పాదాలు
తన పాదాలు
పూలు కాకపోయినా
అవంటే నాకు మోహం
వంటింటిని
కొంగున దోపుకుని
తిరిగే పాదాలు
మసిమరకలతో ఉన్నా
నాకు అవి అభిమానం
పిల్లలకు స్నానాలు చేయించి
మొక్కల కుశలాలు చూసుకుని
మట్టి అంటిన తన పాదాలంటే అబ్బురం
నాకూ లంచుబాక్స్ రెడీ చేసి
తనూ సర్దుకుని
అలసటను బయటకు కనిపించకుండా
పరుగుతీసే పాదాలంటే మర్యాద
వస్తూ వస్తూ కూరగాయల తోటను
బుట్టలో కూరి చిరుచెమటలతో చేరిన
అలసిన పాదాలంటే గొప్ప గౌరవం
మళ్ళీ ఇంటిని తల దువ్వి
మాసిన బట్టలకు లాల పోయించి
తీగపై ఆరవేసి వడలిన తన పాదాలంటే
అమ్మ పాదాలే
రేయి మువ్వల్ని మోగించకుండా
అలా నిదురిస్తోన్న పాదాలను అనేకసార్లు
మనసులోనే ముద్దు పెట్టుకున్నాను
తను చాలా సార్లు
పాదాలు నొస్తున్నాయి అన్నపుడంతా
నేను మౌనంగా తలవంచుకుంటాను
మళ్ళీ రాత్రి
ఆ పాదాలకేసి జాలిగా చూస్తాను
తన అడుగుల కింద ఎంత శక్తి దాగివుంది
కరుణ కలిగిన ఆ పాదాలు
నా కలల పద్మాలు
ఆపాదాలే కదా
నా పొద్దుకు కిరణాలు
నా బాటకు చరణాలు
ఆ పాదాలే
నా ఆత్మ .
-గురువర్ధన్ రెడ్డి