పెడపోకడలు
మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికే తలమానికం. హిందూ స్త్రీ చక్కగా జడ వేసుకొని నుదుటన కుంకుమ రేఖ దిద్దుకొని, కంటినిండా కాటుక తల నిండా పూలు, చక్కని నిండైన చీర కట్టుతో కనిపించడం వల్ల మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.
అచ్చమైన తెలుగింటి ఆడపడుచు గా చూడగానే తలవంచి నమస్కారం చేయాలనిపిస్తుంది ఎవరికైనా. అలా లక్ష్మీ కళ ఉట్టిపడుతూ కాళ్లకు గజ్జలు గలగలమంటుండగా ఇల్లంతా కలియతిరుగుతున్న ఆడవాళ్లు నడయాడిన చోట సిరి సంపదలు పొంగిపొర్లుతాయని మన వేదాలు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి.
నట్టింట్లో చూడచక్కని ఆహార్యంతో నిండు ముత్తయిదువ తిరుగుతూ ఉంటే ఆ ఇల్లు సకల సంతోషాలతో భాసిల్లుతుందని ఎక్కడైతే స్త్రీ కంటనీరు పెట్టిందో ఆ ఇల్లు కష్టాలమయం అవుతుంది అని ప్రాచీన గ్రంధాలు చెబుతున్నాయి.
హిందూ సాంప్రదాయంలోని చీరకట్టు బొట్టు ప్రపంచవ్యాప్తంగా మన గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి. అన్ని దేశాల స్త్రీలు మన చీర కట్టును ఇష్టపడుతూ వాళ్లు ధరించడానికి ఉత్సాహపడుతుంటే,
మన దేశపు స్త్రీలు చీరకట్టు అనేది ఓల్డ్ ఫ్యాషన్ గా, చదువుకొని వాళ్లు సంస్కారం లేని వాళ్ళు కట్టే వస్త్రంగా తీసిపడేసి నవ నాగరిక నవరంద్రాల దుస్తులను ధరించడానికి ఎగబడుతున్నారు.
బొట్టు పెట్టుకోవడం కూడా నామోషీగా భావిస్తూ వెంట్రుకలు విరబోసుకుని చిల్లులు పడిన పాశ్చాత్య సంస్కృతి దుస్తులను ధరిస్తూ ఒళ్లంతా ప్రదర్శిస్తూ అది నవ నాగరికత ఆధునిక జీవన శైలి అని బీరాలు పోతున్నారు.
నేటి నవ నాగరిక యువతులు కనీసం సందర్భాలకు తగినట్టుగా తరచుగా కాకపోయినా అప్పుడప్పుడైనా భారతీయ సంస్కృతి, కట్టుబొట్టు , ఆహార్యాన్ని అనుసరిస్తూ మన దేశ ఉన్నతిని నలుదిశల చాటే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
ప్రపంచ దేశాలు సంస్కృతి సాంప్రదాయ వైభవాల కేంద్రంగా మన దేశం వైపు చూస్తుంటే మనమేమో పాశ్చాత్య నవ నాగరికత పెడపోకల వైపు పరుగులు తీస్తున్నాము.
ఇది ఎంతవరకు ఉచితము అనేది ప్రతి సంస్కారవంతులైన వాళ్ళు ఆలోచించాల్సిన విషయం.
-మామిడాల శైలజ