పెళ్లి 2022
1986 వ సంవత్సరం అభివృద్ధి చెందుతున్న చిన్న గ్రామం. ఆ గ్రామం లో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న రాజారామ్ కొడుకు శేఖరంకి డిగ్రీ అయిపోగానే మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ..
కొడుక్కి ఉద్యోగం దొరకడం తో శేఖరం తండ్రి రాజారామ్, శేఖరం తల్లి రామలక్ష్మి కొడుక్కి పెళ్లి సంభందాలు చూడటం మొదలెట్టారు.
శేఖరం తండ్రి ఉపాద్యాయుడు అవడం వల్ల శేఖరాన్ని మంచి క్రమశిక్షణతో పెంచాడు. శేఖరం ఎప్పుడు వాళ్ళ తల్లి తండ్రులని ఎదిరించింది లేదు. తనకు BSC కెమిస్ట్రీ చదవాలని ఉన్నాప్పటికీ తండ్రి ఆదేశించడం తో బీఎస్సీ బోటనీ తీసుకున్నాడు.
శేఖరం కోసం రాజారామ్ సంభందాలు చూస్తున్నాడు అని తెలుసుకున్న ఆ ఊరి పెళ్లిళ్ల పేరయ్య రాజారామ్ ని తాను పని చేస్తున్న పాఠశాల దగ్గరకు వెళ్లి కలిసాడు మధ్యాహ్నం భోజనాల సమయం లో…
************
నమస్తే రాజారామ్ గారు అని పేరయ్య స్టాఫ్ రూమ్ గుమ్మం బయట నుండి స్టాఫ్ రూమ్ లో అప్పుడే భోజనం చేసి పేపర్ చదువుకుంటున్న రాజారామ్ ని పిలిచాడు
ఒహ్హ్…నమస్తే నమస్తే అని పేపర్ ని బల్ల మీద పెట్టి గది బయటకు వచ్చాడు
చెప్పండి ఏంటి విషయం ఎలా ఉన్నారు? అన్నాడు రాజారామ్
నాకేమండి బాగానే ఉన్నాను ఇక విషయం అంటారా మీ శేఖరం గురించే మాట్లాడుదాం అని వచ్చాను అన్నాడు పేరయ్య.
విషయం గ్రహించిన రాజారామ్ రండి ఆలా బయటికి వెళ్లి మాట్లాడుకుందాం అని పాఠశాల వెనకాల ఉన్న నీలగిరి చెట్ల తోటలోకి వెళ్లారు.
అలా ఇద్దరు నడ్డుస్తుండగా…
ఇప్పుడు చెప్పండి రాజారామ్ గారు మీ శేఖరంకి ఎలాంటి అమ్మాయి కావాలి? కట్నం ఎంత ఆశిస్తున్నారు అని అడిగాడు పేరయ్య.
దానికి రాజారామ్ మంచి కుటుంబం లో ని అమ్మాయి కావాలయ్యా, అమ్మాయి పెద్దగా చదువుకోకున్న పర్లేదు, వాడు గోవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు అదీ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో కాబట్టి కట్నం రెండు లక్షలు కావాలి అన్నాడు.
అందుకు పేరయ్య కొద్దిగా అలోచించి సరేనండి, నేను మీకు ఒక వారం లోపు వచ్చి కలుస్తాను మీరు చెప్పినట్లుగానే మీ కుటుంబంలో కలిసిపోయే మంచి అమ్మాయిని ఎక్కడున్నా వెతికి తెస్తాను అన్నాడు పేరయ్య
రాజారామ్ నవ్వుతు తన జేబులోంచి ఒక మూడు వందల రూపాయలు తీసి పేరయ్య చేతిలో పెట్టి ఇవి ఖర్చులకు ఉంచండి అన్నాడు.
ఇక సెలవు మరి అని బయల్దేరాడు పేరయ్య.
************
ఒక వారం రోజుల తర్వాత ఒక రోజు సాయంత్రం టీ త్రాగుతూ ఇంట్లో పేపర్ చదువుకుంటూ కూర్చున్నారు శేఖరం ,రాజారామ్ ఇద్దరును …రామలక్ష్మి బియ్యం లో రాళ్లు వెతుక్కుంటూ కూర్చుంది
అప్పుడే… నమస్కారం రాజారామ్ గారు అనుకుంటూ వచ్చాడు పేరయ్య
నమస్తే నమస్తే రండి అని ఆహ్వానించాడు రాజారామ్
రామలక్ష్మి నమస్తే అన్నయ్య గారు అని పేరయ్యకు టీ తీసుకు రావడానికి వంట గదిలోకి వెళ్ళింది.
చెప్పయ్యా మా వాడికి ఏమైనా సంభందాలు తీసుకువచ్చావా అని అడిగాడు రాజారామ్
మరీ, ఊరికే వచ్చారనుకున్నారేంటండి.. ఒక పని ఒప్పుకున్నానంటే అది నెరవేరయ్యే వరకు నిద్రపోనండి నేను, అని తన సంచిలో ఉన్న అమ్మాయి ఫోటోని తీసాడు పేరయ్య.
అప్పుడే రామలక్ష్మి టీ తీస్కొని వచ్చి టీ తీస్కోండి అన్నయ్య అని అనగానే టీ తీసుకుంటూ ఈ ఫోటో ని చూడండి రాజారామ్ గారు అమ్మాయి ఎలా ఉందొ చెప్పండి అంటూ తన చేతిలోని ఫోటో ని రాజారామ్ కి ఇచ్చాడు పేరయ్య.
రాజారామ్ ఫోటోని చూస్తుండగా అమ్మాయి పేరు సుజాత, మన ఊరి నుండి ఇరవై కిలోమీటర్ల దూరం లో ఉన్న కృష్ణదేవపురం అనే గ్రామం, వ్యవసాయ కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు ఈ అమ్మాయి పెద్దది అని అమ్మాయి వివరాలు చెప్తున్నాడు పేరయ్య
రాజారామ్ ఫోటోని చూసి రామలక్ష్మి కి ఇచ్చాడు, శేఖరం అక్కడి నుండి వేరే గదిలోకి వెళ్ళాడు.
అమ్మాయి బాగానే ఉంది అని అంది రామలక్ష్మి సుజాత ఫోటోని చూసి
అమ్మాయి బాగానే ఉంది కానీ నేను అడిగిన కట్నం సంగతి వాళ్ళతో చెప్పారా? అని అడిగాడు రాజారామ్ పేరయ్యను ప్రశ్నిస్తున్నట్టుగా
దానికి పేరయ్య నీళ్లు మింగుతూ అయ్యా మీకు అమ్మాయి నచ్చింది కనుక ఒకసారి కృష్ణదేవపురం వెళ్లి అమ్మాయిని చూడండి అబ్బాయి కూడా అమ్మాయిని చూసుకుంటాడు ఆ తరువాత కట్నం విషయం మాట్లాడుకుందాం.
ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అల్లుడి కోసమే చుస్తున్నారండి వాళ్ళు లక్ష వరకు ఇస్తామంటున్నారు నేను ఎలాగోలా ఒప్పించి మరో లక్ష వరకు రాబడుతా కదా దాని గురించి ఏమి ఆలోచించకండి మీరు. వచ్చే శుక్రవారం అమ్మాయిని చూసుకోడానికి సిద్ధంగా ఉండండి ఏమంటారు అన్నాడు పేరయ్య
కొద్దీ సేపు అలోచించి సరేనయ్య నీ మాట మీద నమ్మకంతో ఒప్పుకుంటున్న వచ్చే శుక్రవారం ఉదయం వెళదాం అన్నాడు రాజారామ్
సంతోషం ఇక వెళ్లొస్తానండి అని బయలుదేరాడు పేరయ్య.
***********
రాజారామ్ తిరిగి పేపర్ చదువుకోవడం మొదలుపెట్టాడు, రామలక్ష్మి సుజాత ఫోటోని శేఖరం కి చూపించడానికి తన గదిలోకి తీసుకెళ్లింది మంచం మీద కూర్చొని ఉన్నాడు శేఖరం
రామలక్ష్మి శేఖరం దగ్గరికి వచ్చి చూడరా అమ్మయి ఎలా ఉందొ అని సుజాత ఫోటో ఇచ్చింది
శేఖరం ఫోటోని తీస్కొని చూసి… తిరిగి రామలక్ష్మి కి ఇచ్చి మౌనంగా ఉండిపోయాడు
ఏరా శేఖరం అమ్మాయి నచ్చిందా? లేదా… ఆలా మౌనంగా ఉంటె ఏమిటి అర్థం అంది రామలక్ష్మి కొద్దిగా కంగారుగా
మీకు నచ్చింది కదా అమ్మ నాకు నచినట్టే అన్నాడు శేఖరం చిన్నగా నవ్వుతు
రామలక్ష్మి నవ్వుతూ సరే శుక్రవారం వెళ్దాం అమ్మాయిని చూడడానికి అని వెళ్ళిపోయింది.
************
రండి రండి మీ కోసమే ఎదురుచూస్తున్నాను అని అన్నాడు రాజారామ్ వాళ్ళని ఆహ్వానిస్తూ సుజాత వాళ్ళ తండ్రి లక్ష్మయ్య. రండి కూర్చోండి అనడంతో కుర్చీలో కూర్చున్నారు రాజారామ్ వాళ్ళు
సీత, సీత, అని పిలిచాడు లక్ష్మయ్య తన భార్యని
వంట గదిలో నుండి హాల్ లోకి వచ్చి నమస్కారం అండి అనింది రాజారామ్ వాళ్ళతో, ఒక్కనిమిషం అని లోపలి వెళ్లి కొన్ని ఫలహారాలు తీస్కొని రాజారామ్ వాళ్ళ ముందున్న బల్ల మీద పెట్టింది సీత. ఇప్పుడివన్నీ ఎందుకండీ అన్నాడు రాజారామ్ లక్ష్మయ్య తో..
మరేం పర్లేదండి స్వీట్ లు తింటూ స్వీట్ న్యూస్ మాట్లాడుకుందాం అని ప్లేట్ లని తీస్కొని రాజారామ్ వాళ్లకి అందించాడు పేరయ్య
సీత, అమ్మాయిని తీస్కొని రా అని అన్నాడు లక్ష్మయ్య
సరేనండి అని సుజాతని తీసుకుని వచ్చి కుర్చోపెట్టింది పెళ్లి వాళ్ళ ముందు
ఏమ్మా ఎంత వరకు చదువుకున్నావు అంది రామలక్ష్మి సుజాతతో
ఇంటర్ వరకు అని సమాధానమిచ్చింది సుజాత
వంట చెయ్యడం వచ్చా అని ప్రశ్నించింది రామలక్ష్మి
వచ్చు అన్నట్టుగా తలూపింది సుజాత
నువ్వేమైనా అడుగుతావార అన్నాడు రాజారామ్ తలకిందికి దించుకుని కూర్చున్న శేఖరం తో
లేదు నాన్న అన్నాడు శేఖరం.
అమ్మాయిని లోపలి తీసుకెళ్లండి అంది రామలక్ష్మి సీతతో
సుజాతని లోపలి తీసుకెళ్లింది సీత
***********
సుజాత లోపలి వెళ్ళగానే మా వాడు రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు, మా వాడికి రెండు లక్షల కట్నం మేము ఆశిస్తున్నాం అన్నాడు రాజారామ్ లక్ష్మయ్య తో.
దానికి లక్ష్మయ్య కొన్ని క్షణాలు అలోచించి అయ్యా నేను ఒక మామూలు వ్యవసాయ దారుణ్ని నాకు ఇద్దరూ ఆడపిల్లలే సుజాత పెళ్లి చేసి నేను మరో అమ్మాయి పెళ్లి చెయ్యాలి అని చెప్తుండగా…
ఆడపిల్లలు అన్నాక పెళ్లి చెయ్యాలి కదండీ చెయ్యకపోతే ఎలా అన్నాడు రాజారామ్
అవునండి చెయ్యాలి చెయ్యక తప్పదు నేను చెప్పేదేంటంటే సుజాతకి రెండు లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే నేను నా రెండో అమ్మాయికి పెళ్లి చెయ్యడం కష్టం అవుతుంది అని చెప్తుండగా
అంటే మమ్మల్ని ఊరికే చేసుకోమంటారా ఏంటి అని ప్రశ్నించాడు రాజారామ్ కొద్దిగా అసహనం తో
ఎంత మాట నేను అంటుంది అది కాదండి రాజారామ్ గారు రెండు లక్షల కట్నం ఇవ్వలేనని అన్నాడు లక్ష్మయ్య
మరి ఎంత ఇవ్వగల్గుతావ్ అన్నాడు రాజారామ్
నేను ముందే పేరయ్యకు చెప్పను లక్షరూపాయలు ఇవ్వగల్గుతానని అన్నాడు లక్ష్మయ్య
ఈ రోజుల్లో లక్ష రూపాయలకి గవర్నమెంట్ ఉద్యోగం చేసే అబ్బాయిలు కాదు కదా ఏ పని పాట లేని వెదవలు కూడా రారండి అని కోపంగా అంటూ పదండి వెళ్దాం అని రామలక్ష్మి, శేఖరం తో అన్నాడు రాజారామ్
మౌనంగా ఉండిపోయాడు లక్ష్మయ్య… వెళ్లిపోయారు రాజారామ్ వాళ్ళు .
***********
రాజారామ్ వాళ్లు వెళ్ళిపోగానే కుర్చీలో కూలపడిపోయాడు లక్ష్మయ్య లోపలనుండి రాజారామ్ మాటలు విన్న సుజాత, సీత.. రాజారామ్ వాళ్ళు వెళ్ళిపోగానే కుర్చీలో కూలపడిపోయిన లక్ష్మయ్య దగ్గరికి వచ్చారు
ఈ సంబంధమూ పొయ్యింది సీత.. నన్ను క్షమించమ్మా సుజాత నీ తండ్రి నీ పెళ్లి కూడా చెయ్యలేని అసమర్ధుడు అన్నాడు సుజాత చేతులను పట్టుకొని
అవేం మాటలు నాన్న పెళ్లి కుదరనందుకు నాకేం భాద లేదు మీరిలా ఏడుస్తుంటేనే నాకు బాధేస్తుంది అంది సుజాత
వాళ్ళు అడిగిన కట్నం ఇస్తే నేను నీ చెల్లెలి పెళ్లి చెయ్యలేనమ్మ అందుకే అలా మాట్లాడాను వాళ్ళతో అన్నాడు లక్ష్మయ్య
నేను అర్థం చేసుకున్నాను నాన్న అని లోపలి వెళ్ళిపోయింది సుజాత.
***********
ఇంటికి చేరుకున్నాక… నాన్న నాకు ఆ అమ్మాయి నచ్చింది మీరు కట్నం కోసం పెళ్లిని రద్దు చెయ్యకండి అన్నాడు శేఖరం కొద్దిగా భయపడుతూ తన తండ్రి రాజారామ్ తో
నోరుముయ్… ఉద్యోగం రాగానే పెద్ద మగాడివి అయిపోయావేంట్రా సొంత నిర్ణయాలు తీసేసుకుంటున్నావ్ నాకే నీతులు చెప్తున్నావ్ అన్నాడు రాజారామ్ కోపం తో ఊగిపోతూ శేఖరం తో
మౌనం గా తన గదిలోకి వెళ్ళిపోయాడు శేఖరం
***********
రెండ్రోజుల తర్వాత ఆఫీస్ లో ఏదో పని చేస్కుంటూ ఉన్న శేఖరం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు పేరయ్య…
ఆయాసంతో తన గదిలోకి వచ్చిన పేరయ్యను చూసి ఏంటండీ ఏమయ్యింది ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు అన్నాడు శేఖరం కంగారు పడుతూ..
అదీ, అదీ, సుజాత, సుజాత ఆత్మహత్య చేసుకుంది అన్నాడు పేరయ్య
ఆత్మహత్య? సుజాతన! ఎందుకండీ ఏమయ్యింది అన్నాడు శేఖరం కంగారుగా
తన తండ్రి అడిగిన కట్నం ఇవ్వలేక తన పెళ్లి చెయ్యలేకపోతున్నాడని, తాను చనిపోతే ఎక్కువ కట్నం ఇచ్చి తన చెల్లికి మంచి అబ్బాయితో పెళ్లి చేస్తారని అనుకోని ఉత్తరం రాసి చనిపోయింది బాబు అని తనకు తెలిసిన విషయం ఏడుస్తూ చెప్పాడు పేరయ్య.
రండి సుజాత వాళ్ళింటికి వెళ్దాం అని పేరయ్యతో కలిసి బయలుదేరాడు శేఖరం .
*************
అప్పటికే సుజాత అంతక్రియలు పూర్తయ్యాయి హాళ్ళో సుజాత ఫోటో ముందు దీపం పెట్టి కూర్చొని ఉన్నారు లక్ష్మయ్య దంపతులు, సుజాత ఫోటోని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ నిలపడింది సుజాత చెల్లి లక్ష్మి .
పేరయ్య తో కలిసి లక్ష్మయ్య వాళ్ళింటికి వచ్చాడు శేఖరం, శేఖరం రావడం తో లేచి నిలపడ్డాడు లక్ష్మయ్య, నన్ను క్షమించండి లక్ష్మయ్య గారు సుజాత చనిపోవడానికి నేనే కారణం అన్నాడు శేఖరం కన్నీళ్లతో.
అందుకు లక్ష్మయ్య చిన్నగా నవ్వి తప్పు నీది కాదు బాబు “వరకట్నం అనే దురాచారాన్ని సృష్టించిన ఈ సమాజానిది దాన్ని పాటిస్తున్న మీ తండ్రి లాంటి వాళ్ళది…. పెళ్లి చేసే స్థోమత లేకున్నా పిల్లల్ని కన్న నాలాంటి వాళ్ళది”అన్నాడు
దానికి శేఖరం ఈ సమయం లో నేను ఇలా మాట్లాడుతున్నానని మరోలా అనుకోవద్దు నేను నా తప్పుని సరిదిద్దు కోవాలి అనుకుంటున్నాను అన్నాడు లక్ష్మయ్య తో
మౌనం గా ఆశ్చర్యం తో శేఖరం ని చూసాడు లక్ష్మయ్య
మీకు అభ్యంతరం లేకపోతే మీ చిన్నమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అదీ కట్నం లేకుండా అని అన్నాడు శేఖరం.
ఆశ్చర్య పోయిన లక్ష్మయ్య, బాబు మీ తండ్రి గారు ఒప్పుకోరు, నేనే ఎలాగోలా నా కూతురు పెళ్లి చేస్తాను అని అంటుండగానే మా తండ్రి గారే కాదు ఎవరు అడ్డుచెప్పిన, ఒప్పుకోకపోయినా నేను మీ కూతురు లక్ష్మి ని పెళ్లి చేసుకుంటాను ఆలా జరగకపోతే మీరు నా చావును చూస్తారు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శేఖరం పేరయ్యను తీస్కొని.
*************
చీకటి పడ్డ కూడా ఇంటికి రాకపోవడంతో శేఖరం కోసం ఎదురుచూస్తుంటారు రాజారామ్ గుమ్మం ముందు కుర్చీవేసుకొని
నెమ్మదిగా నడుచుకుంటూ వస్తాడు శేఖరం.. ఎరా ఇంత ఆలస్యం ఐయ్యిందే ఆఫీస్ కి వచ్చాను సాయంత్రం అక్కడా లేవు అని ప్రశ్నిస్తాడు రాజారామ్ శేఖరాన్ని, అప్పుడే లోపలినుండి బయటికి వస్తుంది రాజారామ్ భార్య.
సుజాత చనిపోయింది నాన్న, ఆత్మహత్య చేసుకుంది.. అడిగిన కట్నం ఇవ్వలేకపోతున్నాడని, తాను చనిపోతే తన చెల్లికైనా పెళ్లి అవుతుందని చనిపోయింది నాన్న
నేనొక నిర్ణయానికి వచ్చాను నాన్న
ఏంట్రా అన్నాడు రాజారామ్
సుజాత చావుకి నేను ఒక కారణం అందుకే తన చెల్లి లక్ష్మి ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అదీ కట్నం లేకుండా అని తన అభిప్రాయాన్ని చెప్తాడు శేఖరం
నువ్వు అలా చెయ్యడానికి వీల్లేదు అంటాడు రాజారామ్
నేను నా నిర్ణయం చెప్పాను, మీ అభిప్రాయం అడగలేదు అని లోపలి వెళ్ళిపోతాడు శేఖరం
ఒకరిమొహాలు ఒకరు చూసుకుంటారు రాజారామ్ దంపతులు.
*************
తన రూమ్ లో ఒంటరిగా కూర్చొని ఉన్న శేఖరానికి నాన్న ఈ కాఫీ తాగు అని సుప్రియ పిలవడం తో గత జ్ఞాపకాల నుండి ఈ లోకం లోకి తిరిగి వస్తాడు శేఖరం.
తన తండ్రిని ఎదిరించి పాతికేళ్ల క్రితం లక్ష్మిని పెళ్ళి చేసుకున్న శేఖరానికి కల్గిన సంతానం సుప్రియ చాలా తెలివైన అమ్మాయి పెద్ద కంపెనీలో పని చేస్తుంది మంచి జీతం కూడాను .
సుప్రియని చూసుకోవడానికి ఆరోజు పెళ్లి వాళ్ళు వచ్చి ఇరవై లక్షల కట్నం అడుగుతారు తాను అంత కట్నం ఇచ్చుకోలేనని చెప్తాడు శేఖరం..
ఆ సంభంధం చెయ్యిజారిపోవడం తో గతం లో తన జీవితం లో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటారు శేఖరం
***************
సుప్రియ తెచ్చిన కాఫీ ని తాగి.. లక్ష్మి నేను మ్యారేజ్ బ్యూరో వరకు వెళ్ళొస్తాను అమ్మాయికి వేరే సంభందం చూడమని చెప్పొస్తా అని బయలుదేరతాడు శేఖరం.
************
దురాచారం రూపం మార్చిందంతే.. అంతమవ్వలేదు
-శ్రవణ్ కుమార్ రాజా
పాపం సుజాత.. మీ కథ చాలా బాగుంది.మీకు అభినందనలు💐💐💐💐💐💐