపట్టిస్తారు.
అదంతా చూస్తూ మురిసిపోతున్న హిమజ విఘ్నేష్ చేతులు పట్టుకుని చాలా థాంక్స్ విఘ్నేష్. నెరవేరదనుకున్న నా కల నెరవేరింది అంటుంది.
హే… హిమజ ఊరుకోవోయ్ అంతా నేనే చేసినట్లు మాట్లాడకు. ఏ స్వార్ధం లేకుండా కన్న కల ఇది. నెరవేరదని ఎలా అనుకుంటావ్. ఒకప్పుడు మనకంటూ ఎవరూ లేరు. ఇద్దరం అనాధలుగా పెరిగినవాళ్ళం. పెళ్ళయ్యాక ఒకరికొకరమనుకుని తోడునీడయినవాళ్ళం. ఇదే సంతోషం ఆనందం మరికొందరికి అందివ్వడమో లేక మనకంటూ ఎన్నో బంధాలను పెనవేసుకోవడమో నీ ఒక్కదాని కల మాత్రమే ఎలా అవుతుందంటావు.
వాస్తవానికిది మనిద్దరి కల. మనలాంటి ఒంటరులైనవారెందరి కలో.. ఇప్పటికీ నాకళ్ళకి కట్టినట్లు గుర్తుంది. మనం కులాంతర వివాహం చేసుకున్నామని మీ ఇంట్లోవాళ్ళు మనల్ని క్షమించలేదు. మీ నాన్నగారైతే ఎప్పటికీ క్షమించలేదు. నీవరకే ఆయన కాస్త మీ ఇంటికి వెళ్ళివచ్చే అవకాశం ఇచ్చారు తప్ప నాకు మీ ఇల్లు మీవాళ్ళతో పరిచయమే లేదు.
నువ్వు మొదటిసారి తల్లివి కాబోతున్నావని తెలిసినా కూడా అప్పటికి మా అమ్మ చనిపోయిందని తెలిసినా… పెద్దదిక్కు ఎవ్వరూ లేరన్న కనికరమైనా చూపలేదు. మనతిప్పలేవో మనమే పడ్డాం.
ఇలాంటి స్థితిని ఎదుర్కొన్న నాకు తెలుసు అలాంటి వ్యక్తుల మనోభావాలెలా ఉంటాయో… అందుకనే నేను ఏనాడూ మనం ఒంటరులమన్న భావన కలగనీయకుండా మిమ్మల్ని చూసుకోవాలి అనుకున్నాను.
విఘ్నేష్ కంట్రోల్ యువర్సెల్ఫ్ ప్లీజ్ అంటూ హిమజ భర్త కళ్ళలోనుండి ఉబికి ఉబికి వస్తున్న కన్నీటిని తుడిచి. పద ఇక వెళదాం మన ప్రేమసదన్ కి. అంటూ రెడీ చేస్తుంది.
పెద్ద ఫంక్షన్ హాల్ ముందు కారు ఆగుతుంది. వెల్కం మైడియర్ అమ్మా నాన్నా అంటూ స్వాగతం పలుకుతారు పిల్లలు భారతి, స్వేచ్ఛ. లోపలికి అడుగుపెట్టగానే అక్కడ ఉన్నవారందర్నీ చూసి తనకంటూ ఈనాడు ఇందరున్నారన్న ఆనందంతో ఉబుకుతున్న ఉద్వేగం ఆపుకోలేక వస్తున్న కంటినీరు తుడుచుకుంటూ ఆసీనులవుతారు ఇద్దరూ..
పిల్లలే పెద్దలుగా వ్యవహరిస్తూ.. ఈనాటి ఈ సభకి విచ్చేసిన మా అమ్మమ్మ తాతయ్యలకూ, నాన్నమ్మ తాతయ్యలకూ, అక్కతమ్ముళ్ళకూ, అన్నదమ్ములకూ, మా సాదర స్వాగతం. ఈ ప్రేమ సదనం కేవలం మా అమ్మానాన్నల కలల సౌధమే కాదు మనందరిదీ…
కారణాలనేకాలై ఒంటరులైన మీ అందరికీ ప్రేమ సదనం లోనికి ఆహ్వనం పలుకుతున్నాము. ఈలోకంలో ఎవరికెవరూ ఏమీకాకుండానే వస్తాము. వచ్చాకనే బంధాలు ఏర్పడతాయి.
ఈనాటి నుండి ఆ బంధాన్ని మనమంతా ఏర్పరచుకుందాం అంటూ ఈనాడు ఈ ప్రేమ సదనం నిర్మించి మనందర్నీ ఆత్మీయ బంధువులుగా చేసిన మన అమ్మానాన్నలను సాదరంగా వేదికమీదికి ఆహ్వానిస్తున్నాను. అంటూ వారికి సాదర ఆహ్వానంపలుకుతుంది భారతి.
వేదికపై నిలబడిన విఘ్నేష్ హిమజలు మన ప్రేమసదనంలో ఉండేందుకు వచ్చిన మీ అందరకూ నమస్సులు. ఇకనుండి ఎవరూ అనాధలని ఎవరూ లేరని బాధపడొద్దు. మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసారని ఏడ్వకండి.
అనారోగ్యాలతో మీ తల్లిదండ్రులు చనిపోయారని చింతించకండి మీ చదువులు మీ ఉన్నతి మా తోడ్పాటుతో ముందుకు సాగుదాం. ఎవరికి చేతనైన పనిని వారు చేస్తూ ఈ ప్రేమ సదనం మరింత ప్రేమానురాగాల నిలయం కావాలని ఆశస్తున్నాం అంటూ ముగిస్తారు. కలకన్న కలలసౌధం ప్రేమ సదనంగా రూపుదిద్దిందన్న సంతోషంతో ప్రశాంత వదనాలతో మురిసిపోయారు .
– ఉమామహేశ్వరి యాళ్ళ