పరాయీకరణ

పరాయీకరణ

చెమటను చిందించిన చేతులు
భవనాన్ని నిర్మిస్తే బతుకుపోరంటావు
ఔటర్ రింగ్ రోడ్డుకు రూపకల్పన చేసి మేధోమధనమంటావు
అనాదిగా కష్టించే కార్మికులు
ఈ దేశంలో సెకండ్, థర్డ్ దాటి కిందకు వెళితే కనిపించే క్లాస్ కు
చెందుతారు వారు
ఆశ్చర్యం పడాల్సిందేమీలేదు
సామూహికంగా అలవాటుచేసుకున్న సానుభూతి చాటున విసుగు వినయాన్ని ప్రదర్శిస్తోంది
వారిని తలుచుకో ఒక్కసారి…

పునాదులు తీస్తారు
ఇటుకపై ఇటుక పేరుస్తారు
అంతస్తుపై అంతస్తుకట్టి
తథాస్తు దేవతల్లా దీవిస్తారు
ఓటుబ్యాంకు కాదు కాబట్టి
మరో మజిలీకి మారిపోతుంటారు
అద్దె గర్భాన్ని మోసిన తల్లుల్లా
కన్నీటితో వీడ్కోలు పలుకుతారా
పోనీ జ్ఞాపకాలను కన్నీటిని చేస్తారా
గాంభీర్యం అన్నింటిని కప్పేస్తుంది ఆకలితోసహా…

ప్రజలూ గొప్పవారే
కట్టినవాడు హక్కుదారుడు కాదు
హుష్ కాకి అంటే మరో చోటును
వెతుక్కుంటూ అలుపెరగని బాటసారిలా సాగిపోతాడు అన్న నిజం తెలిసినవారు కదా
ఆకాశంలో పొడిచిన చుక్కలాంటి హర్మ్యమే కావాలి
వ్యాపార మర్మం తెలిసిన బలవంతుడిదే కదా విజయమని
అమాయకంగా ప్రశ్నిస్తారు…

భారం మోసే భూమిలా బలహీనులెప్పుడూ బాధ్యతతో సాగే నిశ్శబ్ద యాత్రికులే
వారు పరాయీకరణ చెందలేదు
శతాబ్దాలుగా పరాయివారిగానే
మిగిలిపోయారు.. కాదు కాదు
పరాయివాళ్ళని చేసేశాం
మనమే పరాయీకరణ చెందాం

– సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *