పరాకాష్ట
మంచితనం” ఒక వినసొంపైన పదం దీనికి ఒక ఏకవరుస నిర్వచనం ఇద్దాం. “మంచి అంటే చెడును దహించునది.” నాతో ఏకీభవిస్తావా పాఠకా? ఇలా ఎన్ని నిర్వచనాలిచ్చినా, వాటి మూల సారాంశం మంచిదే పైచేయి.
నేను దీన్ని ఒక కొత్త కోణంలో చూడట్లేదు. కానీ ఒక వింత కోణం నుంచి చూస్తున్నాను “అగోచరమైనవి లెక్కింపబడజాలవు” అనే ఒక సూత్రం ఉంది మన శాస్త్రాల్లో… మరీ మంచితనం కూడా అగోచరమైనదే…! ఐతే మన మేధాశక్తి దీన్ని బహువచనం చేసేసింది.
ఎలా అంటారా? ఈ చెడును దహించే మంచికి మూడు కాష్టలున్నాయండి. వరుసగా ఆది కాష్టము, మధ్యే కాష్టము, మరియు పరాకాష్టము. అంటే మనం మంచిని బేరీజు వెస్తున్నాము. నేను ఇక్కడ యింకో కాష్టాన్ని పరిచయం చేస్తున్నాను. అది కాంట కాష్టాము.
కొలిచేది కాంట అండి, నిఘంటువు అవసరము లేకుండానే చెప్పేస్తున్నాను. మన ప్రపంచ జనాభాలో సుమారుగా 40% మందిలో ఈ మంచితనం ఉంది అనుకుంటే వారిని పై మూడు తరగతుల్లోకి విభజించేస్తున్నాము. ‘కాంట’ కాష్టముండనే ఉంది. మరి ఈ 40% మంచితనం 60% చెడుతనాన్ని దహిస్తుందంటారా ?
నేను “రాజు” అనే పొరిగింటి ఆయన్ని చాలా దగ్గరగా పరిశీలించానండి. అతను ఏదీ దాచుకోడు, పారదర్శకత్వముని ఎప్పుడూ సానిటైజ్ చేస్తుంటాడు లేండి, ఆయన చెప్పింది. ఆయన మాటల్లోనే వినండి.
గురువు గారు, నేను మీతో ఒక విషయం చర్చిద్దామని అనుకుంటున్నాను, కాస్త, మీ సమయం అరువిస్తే చాలు.
నాకు, నిన్న ఒక చేదు, అహ, కాదులేండి, మంచి అనుభవమే జరిగింది. సాధారణంగా, ఎవరినీ నొప్పించని నేను అణువు స్థాయిలో నోచ్చుకోవాల్సి వచ్చింది. మా ఎదురింట్లో వాళ్ళ అమ్మాయిది.
ఒక 10 సం॥ల పాప లేండి పుట్టిన రోజైతే, ఈ అంకుల్ మంచితనం కూడా ఆహ్వానించబడింది. సరే అని గిఫ్ట్ సెంటర్‌కి వెళ్ళి ఆ పాపకి గిఫ్ట్ కొని తీసుకుని వెళ్లాను. బహుశ నేనే ఎర్లీ బర్డ్ ఆ వేడుకలో,
హాయ్, నిత్యా…. హాపీ బర్త్ డే అమ్మా ! ఎలా చేసుకుంటున్నావు ? చూస్తుంటే గొప్ప గానే అనిపిస్తోంది. ఇదిగో నీకో మంచి గిఫ్ట్ తెచ్చాను అని ఇస్తూ ఉంటె,
అమ్మాయి. “అంకుల్ థాంక్యూ ! ఇంకా ఎవ్వరూ రాలేదుగా నేను మిమ్మల్ని రెండు చిక్కు ప్రశ్నలు అడుగుతాను చెప్పండి.
” ఓ, యస్ అడుగమ్మా
సిటీ కాని సిటీ ఏంటో చెప్పండి?
నేను, తెల్సినా తెలియనట్లు ఓ రెండు నిమిషాలు ఆలోచించి అమ్మాయి చాలా గడ్డు
ప్రశ్న అడిగిందని బిల్డప్ ఇస్తూ…. ఆమె ప్రశ్నకి గొప్ప ప్రాధాన్యతను కల్పించేశాను.
అమ్మో, ఇంత కష్టమైన ప్రశ్నా? తెలీదు అని చెప్పాను.
అమ్మాయి. ఓస్. ఇది తెలీదా అంకుల్? ఎలక్ట్రిసిటీ అని చప్పట్లు కొడూ నృత్యం చేసినంత పని చేసింది.
ఇలా ఆ అమ్మాయి అడిగిన మరో ప్రశ్నకి కూడా అత్యంత ప్రాముఖ్యాన్ని ఇచ్చేశాను ‘తెలీదు’ అని.
క్రమంగా సంఖ్య పెరుగుతూ వచ్చింది. నిత్య తన స్నేహితులతో నా దగ్గరికి వచ్చింది. ఆమ్మాయి “హే, ఈ అంకుల్ కి ఏమీ తెలీదు, నేను అడిగిన రెండు ప్రశ్నలకీ, నో ఆన్సర్. ఇంకా మన ఫ్రెండ్ థర్డ్ క్లాస్ బుజ్జిగాడే నయం.”
ఇలా ఈ గొప్పశాల్తీని ఘనంగా పరిచయం చేసేసింది. ఇదే, అండి నన్ను పెద్దగా కాకపోయినా అణువంత నొప్పించేసింది. “
ఇలా సాగిందండి ఆయన మన రాజు గారు చెప్పిన కథ, ఇప్పుడు మీరే చెప్పండి, కాస్త ‘కాంట’ కాష్టము ఉపయోగించండి, నో అబ్జెక్షన్.
– వాసు