పేర్చిన చితిపై కాల్చివేయి…!!!
ఇదేనా సంస్కృతికి దారి…
దేశం నేర్చిన సంగతులు అకృత్యపు
దాష్టికాలతో గతులు తప్పుతున్నాయి
సదాచారాలకు నిలయమైనా…
వెలితి నింపని నిస్సత్తువలకు సూత్రమై
చీకటితో నడిచిన సందేశాలకు వచనం
మానప్రాణాలు త్యజించడమేనా…
సామ్రాజ్య వాదాలు చిరిగిన
విస్తరులైనా…చతుర్వేదాలై నడిచిన
తరతరాల చరిత్రలను జాతి గౌరవాలుగా
వడగట్ట బడినవే…
కొలిచినా నిలువని దేవుళ్ళ నిరర్ధకంతో
ఎద అంచులు బీటలు వారుతున్నాయి
అయినా ఆమోదించబడని
స్త్రీ జాతి ఉద్దరింపులు వంచనలే…
మాయని కాలం మన్నింపులకై రాదు…
దేహం గుర్తింపని మానవత్వానికి
మొలకవుతు…జాతిలో పూసిన చక్రమై
స్వార్థాన్ని చీల్చుతు నవ భారతానికి
అభ్యుదయమై…రూపం పోసిన
ఎదను తాగుతు తీరని యావతో గిల్లే
గుంట నక్కల పేర్చిన చితిపై కాల్చివేయి…
క్షమించని కాలమా క్షణమాగవా…
దగా పడుతున్న మానవతులకు లోకం
స్థానమా…అవకాశాలను తొడిగే
తార్చుడు గాళ్ళను కూరిమి జూపని
కాలాంతకులను కామంతో పొరలు
నిండిన జాత్యాంకారులను బహిరంగంగా
ఉరితీయుటకు కాల స్వరూపమై మాలో
చేరిపో…
– దేరంగుల భైరవ