ఒక తెలియని బంధం
“హలో” అంటూ మెసేజ్ టోన్ ఎవరా అంటూ చూశాను ఏదో అన్నోన్ నెంబర్. ఆ నెంబర్ ఎవరిది అనుకుంటూ “హలో, హూ ఈజ్ థిస్” అని మెసేజ్ చేశా.
“నా పేరు వినయ్ నేను ఒక నర్సరీ నడుపుతున్నాను మీకు ఏమైనా మొక్కలు కావాలంటే నన్ను సంప్రదించండి ఇలా నేను అందరికీ వాట్సాప్ లో మెసేజ్ చేస్తూ ఉంటాను ఇది నా వ్యాపారం”. అంటూ చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు.
“అవునా నాకు మొక్కలు అంటే ఇష్టమే, సరే అవసరం ఉన్నప్పుడు చెప్తాను” అన్నాను నేను. “అలాగే ఈ మెసేజ్ మీరు మీ ఫ్రెండ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్” అంటూ రిక్వెస్ట్ గా అడిగాడు. “సరే ఖచ్చితంగా చేస్తాను” అంటూ ఆ మెసేజ్ వాట్సాప్ గ్రూప్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేశాను.
మా మధ్య పరిచయం మొదలైంది. హాయ్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇలా ప్రతి రోజు ఏదో ఒక సమయంలో మెసేజ్ చేసుకుంటూనే ఉండేవాళ్ళం. కానీ ఒక్కసారి కూడా ఫోన్ లో మాట్లాడుకోలేదు.
అలా మా పరిచయం ఒక ఆరు నెలలు ఫోన్ లో చాటింగ్ మెసేజ్లతో సాగింది. ఈ ఆరు నెలల్లో మా గురించి మేము ఒకరికొకరం చెప్పుకున్నాం. అతని కుటుంబం గురించి నాకు, నా కుటుంబం గురించి అతనికి అన్నీ తెలిసాయి.
మా బాధలు షేర్ చేసుకునే వాళ్ళం అలాగే సంతోషాలను కూడా చెప్పుకునే వాళ్ళం. నన్ను ఒక్కసారి కూడా వేరే విధమైన ప్రశ్నలు అడగలేదు నేను అడగలేదు దానికి పెద్ద కారణం అంటూ ఏమీ లేదు. నాకు అసలు ఆ ఆలోచన కూడా రాలేదు.
అలా రోజులు గడిచిపోతున్నాయి మా మధ్య ఇంకా చనువు పెరిగింది. మీరు అనే స్థాయి నుంచి రారా, పోరా అనుకునే వరకు ఏమే ఓసే అనుకునే వరకు ఆ చనువు కాస్తా హద్దులు దాటింది.
ఇక అప్పటి నుంచి మా ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకునే వాళ్ళం. ఫీలింగ్స్ అంటూ పెద్దగా లేవు ఇలా జరిగింది, నాకు ఇలా ఇష్టం, నాకు ఈ రంగు అంటే ఇష్టం, అంటే ఇష్టం, అభిరుచులు, అలవాట్లు, అంటూ చెప్పుకునే వాళ్ళం.
అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత ఎందుకో మా మధ్య దూరం పెరిగింది కారణం మా కుటుంబ సమస్యలు అతని కుటుంబ సమస్యలు కావు. కరోనా కాలంలో ఇంట్లో తీసుకునే అతి జాగ్రత్తల వల్ల ఎవరితోనూ మాట్లాడకుండా వేరే పనులలో బ్రతకడానికి చేసుకునే ఇంట్లో ఉండి చేసుకునే పనులలో బిజీ అయ్యాను.
అందువల్ల నేను తనకి మెసేజ్ చేయలేకపోయాను. ఎందుకంటే, నాకు ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చింది. నేను ఆ ప్రాజెక్టును ఫినిష్ చేయడంలో పడిపోయాను. కుటుంబం గడవడానికి డబ్బు కావాలి కదా…. అందులోనూ కరోనా సమయం కాబట్టి అలా రోజులు గడిచిపోయాయి.
అతని విషయం నేను మర్చిపోయాను అతను కూడా అదే కావచ్చు ఎందుకంటే కరోనా అందర్నీ కాటేసింది అన్ని వ్యాపారాలు దెబ్బతీసింది చాలా మందిని దూరం చేసింది. ఆప్యాయతలు అనురాగాలు అనేవి కనుమరుగు అయ్యాయి మనుషుల అసలు నైజం అనేది అప్పుడే బయట పడటం మొదలయ్యింది.
కాబట్టి అందరికీ దూరంగా ఉండాలి అనుకున్నా నేను. అందుకే ఎవరితోనూ మాట్లాడకుండా మా పని మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం.
రెండేళ్ల కరోనా తరువాత కాస్త తగ్గుముఖం పట్టింది అనుకున్న సమయంలో అతని నుంచి మెసేజ్ ఎలా ఉన్నారు అంటూ నేను ఆశ్చర్యపోయాను. చాలా రోజుల తర్వాత అతను నాకు గుర్తులేడు. బాగానే ఉన్నాను అంటూ చెప్పాను.
అప్పుడు అతను తనకు జరిగిన విషయాలను చెప్పడం మొదలుపెట్టాడు. అతనికి అతని కుటుంబానికి కరోనా వచ్చినట్లు, వ్యాపారం దెబ్బతిన్నట్లు, చాలా కోల్పోయినట్లు, చాలా లాస్ వచ్చినట్లు తెలిసి నేను చాలా బాధపడ్డాను.
నా విషయాలు కూడా అన్నీ చెప్పాను అతను నాకు బ్రతకడానికి ఏదో ఒక దారి దొరికింది అని తెలిసి సంతోషపడ్డాడు. తర్వాత తనకి చాలా నీరసంగా ఉంటుందని, అసలు ఏ పని చేయలేకపోతున్నాను అంటూ తనకు తన భార్యకు కూడా వచ్చి చాలా ఇబ్బందులు అయినట్లు చెప్పాడు నేను ఆశ్చర్యపోయాను.
మంచి స్థితిలో ఉన్న ఒక వ్యక్తి అన్ని కోల్పోతే ఎలా ఉంటుంది అనేది అతన్ని చూస్తే నాకు జాలి వేసింది. ఏం చేస్తున్నారు ఇప్పుడు, నేను మామూలు బయటకు వెళ్లడం లేదు ఇంట్లోనే అంటూ చెప్పి స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ గురించి కూడా చెప్పాను.
మంచి పని చేశారు అంటూ మెచ్చుకున్నాడు తర్వాత మాటల్లేవు.. మళ్లీ వ్యాపారం పుంజుకున్నట్లు ఉంది అతని బిజీలో అతను పడిపోయాడు నేను నా బాధ్యత లో మునిగిపోయాను.
కానీ నా పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది ఎవరూ లేరు ఒంటరి అయిపోయాను నేను. అందరూ ఉన్నారు కానీ లేనట్లే ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు కొందరితో చెప్పుకోలేనివి ఉంటాయి.
కాబట్టి నేను ఒంటరిని అన్న ఫీలింగ్ నాలో కలిగింది. మన ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. మళ్లీ ఈ మధ్యనే అతను నాకు మెసేజ్ చేయడం మొదలుపెట్టాడు.
అప్పుడు నేను కూడా నా సమస్యలన్నీ తనతో చెప్పుకున్నాను అతను కూడా ఇంతకు ముందులా కాకుండా బంధాలకు విలువ ఇచ్చే వ్యక్తి లాగా ఓదార్చడం మొదలు పెట్టాడు. దాంతో నేను కరిగిపోయాను.
మా ఇద్దరి మధ్య చెప్పుకోలేని స్నేహం కూడా మొదలైంది. అంటే అక్రమ సంబంధం కాదు కానీ స్నేహ సంబంధం కూడా కాదు అంతకు మించిన బంధమేదో మమ్మల్ని ఇద్దరినీ కలిపింది.
మేము అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం నేను ప్రతీ విషయాన్ని తనతో చెప్తాను తను కూడా ప్రతీ విషయాన్ని నాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు.
గుడ్ మార్నింగ్ తో మొదలై గుడ్ నైట్ తో పూర్తవుతుంది మారోజు, ఒకప్పుడు చిన్న మెసేజ్ తో మొదలైన మా బంధం ఇప్పుడు ఒక తెలియని బంధంగా మారింది. ఎదో పెనవేసుకుపోయినట్లుగా అనిపిస్తుంది.
ఈ విషయం ఇద్దరికీ అర్థమైంది ఇది తప్పు కాదు ఎందుకంటే మేము ఎప్పుడూ కలవలేదు, తప్పు కూడా చేయలేదు, ఒకరి గురించి ఒకరికి మాత్రం పూర్తిగా తెలుసు. ఇలాంటి స్నేహం ఇలాంటి ఒక బంధాన్ని ఏమంటారు మీకు ఏమైనా తెలుసా?
స్నేహం కాదు, ప్రేమ కాదు, అక్రమ సంబంధం కాదు ఒక ఆప్యాయత అనురాగాలతో కూడిన ఈ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ కథను నా భావాలను అతనికి అంకితం ఇస్తున్నాను. ఇంతకీ నా పేరేంటో మీకు చెప్పలేదు కదూ నా పేరు వినయ.
– భవ్యచారు