ప్రాణం ఖరీదు
మన తరాలు మారుతున్న కొద్దీ సాంకేతికత మారుతూ వచ్చింది. నాటకాలు, తర్వాత సినిమాలు ఇలా ఎన్నో రకాలుగా మారాయి. ల్యాండ్ ఫోన్స్ మారి కాయిన్ బాక్స్ లు వచ్చాయి తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. అలా స్మార్ట్ ఫోన్ లో ఎన్నో రకాల టెక్నాలజీ వాడుతూ మనుషులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు అవి కొంత మంచికి అయినా మరి కొంత చెడుకి ఉపయోగిస్తున్నారు అనడం లో సందేహం లేదు. ఆ టెక్నాలజీ వల్ల ఇద్దరు అబ్బాయిల జీవితాలు ఎలా మారాయి అనేదే ఈ కథ…
రాము, రాజేష్ ఇద్దరు రూం మేంట్స్ కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు. అయితే రాము ఎక్కువగా ఫోన్ వాడుతూ పాటలు వింటూ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. రాము వారిది మధ్యతరగతి కుటుంబం అయినా తండ్రిని ఇబ్బంది పెట్టి మరీ ఫోన్ కొనిపించాడు. రాజేష్ దగ్గర కూడా ఫోన్ ఉంది కానీ రాజేష్ దాన్ని తన చదువుకు సంబంధించిన విషయాలు మాత్రమే చూస్తూ నోట్స్ రాసుకుంటూ ఉండేవాడు.
ఇలా బిన్నమైన ఆలోచనలతో ఇద్దరు ఒకటే గది లో ఉండేవారు. రాము ఇంకా చదువు పై దృష్టి పెట్టకుండా ఇరవై నాలుగు గంటలూ ఫోన్ పట్టుకుని చదువుని నిర్లక్ష్యం చేస్తూ ఫోన్ లో మునిగి తేలుతూ ఉండేవాడు. అలా రాము ఫోన్ చూస్తున్నప్పుడు అనుకోకుండా అతనికి పోర్న్ సైట్ కనిపించాయి. ఇంకేముంది అసలే వయసులో ఉన్నవాడు కావడం తో రాము అవే ఎక్కువగా చూస్తూ ఉండేవాడు. రాజేష్ తన స్నేహితుణ్ణి ఎంత చదువుకో అని చెప్పినా వినకుండా రాము ఇరవై నాలుగు గంటలూ అవే చూస్తూ వాటికి బానిసలుగా అయ్యాడు .
అది ఎంత వరకు వెళ్లిందంటే రోజు చూడకపోతే పిచ్చెక్కి పోయేలా, క్లాస్ లకి కూడా వెళ్లకుండా అవే చూస్తూ గదిలోనే ఉండిపోయేవాడు. రాజేష్ ఇదంతా గమనించి వారి తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు ఒకసారి వచ్చి చూసి చెప్పి వెళ్ళారు. అయినా రాములో మార్పు లేదు. క్లాస్ కి రాకపోవడంతో కాలేజీ వాళ్ళు రాము గురించి రాజేష్ ని అడిగారు. అప్పుడు రాజేష్ ఏమి చెప్పాలో తెలియక అయోమయంలో పడ్డాడు. ఎందుకంటే స్నేహితుని గురించి చెడుగా చెప్పలేడు కాబట్టి మౌనంగా ఊరుకున్నాడు. దాంతో విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్లింది.
ప్రిన్సిపల్ వచ్చి రాజేష్ ను తీసుకుని అతని రూంకి వెళ్ళాడు. గది తలుపులు తీయగానే రాము పోర్న్ చూస్తూ చేయకూడని పని చేస్తూ వారికి కనిపించడంతో వాళ్ళు బిత్తరపోయి, తలుపులు మూసి బయటకు వచ్చారు. రాజేష్ వణికిపోతూ ఉంటే ప్రిన్సిపల్ ఆలోచనలో పడ్డారు. రాముని ఇలా వదిలేస్తే పోనూ పొనూ సమాజానికి ప్రమాదంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఆదిలోనే అంతం చేయాలి అనుకుంటూ రాము తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించాడు.
వాళ్లు రాగానే విషయం అంతా వారికి చెప్పి, ఇప్పుడు ఇలా వదిలేస్తే ముందు ముందు జీవితం లో అతను రేపిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ అబ్బాయిని వెనకేసుకు రాకుండా అతన్ని హాస్పిటల్ లో జాయిన్ చేయడం మంచిది అంటూ సలహాలు ఇచ్చారు. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దాంతో రాము గురించి డాక్టర్స్ తో మాట్లాడి అతన్ని బలవంతంగా ఫోన్ తీసుకుని పంపించారు. ఒక్కగానొక్క కొడుకు ఇలా పోర్న్ కి అడిక్ట్ అవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు అనుకుంటే వీడు ఇలా మారాడు. ఫోన్ కొనివ్వడమే తాము చేసిన తప్పు అని అనుకున్నా ఇప్పుడు చేసేది ఏమి లేక మౌనంగా ఉండిపోయారు.
అయితే హాస్పిటల్ కి వెళ్ళిన రాము ఫోన్ లేకపోవడంతో పిచ్చి వాడిలా మారి నా ఫోన్ ఇవ్వండి నా ఫోన్ ఇవ్వండి అంటూ అరుస్తూ ఉన్నాడు. అదొక వ్యసనం లా మారింది కాబట్టి ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేక చేతుల్ని పైకి కిందకీ. ఆడిస్తూ తనలో తానే మాట్లాడుతూ, అంతకు ముందు చూసినవన్నీ గుర్తు తెచ్చుకుని అక్కడ ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చిన సిస్టర్ పై అఘాయిత్యం చేయబోయాడు.
ఆమె తప్పించుకుంటూ వెనక్కి వెనక్కి జరగడంతో అతను ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇంతలో కిటికీ దగ్గరగా ఆవిడ రావడం ఆమె దగ్గర్లో ఉండడంతో ఆమెని అందుకోవాలి అనుకున్నా రాము ఆమెని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ నిమిషం లో ఆమె కిందికి వంగింది పట్టు తప్పిన రాము ఆ కిటికీ లోంచి కింద పడ్డాడు. రెండంతస్తుల బిల్డింగ్ కాబట్టి రాము కింద పడడం తోనే క్షణాల్లో తలకి బలమైన దెబ్బ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు.
రాజేష్ మాత్రం రాము వెళ్ళాక ఇక అక్కడ వుండలేక కాలేజీ మారి, వేరే కాలేజీలో చేరి బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత స్నేహితుని మరణం గురించి తెలుసుకుని పోలీస్ లతో మాట్లాడి అసలు పోర్న్ సైట్ లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నాడు. పోలీసులు, ప్రభుత్వం కూడా పోర్న్ ని బ్యాన్ చేసింది.
ఒక మరణం తర్వాత ఎన్ని చేసినా లాభం లేదు కానీ ముందు తరం వారు అయినా ఇలా చేయకుండా ఉంటారు అనే ఆలోచనతో చేసినా ఇప్పటికీ టెక్నాలజీ వాడుతూ సైబర్ నేరాలు, అత్యాచారాలు, జరుగుతూనే వున్నాయి. కానీ మనం వాడుతున్న ఫోన్ లేదా మరేదైనా సాంకేతికత పరికరాన్ని మనం వాడుకునే తీరులో, మన బుద్ధిలో మన ప్రవర్తనలో ఉంటుంది. రాజేష్ కి ఫోన్ ఉన్నా అలాంటి వాటి జోలికి పోకుండా కేవలం చదువు పైనే దృష్టి పెట్టాడు. కానీ రాము వాటికి ఆకర్షితుడై చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
ఏది ఎంతలో వాడాలి, ఏది ఎంత ఉపయోగించాలి అనేది మన ప్రవర్తన, బుద్ది, లోక జ్ఞానంపై ఆధార పడి ఉంటుంది అనేది ఇక్కడ అసలు విషయం.
– భవ్య చారు