ఓటమి సంతకం
నీ ఉనికిని నిందిస్తున్నారని
నీ బతుకుపై దాడి చేస్తున్నారనీ
నీ మనసు పదేపదే గాయపడుతూనే ఉంటుంది
దేశానికి, నీ దేహానికీ ఈ గాయాలేం
కొత్త కాదని ఎప్పటికప్పుడు
ఓదార్పు మందు రాసుకుంటూ ఉంటావు
పావురాలు ఎప్పుడూ ఎగురుతూనే ఉంటాయి
నేల మీద ఉన్నది శత్రువులని తెలిసీ
శాంతి మంతనాలు చేస్తుంటాయి
స్వేచ్ఛాగీతం పాడుకుందామనే ఆరాటంలో
రక్తాశ్రువులను మోస్తుంటాయి
అమ్మ పాడిన
జోలపాటను నిద్రపుచ్చి
నటిస్తున్న నిద్రను
ఎవరు తట్టిలేపగలరు?
జాతిమతమెరుగని
మట్టి రొమ్ము తాగిన దేశంలో దాహార్తి
దొరకదని, తీరదని తెలిసిపోయాక
చెదిరిపోతున్న గూడులకు
నాలుగు గడ్డి పరకల సహాయం
ఏ చెయ్యి అందిస్తుందిప్పుడు?
నీపై మోపే ఆరోపణలను
ఏ మూలవాసులొచ్చి చెరుపుతారిప్పుడు
జీవితం పిలుపుపై కాలం చేసిన
ఓటమి సంతకం చెరిగిపోయినా
అదెప్పుడూ పెట్టుడుమచ్చే
-గురువర్థన్ రెడ్డి