పదాలు
మనం ఎన్నడైనా
పదాలతో నగ్నంగా మాట్లాడామా
పదాల భాషను అర్థం చేసుకున్నామా
పదాలు మనకంటే
ఎక్కువ కాలం జీవిస్తాయి
రక్తస్పర్శను పరిచయం చేస్తే
పదాలు కలలు కంటాయి
భావప్రాప్తిని పొందుతాయి
పదాల్ని మార్నింగ్వాక్కు తీసుకెళ్ళాలి
చెమటను కక్కించాలి
పదాల్ని జేబులోఏసుకుని తిరుగుడు
దిండుకింద దాసుకుని పండుడు
ఇలానే జరుగుతోంది
పదాలకు పౌడర్ అద్దుడు
సెంటు కొట్టుడు
పద్దతిగా పెంచుడు
మనకు తెల్వదు
పదాలు ఉక్కపోతతో
గుక్కపడుతున్న సంగతి
పదాలమీద చేయి వేసి
పండినాము అనుకుంటం కానీ
పదాలు దవాఖానాల వద్ద
ఆగమయిన బతుకుల వద్ద
నిర్వాసితుల వద్ద
రోడ్డు మీద పరుచుకున్న
రైతుల నిదుర వద్ద
తిరుగుతోన్న సంగతి మనకెరుకలే
సోమరుల వద్ద పదాలు
పీనాసి బోషాణంలో పైసల్లాంటివే
పదాలకు అంటుకట్టడం నేర్చుకోవాలే
రెక్కలు మొలిపించి ఎగరడం నేర్పాలే
పదం పిల్లి గురక కాదు
పులి గాండ్రింపు
పదం నత్త నడక కాదు
కదం తొక్కే గుర్రం
పదాలు బాటసారులే కాదు
బందూక్లు పట్టిన అన్నలూ కదా
పదాలు సుఖసంతోషాల్ని
దుఃఖ భయాల్ని మోసుకతిరుగే
రహస్యబోయీలు .
– గురువర్ధన్ రెడ్డి