పెనువిషాదం
అభివృద్ధిలో నిమ్నోన్నతాలు స్పృశించినా ఆకలికై
అంగలార్చే అభాగ్యుల రోదనలు!
అహర్నిశలు పరిశ్రమించి
సరికొత్తగా ప్రపంచాన్ని ఆవిష్కరించాలనే తపనతో అంకురార్పణలు చేస్తున్నా
బండ బారిన గుండెలపై కుంపటిలా నానాటికి మిన్నంటుతున్న ధరలు!
సంప్రదాయాలలో ఆదర్శం !
పేదరిక రేఖకు దిగువన
పెను విషాదం!
నిలువ నీడలేని బడుగుల వ్యధలు! రక్షణ కరువై దుర్లభ స్థితిలో
కొట్టుమిట్టాడుతున్న అబలల వెతలు!
ఎండిన డొక్కల చప్పుళ్లు
చట్టాలకు వదులుతున్న తిలోదకాళ్ళ నీళ్లు!
కుల మతాల ఉన్మాదం
పరాకాష్టకు!
అసమానతల ఊబిలో
అమాయక జాతులు!
ఓటును అమ్ముకునే దుస్థితి! ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తున్న పరిస్థితి!
పేద గుండెలపై కుంపటిలా నానాటికి మిన్నంటుతున్న ధరలు!
సుశ్యామల భారతం
సమస్యల నిలయం!
బక్క జీవుల బతుకులు ఆగమ్యగోచరం!
జనుల మేలు కాంక్షించే ఆవిష్కరణలు గతి తప్పాయి!
జవజీవాలను హరించే వడిసల రాళ్ళయి పలాయనం చిత్తగించాయి!
– మామిడాల శైలజ