ప్రకృతి అందాలు
గుంటూరు జిల్లా తాళ్ళపల్లె వద్ద ఎత్తిపోతల జలపాతం ఉంది. ఈ జలపాతం కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉంది. చంద్రవంక నది నల్లమల శ్రేణుల తూర్పు కొండలలో ముటుకూరు వద్ద పుట్టి, తుమృకోట అభయారణ్యంలో తాళ్ళపల్లి వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి ఉత్తర దిశగా ప్రయాణించి కృష్ణా నదిలో కలుస్తుంది.
యతి అను పేరుగల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం ఎత్తిపోతలగా ప్రసిద్ధిగాంచింది. ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగులతో, జలపాతం చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ ప్రాంతం ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. వెన్నెల రాత్రిలో ఆ జలపాత అందాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు.
మనోహరమైన ప్రకృతి దృశ్యాలు, చల్లగా వీచే గాలి, పండు వెన్నెల ఇవన్నీ కలిసి ఆ ప్రదేశానికి మరింత అందాన్ని తీసుకుని వస్తాయి. ఎత్తిపోతల జలపాతం నాగార్జున సాగరుకి అతి దగ్గర ఉండే జలపాతం.
– వెంకట భానుప్రసాద్ చలసాని