“ఒంటరి” నవల సమీక్ష
కొన్ని పుస్తకాలు కొందామని, NTR స్టేడియం హైదరాబాద్లో 2019 డిసెంబర్లో జరిగిన పుస్తక ప్రదర్శనకు వెళ్ళడం జరిగింది. అక్కడ అనుకోకుండా ఒక షాపులో ‘ఒంటరి’ నవల చూడటం, కొన్ని పేజీలు చదవడం….
చదివిన దగ్గరనుండి ఎప్పుడెప్పుడు మొత్తం చదువుదాం అనే అతృతతో పుస్తకం కొనుక్కొని వచ్చి నిరంతరాయంగా చదవడం అలా జరిగిపోయింది.
నేను చదివిన కొన్ని నవలలో, ఏకబిగిన పట్టుబట్టి మొత్తం అయిపోయెవరకు చదివేలా చేసిన గొప్ప నవలలో ఒంటరి ఒకటి అని అనడానికి ఎటువంటి సందేహం లేదు.
ఈ నవల రెండు భాగాలుగా సాగింది, ఒకటి – పేరు ప్రఖ్యాతలు, కావల్సినంత ధనం గడించిన ఒక డాక్టర్.. ఆరోగ్యపరంగా ఇబ్బందికి లోనై, ఆ క్రమంలో తన ఆరోగ్యం బాగు దృష్ట్యా అంతరించిపోతున్న ధాన్యపు జాతి కోసం ఆరు నెలల అన్వేషణ.
రెండవది – తన ప్రాణవాయువుతో పొలాన్ని బుజ్జగించి, సమస్త జీవకోటితో అత్యంత సహజంగా ప్రకృతిలో మమేకమైపోయిన రైతు నర్సయ్య జీవితం.
ఈ నవల ప్రధానంగా పల్లెటూరు రైతు నర్సయ్య, అతని వ్యవసాయ జీవన విధాన నేపథ్యంలో సాగుతుంది. రాయలసీమ యొక్క యాస, భాష, సంస్కృతి, అలవాట్లు, వ్యవసాయ పద్ధతులు, పచ్చని పల్లె వాతావరణం, మూగజీవులతో, మొక్కలతో సంభాషణలు మరి ముఖ్యంగా నవల రచయిత వెంకటరామిరెడ్డి గారు వర్ణించిన నర్సయ్య జీవితం అమోఘం.
ప్రకృతినే తన ఇల్లు లాగా భావించి తనకు ఎంత వరకు అవసరమో, అంతవరకే ప్రకృతి నుండి తీసుకునే తత్వం, ఆయన ప్రకృతిలో ఒదిగిపోయే విధానం అత్యద్భుతం. అందుకేనేమో అంటారు, “మనిషికి మట్టికి విడదీయరాని అనుబంధం ఉంది” అని. ఈ నర్సయ్య జీవితం కూడా అంతే గొప్పది.
ప్రకృతిలో మమేకమై, ప్రకృతిలో దొరికేవి తింటూ, ప్రకృతితో సంభాషిస్తూ, ప్రకృతిలో కలిసిపోయే మనకు ప్రకృతిని వశం చేసుకోవాలనే నేటి మానవుని అత్యాశకు ఈ ఒంటరి నవల ఒక చెంపపెట్టులాంటిది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఈ పుస్తకం గురించి రచయిత వెంకటరామిరెడ్డి గారు మాట్లాడుతూ, “జంతువుల అరుపుల్ని వాటి భాషగా అర్ధం చేసుకోలేక, మొక్కల స్పర్శని వాటి పలుకులుగా అనువదించుకోలేక, పక్షుల కిలకిలారావాల్ని వాటి మాటలుగా గ్రహించలేక, వాటితో చెలిమి చేయలేక, వాటిని దూరంగా తరిమి నేలను సొంతం చేసుకోవాలని ప్రయత్నించే మనిషికి మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కొంతైనా అధ్యయనం చేయించే ఒక చిన్న ప్రయత్నమే ఈ ‘ఒంటరి’ నవల.”
ప్రకృతిని, వ్యవసాయాన్ని, పల్లె జీవనాన్ని, మూగ జీవాలను ప్రేమించే, ప్రతి తడి గుండెను హత్తుకుంటుంది ఈ నవల. ప్రకృతిని తమ స్వార్ధానికి వాడుకోవాలనుకునే రాతి గుండెలను మారుస్తుందనడం లో ఎటువంటి సందేహం లేదు.
చివరగా పుస్తక ముందుమాటలో పొందుపరచిన మాటలాగా “ప్రకృతిని అర్థం చేసుకున్నవాడెవడు, దాన్ని విధ్వంసం చేయడు”.
-KPR (ఆమొఘీ)