ప్రబోధం
ఆకలి త్రాసులో
జీవితాన్ని తూస్తుంటావు
అది అహర్నిశలు జాగురూకతను
నేర్పుతుంది
ఈలోగా ఆకలిని సముదాయించటం
అలవాటవుతుంది
ఇక్కడ నీతీనియమాలు
మంచితనపు నీడల జాడలు ఉండవు
విలువల చలువ పందిరి అసలే ఉండదు
కాలమే తోడు..ఆత్మవిశ్వాసమే చలువరాతి మేడ
అందుకే మోసాల పాముపడగల నీడలో
తలదాచుకుంటుంటే
నిచ్చెనెక్కే కిటుకు తెలియొచ్చు
వైకుంఠపాళి జీవితం వైకుంఠాన్ని చూపదు కానీ
వెన్నెలరాత్రులను వెతికే తోడవుతుందేమో
విశ్వాసాన్ని వీడక
ధైర్యం కరవాలంతో లక్యంవైపు దూసుకుపోవటమే కర్తవ్యం
అని ఎవరూ చెప్పరు
నీకు నువ్వే చెప్పుకోవలసిన ప్రబోధం
– సి. యస్. రాంబాబు