ఓర్పెంత గొప్పదో తెలుపుతూ
తెగిన అడుగు పీఠాలతో బంధం
వాలిపోయి…నడుములను బిగించి
మోపులుగా కట్టి ఎండిన తనువులను
నూర్పిళ్ళ కక్ష్యలతో ఈడ్చి చేసిన
ఈసడింపులలో….ఏడు కల్లాలు ఏతమై
ఎగిరి వచ్చిన కల్లపు గింజకు ప్రతి ఘటించని పరిస్థితులు సంఘమై దారి చూపునా…..?
ఎండ గాలి వాన నేల గగనాలు…
నన్ను ఫలితం ఆశించని నిత్య సౌభాగ్యాలే
మమకారం నిండిన మట్టిలో దాక్కొని…
తొలిపొద్దు సంబరంగా జారిన చినుకులతో
తాపసిక యజ్ఞాన్ని విజయ ముద్రగా
చూపుతు…ఎదిగే ఓర్పు ఆకాశానికైనా
పెరిగేకొద్ది ఒదగాలని వంచిన మెడలతో
సంస్కారాన్ని కాపుగా కాస్తున్నాము…
కోసే కొడవలికి కోపమా….లేక క్రౌర్యమా
పిడికిలితో బిగపట్టిన నెలవంకలా…
పదునుదేలి దయాదాక్షిణ్యాలు మరిచి
మే నిలిచిన స్థానపు విలువలను ఊచకోత
కోసుకొంటు మా బతుకులను కొయ్యలు
దేల్పుతు…రైతు నేస్తంలో తనదొక బలమైన
నమ్మకమని ప్రతినిత్యం తరిగే వయస్సుతో
తనవంతు కృషిని చూపుతుంది….
కష్టమని కాలానికి చెప్పకు…
ఒడిదుడుకుల అవగహనలు ఎన్నైనా
ఓపికతో నేర్చుకో…ఒలకబోసిన
ప్రేమాప్యాయతలు ఒనరుచూచి తెంచేటి
నయవంచనలని పసి ఆకుల పచ్చధనంతో
ప్రకృతికి హారతై తొలిమలి సంధ్యల కూర్పును
గమనిస్తు…ఓర్పెంత గొప్పదో తెలుసుకొంటు…
విరబూసిన పరిమళాలతో నాదొక చేయని
సంతోషపడు….
-దేరంగుల భైరవ