పండగ సిత్రాలు

పండగ సిత్రాలు

ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, అమ్మాయిలు పండగ బాగా జరుపుకున్నారు కదా, అంటూ సమూహం లో అడుగుపెట్టాను వారం తర్వాత, కానీ ఎవరి ఉలుకు పలుకు లేదు.

దాంతో చిరాకు వచ్చి బాగా కక్క ముక్కలు తిని,  అరగకుండా హాయిగా పడుకున్నారా, అంటూ ఇంకో సందేశం పెట్టాను.

దాంతో చిర్రెత్తిన ఒక తుంటరి అబ్బో మీ ఆడవాళ్లు అలంకరణకే సగం సమయం కేటాయిస్తారు. మీకే పండుగలన్నీ, మేమేం తినలేదు అంటూ వచ్చాడు.

ఆడవాళ్ళు ,అలంకరణ అనగానే నాకు చిర్రెత్తు కొచ్చింది. ఎందుకంటే అసలు అలంకరణ ఎక్కడ చేసుకుంటాం,  పండగ అంటే పనులతో సరిపోతుంది.

ఇంకా ఆ తుంటరి అలా అనగానే నాకు కోపం ముంచుకు వచ్చింది. దాంతో నాయనా అసలు నీకు మేము చేసే పనులు తెలుసునా అంటూ అడిగాను.

దానికా అల్లరి వాడు ఏముంది కాస్త ఉడకేసి, అలంకరణ చేసుకుంటూ కూర్చుంటారు. అంతేగా అన్నాడు. దానితో నాకు అర్దం అయింది. వీడు ఇంతే ఆలోచించగలడు అని, వాడి కళ్ళు తెరిపించాలి, కానీ అనుకుంటూ కొంగు నడుంకు చుట్టాను.

నాయనా పండగలు ఆడవారికి గుది బండలుగా మారతాయి. అయినా అది మేము బాధ్యత అనుకుని చేస్తాము.

ఇక కొంగు సరి చేసుకుని నడుం చుట్టూ బిగించి నాయానా పండగ వారం రోజులు ఉంది అనగానే  ఇల్లంతా దులుపుకోవడం. పక్క బట్టలు అన్నీ ఉతుక్కోవడం, ఇల్లు కడుక్కోవడం.

దేవుళ్ల పటాలు అన్ని శుభ్రం చేయడం, అంటూ ముట్టు లేకుండా చూసుకోవడం. ఒకవేళ ఉంటే పండుగల సమయంలో గోలీలు తెచ్చుకోవడం అవి వేసుకోవడం.

ఇక పిల్లల బట్టలు,పెద్దల బట్టలు అన్ని శుభ్రంగా ఉతికేసి జాగ్రత్తగా పెట్టుకోవడం, పండగ మురుకులు, అప్పాల కోసం పిండి పట్టించుకోవడం.

పిండి తీసుకువచ్చాక జల్లెడపట్టి మళ్ళీ ఒక రెండు రోజులు ఎండలో పెట్టడం. పురుగులు పట్టకుండా ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకోవడం.

పండగ సామాను కోసం ఇంట్లో కావలసిన కిరాణా సరుకులు తెచ్చుకోవడం, బతుకమ్మ పండుగ అయితే పువ్వులు తెచ్చుకోవడం, వాటికి రంగులు అద్దడం అవి ఆరేవరకు వేచి చూడడం.

అవి ఆరిన తర్వాత తీసి జాగ్రత్తగా రంగులు కింద పడకుండా, ఒక సంచిలో పెట్టడం. పండగ  వారంరోజుల ముందే మూకుడు పెట్టుకొని అప్పాలు, మురుకులు, చేగోడీలు ఇలా రోజుకో రకం చేసి పెట్టడం.

పిల్లలు ఉన్నవాళ్ళు, తినేవాళ్ళు ఉంటే ఎన్నిచేసినా, ఎంత చేసినా తక్కువే… చుట్టాలు, పక్కాలు ఉంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి అప్పాలు ఒత్తి రావడం జరుగుతుంది.

ఇక పండగ రోజు అందరికన్నా ముందే లేచి కల్లాపు జల్లి ముగ్గులు పెట్టి, తోరణాలు కట్టి మామిడాకులు పెట్టి, బంతి పువ్వులు గుచ్చి అందంగా వేయడం.

ఇంట్లో వాళ్ళు ఎవరూ లేవక ముందే వారికి టిఫిన్ల కోసం రెడీ చేసి, టిఫిన్ చేసి పెట్టడం, అందరూ లేచాక టీ లు, కాఫీలు పెట్టి ఇవ్వడం చేస్తాం.

మరోవైపు పూజ కోసం సిద్ధం చేయడం, ఈలోపు వాళ్ళ స్నానాలు, మా స్నానాలు చేసి వంట దగ్గర వెళ్లి అందరికీ టిఫిన్లు, టీలు ఇచ్చాక, బ్రేవ్ అంటూ తెల్న్చిన వాళ్ళు బయట షికార్లు చేయడానికి వెళ్తే, మరో  వైపు అన్నం, మరోవైపు కూరలు చేస్తూ ప్రసాదాల కోసం సద్దులు కలుపుతాము.

అందర్నీ హడావుడి పెడుతూ, మరోవైపు విడిచిన బట్టలు అన్నీ నానబెట్టి ఉతికి ఆరేసి, పూజకు వెళ్లడం పూజ అయిన తర్వాత ప్రసాదాలు అన్నీ చేసి నైవేద్యం పెట్టేసరికి ఆపర్ణహం దాటి గంట అవుతుంది.

ఆకలో అంటూ పిల్లలు రావడంతో, అందరికీ వడ్డించి ఎవరికి ఏం కావాలో చూస్తూ అందర్నీ సంతృప్తి పరుస్తూ వాళ్లు పెట్టిన వంకలకు ఫిల్ అవ్వకుండా, వారికి చిరునవ్వుతో సమాధానం చెప్తూ, అందరూ తిన్న తర్వాత పిల్లలు వదిలేసిన వాటిని పారేయలేక, వాళ్ళ ఇళ్లను కంచంలో పెట్టుకొని తిన్నాను అనిపించడం ఆ తర్వాత అవన్నీ సర్ది, ఇక బతుకమ్మను పేర్చడం చేస్తాము.

ఒకవేళ సద్దుల బతుకమ్మ అయితే తినకముందే గౌరమ్మ పేర్చుకొని, తిన్న తర్వాత పెద్ద బతుకమ్మను పేర్చుకుంటూ అందంగా ముస్తాబు చేసి మా బతుకమ్మనే బాగుందంటూ మురిసిపోతూ ఫోటోలు తీసుకునే సరికి సాయంత్రం అవుతూనే ఉంటుంది.

ఈ లోపు మళ్ళీ స్నాక్స్, కాఫీలు, టిఫిన్లు అంటారు. ఓవైపు అందరికీ కాఫీలు పెట్టించి ఆరిన బట్టలు తీసుకొచ్చి మడతపెట్టి, గిన్నెలన్నీ కడుక్కొని ఇల్లు ఉడ్చుకుని.

రాత్రికి ఏమైనా చేయాలా అని వంట చూసుకొని, అవసరమైతే రాత్రి వంట కూడా చేసి, అందరికీ అన్ని సరిగ్గా ఉన్నాయా లేవా అని చూసి, ఏమైనా తక్కువ ఉంటె వండేసుకుని.

మళ్లీ ఇంటి ముందు కల్లాపి చల్లి, ముగ్గు వేసుకొని రెడీ అయి బతుకమ్మ పెట్టుకొని ఆడుకొని, అందరూ పెట్టేచోటకు వెళ్లడానికి తొందర పడుతూ, ఎవరైనా వచ్చారా లేదా అని గమనించుకుంటూ…

అక్కడ బతుకమ్మ పెట్టి, చాలా రోజుల తర్వాత కలిసిన స్నేహితులు అందరితో మాట్లాడుతూ, ఒకరి క్షేమ సమాచారాలు మరొకరు తెలుసుకుంటూ…

నచ్చిన వారితో మాట్లాడుతూ, నచ్చని వారిపై చాడీలు చెప్పుకుంటూ, వాళ్లు వేసుకున్న నగల  గురించి, చీరల గురించి చెప్పుకుంటూ…

నీ చీర ఎక్కడ కొన్నావ్, ఈ నగలు ఎక్కడ చేయించావ్ అని అనుకుంటూ సమాచారం మొత్తం లాగేసి, అదిగో ఆమె ఎలా రెడీ అయిందో చూడు, ఈమె ఎలా చేసిందో చూడు అని కబుర్లు చెబుతూ..

మాటల్లో మాటగా, ఆటలో ఆటగా, పాటల్లో పాట పాడుతూ, చేతులు కలిపి ఆడుతూ తృప్తి తీరకపోయినా ఇక తీసేద్దాం అని అందరూ అంటున్నా, ఇంకొంచెంసేపు, ఇంకొంచెంసేపు అని అనుకుంటూ మాటల్లో పడిపోతూ…

ఇక తీయక తప్పదు అని తెలిసిన మరుక్షణం ఉసూరుమంటూ, ఉష్ అనుకుంటూ మళ్లీ ఇంటికి వెళ్లి బసాన్లు తోమాలి అని గుర్తుకు వచ్చి బాధపడిపోతూ, తెల్లారి నుంచి మళ్లీ ఏం టిఫిన్ చేయాలా, ఏం కూర చేయాలా అని ఆలోచించుకుంటూ…

బతుకమ్మను పోయిరావమ్మా, మళ్ళీ రావమ్మా అని సాగనంపుతూ, అందరికీ శుభ రాత్రి చెప్పి, ఇంటికి వచ్చాక, ఇంతసేపు వెళ్లావు అని అనే మూతివిరుపులు తట్టుకుంటూ మళ్లీ అందరికీ భోజనాలు పెట్టి…

అందరూ తిన్న తర్వాత ఆడుకున్నాం అనే సంతృప్తితో కొంచమైనా తృప్తిగా తిని, తిన్నవన్నీ కడిగేసి, మరుసటి రోజు కోసం కూరలు, టిఫిను సిద్ధం చేసుకొని, అర్ధరాత్రి కి నిద్రపోయే అతివల కష్టాలు అన్నీఇన్నీ కావు.

ఇక సంక్రాంతి పండగ అనగానే అరిసెలు, సకినాలు, అప్పాలకు బియ్యం నానబెట్టి, వాటిని తడి వుండగానే ఆడించి.

అప్పాలు, సకినాలు పోస్తూ, భుజాలు నొప్పి పెడుతున్నా కూడా యాడదికి ఒకసారి జరిగే పండగకు ఆ మాత్రం అయినా చేసుకోవడం తప్పదు కదా అనుకుంటూ…

వాటిల్లోకి శాఖాహరాలు, మాంసాహారాలు వండిపెడుతూ, వాటిని కంచాల్లో పెట్టి, అందరికీ అందిస్తూ ఉంటే, కాలు మీద కాలు వేసుకుని తింటూ పైగా చేసినవన్నీ బాగానే తింటూ ఉప్పు సరిపోలేదు కారం సరిపోలేదు అంటూ వంకలు పెట్టే మగాళ్ళ మాటలు తట్టుకుంటూ…

పిల్లల కోసం భోగి పళ్ళు రెడీ చేస్తూ, తెల్లారు ఝామునే లేచి, అందమైన ముగ్గులు వేస్తూ, వాటిలో కలర్లు నింపుతూ, ఓపిక లేకపోయినా తిడతారనే భయంతో, లేదా వాకిళ్ళు అందంగా కనిపించాలని కావచ్చు, చేయక పోతే ఆ మాత్రం చేసుకోలేవు అంటూ తిట్లు దీవెనలు పడుతూ…

అడదానివి కావా అనే మాటలకు భయపడి అయినా అందమైన ముగ్గులు వేయాలి అని కష్టపడి నేర్చుకుని రకరకాల ముగ్గులు, రంగుల్లో నింపుతూ, అన్ని నొప్పులతో రాత్రికి మంచం పైకి చేరితే, మూసుకుపోతున్న రెప్పలపైకి నిద్రాదేవి రా రమ్మంటూ ఆహ్వానిస్తుంది.

ఇవన్నీ చేసిన మమ్మల్ని చూస్తున్న మీరు కూడా అలంకరణకే సమయమంతా వెచ్చిస్తారు. అని అనడం ఎంతవరకు సమంజసం. ఇవన్నీ చేసిన మేము ఏది, ఎక్కడ అలంకరించుకోవాలి.

ఎప్పుడు అలంకరించుకోవాలి. ఇంత పనిలో మాకేక్కడ మేము అలంకరణ చేసుకున్నట్టు అనేది ఎక్కడ కనిపించింది.  ఇప్పుడు చెప్పు అంటూ నేను ఆ తుంటరి పిల్లవాణ్ణి అడిగేసరికి బిక్కమొహం వేశాడు.

అయ్యో సారీ అండి మీరు ఇంత కష్టపడతారని అనుకోలేదు అంటూ ఒక చిన్న మెసేజ్ తో కనుమరుగయ్యాడు ఆ కుర్రాడు. ఇప్పుడు చెప్పండి మీకు ఇక్కడ అలంకరణ ఎక్కడ కనిపించిందో.

పండగ అంటే అందరికీ సంతోషమే కానీ ఆడవారికి మాత్రం సంవత్సరమంతా చేసేపని ఆ మూడు రోజుల్లో చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో గనుక ముట్టు అయితే, ఇక ఆ బాధ చెప్పనలవి కాదు.

నువ్వు ఇప్పుడే కావాలా అంటూ ఒకరు. అందరి ఇళ్ళలో అట్ల పండుగ అయితే మన ఇంట్లో ముట్టు పండగ అంటూ తిట్లు దీవెనార్థాలు మరోవైపు. ఇక అత్తలు ఉన్న కోడల్లకైతే అదొక నరకమే.

ముట్టు (పీరియడ్స్) అవ్వకపోయినా, అయ్యానని చెప్తున్నావు అంటూ చూసేవరకు వదలని అత్తలు కొందరు. పని చేయవలసి వస్తుందని ఇలా చేస్తున్నావ్ అంటూ అడిగే అత్తలు కొందరు.

ఇక ఇవన్నీ భరిస్తూ చిరునవ్వుతో ఎదుర్కొంటూ పనులు చేసే మేము అలంకరణ ఎక్కడ చేసుకుంటాం. మీకు అర్థమవుతుందా…???

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *