ప్రధమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి..
చింత నిప్పుల వంటి కళ్ళు
ప్రసన్నమైన ముఖారవిందం
రోషము కోసమే మొలచిన మీసాలు
ఆ రూపమే శత్రుభయంకరం..
మరో నరసింహావతారం జననం
దుష్ట సంహారం చేసేందుకు అవతరించే
తెల్ల రాక్షసులను తుద ముట్టించేందుకు
నరరూపము దాల్చిన నరసింహం….
అహోబిలేసుడే ఆత్మ దైవమై
రేనాటి గడ్డలో గాండ్రించెను శత్రువుపై
ఆ నామము స్మరించిన
సీమలో గడ్డి పూస గర్జించును పగవాడిపైన..
తిరుగుబాటు బావుటాయే కలిగి
నిప్పులు కళ్ళల్లో పిడుగులై కురిసే
సీమ పౌరుష ప్రతాపాగ్నికి చిహ్నంగా
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఖ్యాతి గడించే..
రేనాటి నేలలు బంగారం పండిస్తుంటే
కుందునదీనీళ్లు దాహాన్ని తీరుస్తుంటే
అన్నదమ్ముల వలె హాయిగా జీవిస్తుంటే
కళ్ళు కుట్టి నొస్సుపై దండెత్తాడు తెల్లోడు..
ఆంగ్లేయుల దాష్టీకం లో ప్రజలకు ఇబ్బందులు
అధికార మతోన్మాద వైఖరి అవలంబిస్తే
పీడించి పన్నులు వసూలు చేస్తుంటే
నిప్పుల కొలమిలా నరసింహారెడ్డి అగ్ని జ్వాలయై ఎగిసే..
రాయల సీమ మట్టిలో పుట్టిన ధైర్యము
ఈ గాలిలో వీచే దాతృత్వం
ఈ సీమ నీళ్లలోని పౌరుషం పుణికి పుచ్చుకున్న
గంభీరమైన అడుగులలోని పంజా అతను…
తెల్లవాడి అరాచకాలకు చరమ గీతం పాడేందుకు
స్వాతంత్ర సంగ్రామానికి పునాదులు వేసెను
తొలి విప్లవ వీరుడిగా ఖ్యాతిగాంచే
బ్రిటిషోడికి తెలుగు వాడి దెబ్బ రుచి చూపించే..
స్పృహ లేని నరసింహారెడ్డిని బంధిస్తే
కారాగారములో హింసిస్తే
మాతృదేశ దాస్య శృంఖలాలు ఛేదించేందుకు
సీమ కొదమ సింహమే నేలకొరిగింది..
దేశమాత విముక్తి రక్తము ధారపోసెను
తన తలనే మాతకు తృణప్రాయంగా సమర్పించే
ఎందరో దేశభక్తులు ఆ రక్తపు మడుగులో జనించి
భరతమాత విముక్తికై పోరాటాలు సలిపిరి..
ఉయ్యాలవాడ నాటిన ఊడలే ఆదర్శంగా
మహామహులు సంగ్రామ స్ఫూర్తితో కదిలిరి
భరతమాత దాస్య విముక్తి కలిగించిరి
ఉయ్యాలవాడ నరసింహ కీర్తి దిగంతాలు వ్యాపించింది..
-గురువర్ధన్ రెడ్డి