ఫిర్యాదు

ఫిర్యాదు

చంద్రుడు
ఇంటికి రాలేదని
ఆకాశం ఫిర్యాదు

సూరీడు
గుర్రాలను కదిలించబోతే
సారీ బాస్ బాగా టైడ్ అంటాయి

తప్పదన్నట్టు
లాంతరు పట్టుకుని
సూరీడు బయల్దేరుతాడు

నక్షత్రాల్ని అడిగితే
సముద్రంలో ఈతకు వెళ్ళొచ్చామని
శశిని చూడలేదని
తుమ్ముతూ చెబుతాయి

దారిలో చకోరాన్ని అడుగుతాడు
నిద్ర బాగా కరువయితే
రెండు నిద్ర మాత్రలు వేసుకున్నాని
ఆవులిస్తూ చీకటిని కప్పుకుంటుంది

కొలను తలుపుల్ని
గడియపెట్టబోతోన్న కలువల్ని
అడుగుతాడు
పూల జాతరకు వెళ్ళొచ్చామని
తమకేమి తెల్వదు అంటాయి

అదాహై చంద్రమా రాత్ ఆది
పాటను పాడుకుంటూ
హుషారుగా వస్తోన్న చంద్రున్ని
చూపులతో ప్రశ్నిస్తాడు సూరీడు

సూరీడుని చూసి నవ్వుతూ
తాజ్మహల్ చూడ్డానికి ఎల్లాను
సారీ బ్రోఅని భుజంపై చేతిని వేస్తాడు

ఇద్దరూ అలా కబుర్లతో నడిచోస్తోంటే చూసి
అంబరం కుదుటపడ్డ మనసుతో
ఇంట్లోకి వెడుతుంది
చల్లారిన అమృతం వేడిచేయటానికి .

-గురువర్ధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *