పెళ్ళవుతుందా

పెళ్ళవుతుందా

కీర్తన ఒక మామూలు అమ్మాయి. తానేంటో తన పనే ఏంటో చేసుకుని వెళ్తుంది. ఎవరితో ఎక్కువ చనువుగా ఉండదు. తనలోని భావాలను అప్పుడప్పుడు పత్రికలకు పంపుతూ ఉండేది.

అలాంటి సమయం లో మీ భావాలు చాలా బాగున్నాయి అంటూ ఒక అభిమాని తనకు ఉత్తరాలు రాసేవాడు. అవి చూసిన కీర్తన చాలా సంతోష పడేది.

కాలం గడుస్తున్నది. అతను ఉత్తరాలు రాసేవాడు. తిరిగి కీర్తన కూడా జవాబులు రాస్తూ ఉండేది. అలా పరిచయం పెరుగుతూ వచ్చింది.

మరో వైపు కీర్తన ఇంట్లో సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. కానీ కాలం కలిసి రాక ఏ ఒక్క సంబంధం కుదరడం లేదు.

సంబంధాలు కుదరక పోవడం వల్ల కీర్తన చాలా ఆత్మన్యూనతకు గురైంది. తనకు పెళ్లి కావడం లేదనే బెంగ పట్టుకుంది. ఎలాగైనా పెళ్లి కావాలనే తన ఆలోచన తనను నిలవనీయలేదు.

నిజానికి కీర్తన నల్లగా ఉన్నా కళ గల మొహం, మామూలు ఎత్తు, పుష్టిగా ఉన్నా సంబంధాల విషయం లో మాత్రం కట్నం దగ్గర, జాతకాల దగ్గర, పెట్టి పోతల దగ్గర పోతూ ఉండేవి.

నలుపు పిల్ల మాకొద్దు అంటూ చాలా మంది మొహం మీదే చెప్పడంతో ఇంకా బెంగ్గ పెట్టుకుంది కీర్తనకి. ఈ జన్మకు నాకు పెళ్ళి అవుతుందో లేదో అనే ఫికరు తో చాలా సతమతం అవుతూ ఉండేది.

మరి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది పైగా చుట్టూ ప్రక్కల, చుట్టాల మాటలు, బెండకాయ ముదురు అంటూ మూతి విరుపులు చూస్తూ వయసు ముదిరితే బ్రహ్మచారినీ గా ఎక్కడ ఉండిపోవాల్సి వస్తుందో అని బెంగ పడసాగింది.

ఇక ఆ బెంగతో ఎవరైనా సరే పెళ్లి అయితే చాలు అని అనుకుంది. మూడు ముళ్లు పడి కన్నెచెర నుండి తనను బయటకు తెచ్చేదేవరా అంటూ చూస్తున్న సమయంలో తన అభిమాని నుండి ఉత్తరం వచ్చింది.

ఈ సారి ఆ ఉత్తరం లో అభిమాని కలుద్దామంటూ  ప్రపోజల్ తెచ్చేసరికి పెళ్లి గురించి ఆలోచిస్తున్న కీర్తన, వెంటనే కలవడానికి ఒప్పుకుంది.

కీర్తన ఆలోచన ఏమిటంటే తన భావాలు నచ్చాయి అన్నవాడు తనను నచ్చలేడా, ఇష్టపడలేడా అనుకుంది. అతన్ని చూసి పెళ్లి చేసుకుంటాడేమో అడగాలి అనుకుంది.

అతనికి ఉత్తరం రాసింది కలుద్దాం అని ఇక అతను వస్తున్నా అంటూ జవాబు ఇచ్చాడు. కీర్తన కలల్లో తెలిపోవడం మొదలు పెట్టింది.

అతను వచ్చినట్టు, తను పెళ్లి చేసుకోమని అనగానే సరే అంటూ ఒప్పుకున్నట్లు, తమ పెళ్లి జరిగినట్టు ఇలా చాలా కలలు కన్నది. అతను వస్తానన్న రోజు వచ్చేసింది.

రోజూ కన్నా ముందే లేచి, పనులన్నీ గబగబా ముగించుకుని ఉద్యోగానికి వెళ్తున్నా అంటూ ఇంట్లోనే తయారు చేసిన స్వీట్ ను డబ్బాలో పెట్టుకుని అతన్ని కలవడానికి వెళ్ళింది కీర్తన.

మరి ముందే ఇంట్లో చెప్తే ఇలాంటి వేషాలు వేస్తే ఊరుకుంటారా, లేదు కాబట్టి ఎవరికీ తెలియకుండా అతన్ని కలవడానికి వెళ్ళింది. పబ్లిక్ గార్డెన్ అందంగా సింగారించుకుని ముస్తాబు అయ్యింది.

పొద్దున పూట కాబట్టి తక్కువ గానే జనాలు ఉన్నారు. అక్కడొకరు, ఇక్కడోకరు ఉన్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన కీర్తన చుట్టూ చూడసాగింది. అతని కోసం కానీ అతని జాడ కనిపించలేదు.

అతను కనిపించక పోయేసరికి ఏం చేయాలో తెలియక ఇంకా రాలేదని ఎదురుచూస్తూ అక్కడ ఉన్న సిమెంటు చప్టా పై కూర్చుంది. కాసేపు అయ్యేసరికి నమస్తే అండి నా పేరు విక్రమ్ అంటూ వినిపించింది.

కీర్తన తలెత్తి చూసింది. అతను మామూలు ఎత్తుతో బాగానే ఉన్నాడు. అతను కీర్తనను చూస్తూ మీరేనా కీర్తన అంటూ అడిగాడు. అవునండీ నేనే కీర్తన అంది.

ఓహ్ అవునా చాలా సంతోషం అండి. మీ భావాలు చాలా బాగున్నాయి. మీ కవితలు అంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగా రాస్తారు అంటూ పక్కనే కూర్చుని చెప్పాడు.

అయ్యో నేనేదో రాస్తాను మీరిలా పొగడడం నాకు అదోలా ఉంది. ఉత్తరాల్లో కూడా ఇలాగే అంటారు కదా, ఇప్పుడు కూడా ఎందుకు అంది.

ఓహ్ సరే మీరు ఇబ్బంది పడుతున్నారు. సరే మీ గురించి చెప్పండి అంటూ అడిగాడు. కీర్తన అతనితో తన విషయాలన్నీ చెప్పేసింది. ఏదీ దాచాలని అనుకోలేదు.

అతను కూడా తన గురించి అన్ని చెప్తాడేమో అనుకుని అన్ని విషయాలు చెప్పేసింది. తర్వాత తన మనసులో మాట కూడా చెప్పింది. 

తనకు సంభందాలు చూస్తుంటే కుదరడం లేదని, తన దగ్గర ఏడు లక్షలు ఉన్నాయని, కావాలంటే తాను కూడా ఉద్యోగం చేస్తాను కానీ నన్ను పెళ్ళి చేసుకుంటారా అంటూ అడిగింది.

సిగ్గు విడిచి అన్ని చెప్పేసి చాలా ఓపెన్ గా అడిగింది. అంతా విన్న తర్వాత విక్రమ్ కీర్తన తో నాకు ఆల్రెడీ పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

కావాలంటే నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంచేస్తాను. వారంలో రెండు సార్లు వచ్చి వెళ్తుంటాను. ఇది నీకు ఇష్టం అయితే మీ వాళ్ళతో మాట్లాడు అన్నాడు.

అయితే కీర్తన విక్రమ్ మాటలు విని షాక్ అయ్యింది. అదేంటీ నీకు పెళ్ళి కాలేదని చెప్పావు కదా, మరిప్పుడు ఇలా అంటావు అంటూ అడిగి, రెండో పెళ్లి ఎలా చేసుకుంటాను అంటూ అడిగింది. ఇది అన్యాయం మోసం కదా అంది కీర్తన.

మోసమా ఏంటి మోసం నేను నీకు ఇంకా నిజం చెప్పాను. వేరే ఇంకెవరైనా అయితే నువ్విలా అడిగినందుకు పెళ్లి కాలేదని చెప్పి, నీ డబ్బులు తీసుకునే వారు. సో నేను కనీసం నిజం అయినా చెప్పాను.

అయినా అభిమాని అంటూ వస్తె ఇలా పెళ్లి చేసుకోమని అడుగుతావా, ఇదేం బుద్ధి నీకు, నీకు తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళు చేసేవరకు ఆగలేవా…

అయినా నువ్వు కూడా చిన్న పిల్ల లాగా మాట్లాడుతూ నన్ను మోసం చేయలేదా, నీకు పెళ్లి కాలేదంటూ చెప్తే నేనింకా ఏ ఇరవై ఏళ్లో అనుకున్నా కానీ ఇంత ముదురని అనుకోలేదు. అంటూ క్లాస్ పికాడు విక్రమ్.

అయినా ఇది అన్యాయం నన్ను రెండో పెళ్లి చేసుకుంటా అనడం ఎంత వరకు సమంజసం చెప్పు అంటూ అడిగింది.

దానికి విక్రమ్ నేను కనీసం ఇలాగైనా అన్నాను. అయినా నిన్ను చేసుకోవాలి అంటే వాడు ఎంతో దరిద్రుడు అయి ఉండాలి.

నిన్ను మోసం చేయనందుకు సంతోషించి, బయల్దేరు అంటూ తన బ్యాగ్ లో నుండి ఏదో తీసి కీర్తన చేతిలో పెట్టీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు విక్రమ్.

నిజాలన్ని కళ్ళ ముందు విక్రమ్ చూపించడంతో బిత్తర పోయిన కీర్తన అతన్ని అలాగే చూస్తూ అతనేం ఇచ్చాడో అని చేతిలోకి చూసింది. ఆమె చేతిలో చిన్న పాకెట్ అద్దం కనిపించింది…..

కీర్తన లాంటి అమ్మాయిలు వీధికి ఒకరు ఉన్నారు. పెళ్లి కావడం లేదని సమాజానికి భయపడుతూ తమలో తామే కుంగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటాం అనుకుంటే ఇదిగో విక్రమ్ లాంటి వాళ్ళు వీళ్ళను మోసం చేస్తూనే వుంటారు.

ఇంకా నయం విక్రమ్ నిజం చెప్పాడు. అలా కాకుండా పెళ్లికి ఒప్పుకుని తర్వాత మోసం చేస్తే, కీర్తన పరిస్థితి ఏమిటో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది.

ఇలా పెళ్లి కాకపోవడం వల్ల ఒరిగిపోయింది ఏం ఉండదు. పెళ్లి అవడం లేదని బాధ పడకుండా ఏదో ఒక లక్ష్యం కోసం పాటు పడితే వారు ఎన్నో సాధించవచ్చు…

గమనిక: ఇది ఎవర్ని ఉద్దేశించి కాదు కేవలం కల్పితం మాత్రమే 

0 Replies to “పెళ్ళవుతుందా”

  1. ఎదో ఒకరోజు మంచి హృదయం ఉన్న అబ్బాయి తప్పకుండా దొరుకుతాడు, నలుపు అంద వికారం కాదు, కోట్లమంది నలుపురంగు లో ఉంటారని మరువొద్దు, బావుంది కథ అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *