ఒక రోజు
కొత్తగా పెళ్ళయిన జంట మధురిమ , కార్తీక్ లు.
కార్తీక్ అందరిలానే సాఫ్ట్ వేర్ జాబ్ చేసే సగటు సాఫ్ట్ వేర్ ఉద్యోగి.
మధురిమ తన తోటి అమ్మాయిలతో కుస్తీ పడి మరీ బీ.టెక్ పూర్తి చేసి అమోఘమయిన మార్కులు తెచ్చుకుని ఒక సంవత్సరం జాబ్ చేసి వెంటనే ఇంట్లో వాళ్ళ ప్రార్థన మేరకు పెళ్లి చేసుకున్న సగటు తెలుగింటి ఆడపడుచు అని చెప్పొచ్చు.
కార్తీక్ ది అందరూ ఎటు పోతే మనం అటు పోవాలి అనుకునే మనస్తత్వం.
మధురిమ మాత్రం అలా కాదు. అందరితో పాటే తను అన్నట్టు పైకి కనిపిస్తుంది కానీ, లోపల తన ప్రపంచమే వేరు. వీరు ఇద్దరు ఇంత విరుద్ధమయిన మనస్తత్వం గల వాళ్ళు కాబట్టే దేవుడు వీళ్ళని జత చేసాడేమో అనిపిస్తుంది.
జాబ్ రీత్యా కార్తీక్ కి కలకత్తా కి ట్రాన్స్ ఫర్ అవ్వటంతో మధురిమని తీసుకుని తన ఆఫీసు కి దగ్గరిలో ఒక మంచి ఇల్లు వెతికే పనిలో పడ్డాడు.
కలకత్తా ఒక మహా నగరం. కానీ ఈ సాఫ్ట్ వేర్ కంపెనీ లు అన్నీ నగరం చివరిలో ఎక్కడో ఉంటాయి. అందువల్ల జనారణ్యం చాలా తక్కువగా ఉంటుంది. పట్టు వదలని విక్రమార్కుడిలా వెతికి మరీ ఆఫీసుకి దగ్గరలో ఒక అపార్ట్ మెంట్ తీసుకున్నాడు.
కానీ, ఈ అపార్ట్ మెంట్ ఆఫీసుకి మాత్రమే దగ్గరగా ఉంటుంది. మిగతా అన్నింటికీ దూరమే. ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళాలన్నా కూడా ఎంతో దూరం నడవాలి.
లేదా అంతే దూరం కార్ లోనో, ఆటో లోనో, బస్సు లోనో ప్రయాణించాలి.
మధురిమకి ఈ అపార్ట్ మెంట్ లోకి చేరటం ఇష్టం లేదు. ఇదే విషయం కార్తీక్ తో చెబితే,
కార్తీక్ ,” ఆఫీసు కి ఉరుకులు పరుగులు తీస్తూ వెళ్ళకుండా ఆరామ్ గా వెళ్ళొచ్చు. ఇక పోతే షాపింగ్ మాల్స్ , కూరగాయల మార్కెట్ దూరం అంటావ్…. అంతేనా? వీటన్నింటికీ నేనున్నా కదా మధు. సాయంత్రాలు అలా నడుచుకుంటూ వెళ్దాం. లేదా నా కార్ లో వెళ్దాం. As you wish .ఏమంటావ్?”
కార్తీక్ అంత ప్రేమగా చూస్తూ అడిగేటప్పటికి మధురిమ కి ఇష్టంలేకపోయినా కార్తీక్ మీదున్న ప్రేమతో సరే అంది.
అలా ఒక మంచి రోజు చూసుకుని ఈ అపార్ట్ మెంట్ కి షిఫ్ట్ అయిపోయారు మధురిమ, కార్తీక్ లు.
కార్తీక్ కి కొత్త ఇల్లు చాలా నచ్చింది. కిటికీలు తెరిస్తే గాలి వెలుగు. కొత్త అపార్ట్ మెంట్ కావటం తో ఇంటీరియర్ డిజైనింగ్ చాలా అందంగానూ, చాలా కొత్తగానూ అనిపించింది. మొదట్లో మధురిమకి అపార్ట్ మెంట్ సముదాయం అంత నచ్చకపోయినా, ఈ అపార్ట్ మెంట్ మాత్రం బాగా నచ్చింది. కార్తీక్ కి నచ్చినట్లే మధురిమకు కూడా ఇంటీరియర్ డిజైనింగ్ బాగా నచ్చింది.
కానీ, వీటన్నింటికంటే కూడా మధురిమ ని ఇట్టే ఆకర్షించినది ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఆ పెయింటింగే అనటం లో ఎటువంటి సందేహం లేదు.
కార్తీక్ కి పెయింటింగ్ అన్నా, ఆర్ట్స్ అన్నా అంత ఇంట్రెస్ట్ లేదు. మధురిమ అలా కాదు. దేన్నైనా సరే చాలా నిశితంగా పరిశీలిస్తుంది. అందుకే, ఈ పెయింటింగ్ అంతగా నచ్చింది. అలా చైర్ లో కూర్చుని తదేకంగా మనల్నే గమనిస్తున్నట్టు కనిపిస్తున్న ఒక 26 ఏళ్ళ యువకుడి పెయింటింగ్ అది.
మధురిమ అప్పుడప్పుడూ కార్తీక్ ను ఆటపట్టిస్తూ ఇలా అంటూ ఉండేది ,
“నీకంటే ఆ పెయింటింగ్ లో కుర్రాడే బావున్నాడోయ్. నువ్వేమో ఆఫీసు పనుల్లో పడి రోజు రోజుకీ గ్లామర్ తగ్గించుకుంటూ పోతున్నావ్. ఇలా అయితే మధు ని ఇంప్రెస్స్ చెయ్యటం కష్టమే అయ్యగారికి. “
కార్తీక్ వెంటనే, ” అంత బావుంటే మరి వాడినే చేసుకోవచ్చుగా. ఇప్పటికీ టైం మించిపోలేదు. “
మధురిమ,” ఏం చేస్తాం? ఈ జన్మ లో తమరితో పెళ్లి అయిపొయింది కదా మరి. వచ్చే జన్మ లో తనకి ట్రై చేసుకుంటా.”
కార్తీక్, “అయితే నేను వచ్చే జన్మ లో కత్రినా కైఫ్ కి మొగుడి గా పుట్టాలని దేవుడిని కోరుకుంటున్నా.”
కార్తీక్ ఆఫీసు కెళ్ళగానే మధురిమ మధ్యాహ్నానికి లంచ్ రెడీ చెయ్యటంలో బిజీ గా ఉంటుంది. వంట పూర్తి చెయ్యగానే ఏదో ఒక ఫిక్షన్ నవల కానీ, న్యూస్ పేపర్ కానీ లేదా పనికొచ్చే ఒక మంచి ఆటో బయోగ్రఫీ కానీ చదువుతూ ఉంటుంది. టీవీ చూడటం అంత ఇష్టపడదు. అలాగని సినిమాలు చూడదు అని కాదు. ప్రతీ ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగు సినిమా క్రమం తప్పకుండా కార్తీక్ తో పాటు హాల్ కెళ్ళి మరీ చూసేస్తుంది. కార్తీక్ మధురిమ ను ఇంప్రెస్స్ చెయ్యటానికి ఎప్పటికప్పుడు కొత్త సినిమా రిలీజ్ డేట్ లన్నీ సెల్ లో ఫీడ్ చేసుకుని రెడీ గా టికెట్ లు బుక్ చేసి ఉంచుతాడు.
ఇలా రోజులు గడుస్తూ హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న టైములో…..
ఒక రోజు కార్తీక్ ప్రాజెక్ట్ పని మీద ముంబై వెళ్ళాల్సి వచ్చింది. పెళ్ళయిన ఇన్ని రొజుల్లో మొట్ట మొదటి సారి మధురిమని ఒంటరిగా వదిలేసి కార్తీక్ వెళ్ళటం. అందుకే ఇద్దరికీ కాస్త ఇబ్బంది గా ఉంది.
కార్తీక్, ” నువ్వేం భయపడొద్దు. వారం రొజుల్లో తిరిగి వచ్చేస్తా.”
మధురిమ, ” వారం రోజులు అంటేనే భయంగా ఉంది. నువ్వు ఇంటికి రావటం ఒక్క రోజు లేట్ అయినా చంపేస్తా”
కార్తీక్, ” ప్రామిస్ చేస్తున్నా కదా మధు. I can understand నీకు కొంచెం కొత్తగా ఉంటుంది.ఒంటరిగా…. that too వారం రోజులు ఉండటం. ఏం చేస్తాం….? చెప్పు
హారర్ బుక్స్, హారర్ మూవీస్ చూడకుండా బుద్ధిగా జంధ్యాల గారి సినిమాలు చూస్తూ కాలక్షేపం చెయ్యి.నీకు తోడుగా ఎలాగూ పక్కింట్లో నేహా పరిచయం అయ్యింది.
I hope you are not completely lonely .”
7 రోజులు కార్తీక్ లేకుండా ఇంట్లో ఎలా గడపాలో అర్థం కాని ఒక confusion లో నుండి ఇంకా బయటికి రాకముందే, కార్తీక్ కి టాటా చెబుతూ తలుపు మెల్లగా మూసేసి ఆలోచిస్తూ నడుచుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చుంది.
ఎప్పటిలానే తనకెదురుగా ఉండే తనకిష్టమయిన పెయింటింగ్ ని అలా చూసింది.
మధురిమకి వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఆ పెయింటింగ్ లో కనిపించే అతనికి తనకిష్టమైన పేరు ఒకటి పెట్టి, తను లేకపోయినా తనతో మాట్లాడుతూ గడిపితే టైం తెలీకుండా గడిచిపోతుంది.
అలా తనతో మాట్లాడుతూ ఇంట్లో అన్ని పనులూ చేసినట్టు ఉంటుంది అనిపించింది.
అనుకున్నట్టే ఆ పెయింటింగ్ లో అతనికి ఏదో ఒక పేరు పెడదాం అనిపించి,
తను కాలేజీ లో చదివేటప్పుడు క్లాసు లో అందరి కంటే అందంగా కనిపించే రాహుల్ పేరునే మనసులో అనుకుని రాహుల్ అని పిలవటం స్టార్ట్ చేసింది.
అలా కార్తీక్ కి దూరంగా గడపాల్సిన 7 రోజుల్లో మొదటి రెండు రోజులూ రాహుల్ తో మాట్లాడుతూ టైం తెలీకుండా గడిపేసింది మధురిమ. టిఫిన్ చేసేటప్పుడు, వాషింగ్ మిషన్ లో బట్టలు రిన్స్ చేసేటప్పుడు, లంచ్ చేస్తున్నప్పుడు….ఇలా రెండు రోజుల్లోనే పెయింటింగ్ లోని రాహుల్ తో బాగా క్లోజ్ ఐపోయింది. ఇది ఎంత దాకా వచ్చింది అంటే పక్కింటి నేహ ఒకసారి తనని అలా పలకరించి పోదామని వస్తే, రాహుల్ తో మాట్లాడుతున్నాను బిజీ తరవాత కలుద్దాం అని చెప్పి పంపించేసింది. రాహుల్ ఎవరో అర్థం కాక నేహా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
తను చేస్తున్నది కొంచెం వింతగా తనకే తోచినా, కాలేజీలో రాహుల్ తో చెప్పాలనుకున్న ఎన్నో ఎన్నెన్నో కబుర్లనీ, విశేషాలనీ ఈ పెయింటింగ్ లో రాహుల్ తో చెప్పుకుంది. కార్తీక్ తో రొజూ ఎన్నో మాట్లాడాలి అనుకుంటుంది. కానీ కార్తీక్ కి ఇవేం పట్టవు. ఆఫీసు పని పూర్తి చేసుకుని వచ్చాక, వెంటనే రెడీ ఐపోయి బయటికి ఏదో ఒక మూవీ కి తీసుకెళ్ళి, తరవాత డిన్నర్ కి తీసుకెళతాడు. మూవీ చూస్తున్నప్పుడేమో ఇద్దరూ కథలో లీనం ఐపోయి చూస్తారు కాబట్టి మాటలు అంతగా ఉండవు ఇద్దరి మధ్యా. ఇక డిన్నర్ చేస్తున్నంత సేపు కార్తీక్ కు ఆఫీసు విషయాల గురించీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించీ, మధురిమ అందం గురించీ, డ్రెస్సింగ్ సెన్స్ గురించీ మాట్లాడటానికే టైం సరిపోతుంది. అవి తప్ప వీరి మధ్య వేరే మాటలే ఉండవు. కార్తీక్ కి ప్రేమ మీద నమ్మకం లేదు. అట్రాక్షన్ తో దగ్గరయిన బంధం పెళ్లి తరవాత లవ్ గా మారిపోతుంది అనుకునే రకం. లవ్ at ఫస్ట్ sight లాంటివి వినగానే ఫక్కున నవ్వేసే రకం. మధురిమ కేమో మాటలతో కట్టిపడేసే మగాళ్లంటే ఇష్టం. తనకి ఇష్టమైన హీరో షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ తన సినిమాల్లో ఎంతో involve అయ్యి చెప్పే డైలాగ్స్ అంటే ఎంతో ఇష్టం తనకి.
ఒక మగాడిలో అందం, పర్సనాలిటీ మాత్రమే సరిపోవు.
ఆడదాన్ని అర్థం చేసుకుని తనకి సంతోషం కలిగించే చిన్న చిన్న పనులు,
ప్రేమ ని వ్యక్తీకరించే నాలుగు రొమాంటిక్ మాటలు కోరుకోవటం లో తప్పేముంది అంటుంది. కరెక్టే మరి. చిన్నప్పటి నుండి నాన్న అమ్మని తిడుతూనే కనిపించే వాడు కానీ, ఒక్క సారి కూడా ప్రేమగా నాలుగు మాటలు చెప్పిన పాపాన పోలేదు.
అందుకే తనకు నచ్చే ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టే తెర పైన షారుఖ్ ఖాన్ అన్నా, కాలేజీ డేస్ లో రాహుల్ అన్నా ఎంతో ఇష్టం పెంచుకుంది.
కార్తీక్ కి మాటలతో మాయ చేసేంత స్కిల్ గానీ, అలా చేసే నేచర్ గానీ రెండూ లేవు. మెకానిక్ గా రొటీన్ గా బతకటం అలవాటు చేసుకున్న వ్యక్తి. ఇందులో తన తప్పెమీ లేదు. మధురిమ కి కూడా ఈ విషయం తెలుసు. ఇది తెలిసే కార్తీక్ కి తగ్గట్టు గానే నడుచుకుంటుంది. అందుకే కార్తీక్ ఊరికి వెళ్ళాడు అనగానే మొదట భయపడ్డా, ఆ తరువాత పెయింటింగ్ లోని రాహుల్ తో మాట్లాడుతూ తెలీకుండానే రెండు రోజులు అలా గడిచిపోయే సరికి మధురిమ కి ఈ కొత్త రాహుల్ తో స్నేహం కొత్తగా, ఇంటరెస్టింగ్ గా ఉంది.
ఇక ముచ్చటగా మూడో రోజు కూడా నిద్రలేచింది. యధావిధి గా బాత్రూం డోర్ తీసి అద్దం ముందున్న బ్రష్, పేస్టు తీస్తూ, “రాహుల్ బాగా పొద్దుపోయింది. నిద్రపోయింది చాలు. నిద్ర లే” అంది.
వెంటనే హాల్ లో నుండి, “నేను నిద్ర లేచి చాలా సేపు అయింది మేడం. తమరే చాలా లేట్ గా లేచారు. మీ కోసమే కాఫీ చేసి రెడీ గా టేబుల్ మీద ఉంచా.” అన్న గొంతు వినిపించింది.
మధురిమ కి మైండ్ పోయింది. పరిగెత్తుకుంటూ హాల్ లోకి వచ్చింది. చుట్టూ చూసింది. టేబుల్ వైపుకి భయపడుతూనే చూసింది. కాఫీ ఉంది. వేడి వేడి గా పొగలు వస్తున్నాయి.
టేస్ట్ చేసి చూసింది. సూపర్ !!! తను కూడా అంత బాగా చేయ్యదేమో. భయపడుతూనే కాఫీ తాగుతూ వెనక్కి తిరిగి చూసేంత లో పెయింటింగ్ లో ఉన్న రాహుల్ ఎదురుగా కుర్చీ మీద కూర్చుని గట్టిగా నవ్వుతూ ,”కాఫీ ఎలా ఉంది?” అని అడిగాడు.
భయంతో కప్ కిందపడేసి మధురిమ, ” నువ్వెవరు? నాకు చాలా భయంగా ఉంది. నేనిప్పుడే కార్తీక్ కి కాల్ చేస్తాను.” అంటూ సెల్ ఫోన్ ఉన్న వైపు గా నడిచేంత లోనే పెయింటింగ్ లో ఉన్న రాహుల్ స్వయంగా సెల్ ఫోన్ తెచ్చి మధురిమ చేతికిచ్చి మాయం ఐపోయాడు.
ఊహించని ఈ పరిణామానికి ఒక్క క్షణం ప్రపంచం తలకిందులు ఐనట్లు అనిపించి పెయింటింగ్ ఎదురుగానే చైర్ లో కూర్చుంది.
ఇలాంటి టైం లో కార్తీక్ కి కాల్ చేసి టెన్షన్ పెట్టడం ఇష్టం లేక, పక్కింటి నేహ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది.
కాలింగ్ బెల్ ని మధురిమ ఎంత బలంగా నొక్కాలో అంత బలంగా నొక్కటంతో నేహ పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసింది.
నేహ,” ఏమైంది ? అంత hurry గా వచ్చావ్?”
నేహాను చూడగానే మధురిమ కి ఇంకా టెన్షన్ పెరిగింది. “ఏం లేదు లే. ఏదో చిన్న disturbance . నీతో మళ్ళీ మాట్లాడతాను. బై” అనేసి మళ్ళీ తన ఫ్లాట్ వైపు పరుగు తీసింది. డోర్ ని బలంగా వేసి పరిగెత్తుకుంటూ వచ్చి చైర్ లో కూర్చుని ఏడవటం స్టార్ట్ చేసింది.
పెయింటింగ్ లో ఉన్న యువకుడి కి రాహుల్ అని పేరు పెడితే కళ్ళ ముందు తన క్లాసు మేట్ రాహుల్ ప్రత్యక్షమవుతాడు అని ఎవరు మాత్రం ఊహిస్తారు చెప్పండి?
సరే తనేదో భ్రమ పడుతుందేమో , భయపడుతుందేమో అనుకుంటే మరి నేహ ఇంట్లో నేహ వెనకాలే ఆ పెయింటింగ్ లోని యువకుడు తిరుగుతూ కనిపించే సరికి మొట్ట మొదటి సారి మధురిమ కి భయం అంటే ఏంటో తెలిసింది.
కొంచెం సేపు ఆలోచించి అటూ ఇటూ చూసి ఈ సారి మధురిమ, ” రాహుల్ ” అని పిలిచింది. యాదృచ్చికంగా అదే టైం కి కార్తీక్ కాల్ చేశాడు. వెంటనే పరిగెత్తుకుంటూ టేబుల్ మీదున్న సెల్ అందుకుని కార్తీక్ తో, ” నువ్వెప్పుడు వస్తున్నావ్? నాకు ఇక్కడ చాలా భయమేస్తోంది.” అంది.
కార్తీక్ వెంటనే, “ఏమైంది ? అక్కడ ప్రాబ్లం ఏం లేదు కదా ? అయినా పక్కింట్లో నేహ ఉంది కదా. ఏదైనా ప్రాబ్లం ఉంటే తనతో చెప్పు. నేను ఈ వీకెండ్ కల్లా ఇంట్లో ఉంటా.” అన్నాడు
మధురిమ, ” ఓకే. ఇంకా 4 డేస్ వెయిట్ చెయ్యాలా?”
కార్తీక్,” తప్పదు మరి. ఈ ఒక్క సారికి సర్దుకు పో. టేక్ కేర్ మధు. ప్రతీ చిన్న దానికి భయపడకు చిన్న పిల్లలా. బై” అనేసి ఫోన్ పెట్టేశాడు నిరుత్సాహంగా.
కార్తీక్ ఆఫీసు tensions తోటే సతమతం అవుతుంటే ఇప్పుడు తన గురించి చెప్పి అసహనం కలిగించానే అనే విషయం మధురిమ కి అర్థం అయిపొయింది. అనవసరంగా తన గురించి చెప్పి టెన్షన్ పడేలా చేశానే అనుకుని ఒక నిమిషం బాధపడింది . వెంటనే ఆలోచనలో పడింది.ఇప్పుడీ పెయింటింగ్ లో యువకుడు ఎవరా? ఎవరా? అనే ఆలోచనలోకి వెళ్ళిపోయింది. పెయింటింగ్ ని సరిగ్గా గమనించటం స్టార్ట్ చేసింది.
ఒక్క నిమిషం షాక్ !!!! ఆ పెయింటింగ్ లో యువకుడు ఎవరో కాదు. రాహుల్. ఎస్ తన కాలేజీ లో తన క్లాసు లో తనతో పాటు డిగ్రీ పూర్తి చేసిన రాహుల్ పెయింటింగ్ అది. ఎంత ఆశ్చర్యం!!!
ఇన్ని రోజులూ గుర్తుపట్టనే లేదు !!!
పెయింటింగ్ లో ఉన్నది రాహుల్ అని తెలియగానే మధురిమ కి భయానికి బదులు అత్యుత్సాహం కలిగింది. అసలు రాహుల్ ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉన్నాడు ఈ పెయింటింగ్ లో. కాలేజీ డేస్ లో చాలా హ్యాండ్ సమ్ గా ఉండేవాడు. మరి ఈ పెయింటింగ్ లో ఫిలాసఫర్ లా ఉన్నాడేంటి? ఏది ఏమైనా, ఆ కళ్ళలో ఏదో ఉంది. అందుకే అతని కళ్ళు అంతలా attract చేసాయి తనని.
అసలు తన లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు? అతని వైఫ్ తనకంటే అందంగా ఉంటుందా? మధురిమ మైండ్ లో ఒకే సారి ఇన్ని ప్రశ్నలు వెంట వెంటనే పుట్టుకొచ్చాయి.
వెంటనే తను ఇంటి ఓనర్ కి కాల్ చేసింది. రింగ్ అవుతోంది. ఒక 5 నిమిషాల తర్వాత ఒక ముసలావిడ ఫోన్ లిఫ్ట్ చేసింది.
అటు పక్క నుండి , “ఎవరు? ఎవరు కావాలి?”
మధురిమ,”నా పేరు మధురిమ. కార్తీక్ వాళ్ళ వైఫ్ ని. కొత్తగా 302 ఫ్లాట్ లో చేరాం కదా.”
అటు పక్క నుండి, “302 ఆ??….ఓహ్….చెప్పండి”
మధురిమ, “ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది. మొదట్లో మీరు పెట్టుకోవద్దు అని చెప్పినా, నాకు బాగా నచ్చటం తో కార్తీక్ ఇక్కడే ఉంచేసాడు.”
అటు పక్క నుండి, ” అసలు వేరే వాళ్ళ పెయింటింగ్స్ ఎందుకు ఉంచుకున్నారు?…..”
మధురిమ, ” అంటే అలా కాదు. పెయింటింగ్ చాలా బాగా నచ్చింది. అందుకే. అయినా నేను మాత్రమే కాదండీ. పక్కింట్లో నేహ అనే అమ్మాయికి కూడా ఈ పెయింటింగ్ నచ్చి తన రూం లోనే ఉంచుకుంది.”
అటు పక్క నుండి, ” ఆ పెయింటింగ్ మీ దగ్గర ఉండటం అంత మంచిది కాదు. మీ ఫ్రెండ్ కి కూడా చెప్పండి.”
మధురిమ, ” ఎందుకు?”
అటు పక్క నుండి, ” కొన్ని ఫోన్ లో చెప్పటం అంత బాగోదమ్మా. అర్థం చేసుకో.”
మధురిమ, “ఈ పెయింటింగ్ లో నా క్లాస్ మేట్ రాహుల్ ఉన్నాడు. తన గురించి నాకు తెలియాలి.”
అటు పక్క నుండి, “రాహుల్ నీ క్లాస్ మేట్ ఆ???….తన గురించి తెలుసుకోవటానికి ఇంకేమీ లేదు. తను చనిపోయి ఇప్పటికి సరిగ్గా రెండేళ్ళు అవుతోంది.”
మధురిమ, ” రాహుల్ చనిపోయాడా !!!!”
మధురిమ కి అంతా షాకింగ్ గా ఉంది.
ఫోన్ పెట్టేసి నేహ రూం కెళ్ళింది. డోర్ బెల్ రింగ్ అవ్వగానే లోపలికి రమ్మని పిలుస్తూ నేహా, ” ఇందాకే అడుగుదాం అనుకున్నా. బట్ అప్పుడేదో టెన్షన్ లో ఉన్నావని అడగలేదు. ఏంటి? ఒంట్లో బాగోలేదా?”
మధురిమ, నేహ ఇద్దరూ హాల్లో ఉన్న టేబుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నారు. చైర్ లో కూర్చుంటూ మధురిమ, ” నీకొకటి చెప్పాలి. మనం ఇంట్లో ఉంచుకున్న పెయింటింగ్ లో ఉన్న అతని పేరు రాహుల్. నా క్లాసు మేట్. తను చనిపోయి రెండేళ్ళు అవుతోంది అంట. “
నేహా, “అవునా !!!”
మధురిమ, ” అంతే కాదు. నాకు రాహుల్ కాఫీ కలిపి టేబుల్ మీద పెట్టాడు. భయపడి మీ ఇంటికొస్తే నీ వెనకాలే కనిపించాడు. ఇంకా భయమేసింది. అందుకే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా.”
నేహా షాకింగ్ గా, “వాట్ ????……నా వెనక రాహుల్ ఉండటం ఏంటి?…ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నా కదా.”
మధురిమ,” లేదు నేహా. నువ్వు డోర్ తెరుస్తున్నప్పుడు నీ వెనకాలే రాహుల్ నడుచుకుంటూ నీ బెడ్ రూం లోకి వెళ్ళటం నేను చూశా.”
నేహా, ” నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు. అండ్ అసలు మన మధ్య లేని రాహుల్ నీకు కాఫీ కలిపివ్వటం ఏమిటి? “
మధురిమ, “కాఫీ కలిపి టేబుల్ మీద రెడీ గా ఉంచాడు. నేను టేస్ట్ చేసి చూసాను. చాలా బాగా కలిపాడు.”
నేహా చాలా ప్రాక్టికల్ అమ్మాయి. అండ్ ఇండిపెండెంట్. ఎవ్వరు ఏది చెప్పినా, తనకు ఏది నచ్చితే అదే తీసుకుంటుంది. నచ్చకపోతే వెంటనే మొహం మీదే చెప్పేసే రకం. మధురిమ మాటలను బట్టి మధురిమకి ఏదో మానసిక సమస్య ఉందేమో అని డౌట్ వచ్చి, తనకి తెలిసిన సైకియాట్రిస్ట్ ఆనంద్ సక్సేనాకి ఫోన్ చేసింది. నేహకి క్లోజ్ ఫ్రెండ్ అవ్వటం తో వెంటనే అప్పాయింట్మెంట్ దొరికింది. ఆ రోజు సాయంత్రమే ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి మధురిమ ను ఆనంద్ దగ్గరికి తీసుకెళ్ళింది నేహా.
మధురిమ తో ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత,
ఆనంద్ నేహా తో ఇలా అన్నాడు, ” నువ్వు తనని ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేసావ్”
నేహా, ” అసలు ప్రాబ్లం ఏంటి?”
ఆనంద్, ” వాళ్ళ పేరెంట్స్. “
నేహా, ” వాట్?”
ఆనంద్, ” చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్న గారు ఎన్నో రకాలు గా వాళ్ళ అమ్మని హింసించారు. ఫర్ నథింగ్. ప్రెగ్నంట్ గా ఉన్న వాళ్ళ అమ్మ గారిని ఒక రోజు వాళ్ళ నాన్న బూట్ తో కొట్టారు అని ఏడుస్తూ చెప్పింది మధురిమ. ఈ విషయం తనకి వాళ్ళ అమ్మే చెప్పింది అని కూడా చెప్పింది. సో, ఇలాంటి తండ్రిని చూస్తూ ద్వేషిస్తూ పెరిగిన అమ్మాయికి ఖచ్చితంగా అబ్బాయిలంటే ఎంతో కొంత ఏహ్య భావం ఉంటుంది. సరిగ్గా అలాంటి టైం లోనే రాహుల్ అందరికంటే డిఫరెంట్ గా కనిపించాడు కాలేజీ లో. అందుకే రాహుల్ కి సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్నీ నిశితంగా గమనించటం అలవర్చుకుంది. నిజం చెప్పాలంటే రాహుల్ ని నిజంగా ప్రేమించింది. ఆరాధించింది కూడా. “
నేహా, ” మరి రాహుల్ ని అంతగా ప్రేమిస్తే కార్తీక్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది? “
ఆనంద్, ” రాహుల్ గురించి తెలిసిందే కదా. తను బాగా రిచ్. సాఫ్ట్ అండ్ సెన్సిటివ్. అండ్ మాంచి అందగాడు కావటంతో అమ్మాయిలు అందరూ అతని చుట్టూ ఉండేవాళ్ళు. అలాంటి రాహుల్ ని ప్రేమిస్తున్నాను అని రాహుల్ కి కూడా చెప్పకుండా, ముందు వాళ్ళ నాన్నకు చెప్పింది.
చెప్పగానే వాళ్ళ నాన్న కోప్పడ్డాడు. అర్థం చేసుకుంటాడు అనుకుంది. కానీ అపార్థం చేసుకున్నాడు.
ఆ తర్వాతి రోజుల్లో కార్తీక్ సంబంధం ఇంట్లో వాళ్ళు తేవటం. కార్తీక్ నచ్చటం. అలా మధురిమ కార్తీక్ ని పెళ్లి చేసుకుంది “
నేహా, ” రాహుల్ గురించి నీకు ఎలా తెలుసు? “
ఆనంద్, ” రాహుల్ ఒకప్పుడు నా పేషెంట్. ఇప్పుడు చనిపోయాడు. అది వేరే విషయం అనుకో.”
నేహా, ” అయితే నీకు రాహుల్ ఎలా చనిపోయాడో తెలుసా? “
ఆనంద్, ” యా….ప్రస్తుతం మధురిమ వాళ్ళు ఉంటున్న 302 లోనే ఉరేసుకుని చనిపోయాడు. నువ్వు ఉంటున్న 301 లో రాహుల్ ప్రేమించిన అమ్మాయి ఉరేసుకుని చనిపోయింది. “
నేహా, ” ఓహ్ మై గాడ్…సిటీ మొత్తం వెతికి మరీ ఇలాంటి ఫ్లాట్ సజెస్ట్ చేసినందుకు కార్తీక్ ని ఎన్ని తిట్టినా తప్పు లేదు.”
ఆనంద్, ” నేను ముందే చెబుదాం అనుకున్నా. ఎనీ హౌ నీకు అలాంటి సెంటిమెంట్స్ ఏవీ లేవు కదా అని చెప్పలేదు. “
నేహా, ” సరిపోయింది. ఇంతకీ మధురిమ కి ఉన్న exact ప్రాబ్లం ఏంటి?”
ఆనంద్, ” Psychosis అండ్ Schizophrenia . బట్ నథింగ్ to వర్రీ.
ఆ రేంజ్ కి వెళ్ళేంత భయంకరమైన కండిషన్ లో అయితే తను లేదు.
ఎందుకంటే, తనకి కార్తీక్ అంటే చాలా ఇష్టం. ఏవో కొన్ని విషయాల్లో రాహుల్ ని ఊహించుకుని compare చేసుకుంటోంది. అంతే.
Infact , కార్తీక్ is a good husband
తను మాట్లాడిన గంట లో అరగంట కు పైగా కార్తీక్ గురించే చెప్పింది. “
నేహా, ” మరి రాహుల్ తనకి కాఫీ కలిపి టేబుల్ మీద పెట్టడం, రాహుల్ తనతో మాట్లాడటం, తను మా ఇంట్లో నా వెనక రాహుల్ ని చూడటం. ఇవన్నీ ఏంటి? “
ఆనంద్ , ” Schizophrenia లో auditory అండ్ visual hallucinations చాలా కామన్. అంటే ఒక దాని గురించి పదే పదే తలుచుకుంటూ ఉంటే, after some point అదే కనిపిస్తుంది. అదే వినిపిస్తుంది. మధురిమ కేస్ లో అదే జరిగింది. కార్తీక్ తనకు రొజూ కాఫీ ప్రేమ గా కలిపి తాగించాలి అనుకుంది. బట్ కార్తీక్ అలా చెయ్యలేదు. కాబట్టి రాహుల్ ని ఊహించుకుంది. రాహుల్ కాఫీ కలిపినట్టు, రాహుల్ మాట్లాడినట్టు ఊహించుకుంది. రాహుల్ మాటలు తనకొక్క దానికే వినిపిస్తాయి.
తనే కాఫీ కలుపుకుని టేబుల్ మీద పెట్టి, ఆ సంగతి మరిచిపోయి బ్రష్ చేసుకోవటానికి వెళ్ళింది. అప్పుడు రాహుల్ మాట్లాడినట్టు ఊహించుకుంది.
అసలు మధురిమ కి పెయింటింగ్ అంతగా నచ్చటానికి కారణమే రాహుల్. ఆ కళ్ళని ఎక్కడో చూసినట్టు అనిపించింది తనకి. అవి రాహుల్ కళ్ళే. వెంటనే గుర్తుపట్టలేక పోయింది. ఇలా hallucination లో ఉన్నప్పుడు గుర్తుపట్టింది. అలా పెయింటింగ్ లో ఉన్న రాహుల్ కళ్ళ ముందు కనిపించే సరికి, ఎక్కడో కార్తీక్ ని మోసం చేస్తున్నాను అనే భయం తో పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చింది. నీ రూం లో కూడా రాహుల్ పెయింటింగ్ ఉన్న విషయం తనకు తెలుసు కాబట్టి, నీ వెనక రాహుల్ ఉన్నట్టు మళ్ళీ తనే ఊహించుకుంది. ఇదంతా hallucination “
నేహా, ” బాబు ఆనంద్. నన్ను భయపెట్టకు. ఇప్పుడు మధురిమ తో మాట్లాడాలంటే భయంగా ఉంది. “
ఆనంద్, ” హహహ….మధురిమ అంటే ఎందుకు భయం?”
నేహా, ” Generally , నేను కార్తీక్ తో కొంచెం క్లోజ్ గా మూవ్ అవుతాను లే. ఇప్పుడు తన ఊహల్లో నన్ను చంపేసింది అనుకో. ఊహల్లో ఏంటి….నేను నిజమే కదా.
సో నిజంగానే నన్ను చంపింది అనుకో. నా పరిస్థితి ఏంటి? “
ఆనంద్, ” అంత లేదు లే. నీ మీద మంచి అభిప్రాయమే ఉంది తనకి. ఏమంటే కార్తీక్ తిరిగొచ్చే లోపు నువ్వు తనని జాగ్రత్తగా చూసుకోవాలి”
నేహా, ” తను మా ఇంట్లోనే ఉండేలా నేను చూసుకుంటా. I ‘ll take care “
అలా ఆ “ఒక్క రోజు”ని భయపడుతూ, భయాన్ని తెలియకుండా కవర్ చేసుకుంటూ మధురిమ తో గడిపింది నేహా.
ఆ రోజు రాత్రి “మిస్సమ్మ” సినిమా చూస్తూ ఆ ఆలోచనల్లోంచి కొంత వరకు బయటికొచ్చేసింది మధురిమ.
రెండు రోజుల్లో కార్తీక్ వచ్చేసాడు. వచ్చీ రాగానే నేహా జరిగింది అంతా చెప్పింది. ఆ రోజు సాయంత్రం ఆనంద్ ని కలిసాడు కార్తీక్. జరిగిందంతా వివరంగా తెలుసుకున్నాడు.
మధురిమకి కావాల్సింది నిజమైన ప్రేమ అనే విషయం ఇప్పుడు సరిగ్గా అర్థం అయ్యింది కార్తీక్ కి.
వెంటనే తన పద్ధతినీ, ఇంటినీ మార్చేశాడు. కొంచెం దూరం అయినా సరే, ఈ సారి ఇంతక ముందులా ఊరి చివర కాకుండా సెంటర్ లో మంచి ఇల్లు చూశాడు. అలాగే, నేహా కి కూడా పక్కనే ఇంకో మంచి ఇల్లు వెతికి పెట్టాడు. మధురిమ ని బాగా చూసుకున్న నేహా కి థాంక్స్ అని చెప్పటం చాలా చిన్న పదం అనిపించింది.
మధురిమ కి జరిగిన ఈ సంఘటనతో నేహాలో కూడా మార్పు వచ్చింది. ఒంటరితనం అనేది మనసుకి సంబంధించినది అని తెలుసుకుంది. ఒంటరి ఐపోతూ పోతే మనం ఎంత ఆనందంగా ఉన్నట్టు పైకి కనపడినా, లోపల మాత్రం పెద్ద అగాధమే ఉంటుంది. అందుకే జీవితానికి ఒక తోడు కావాలి అనిపించింది.
అంత వరకూ ఇంట్లో వాళ్లకి మొండిగా, “నేను పెళ్లి చేసుకోను” అని చెప్పిన అమ్మాయి వెంటనే, “సంబంధాలు చూడండి” అని కబురు చేసింది. తమ కూతురిలో వచ్చిన ఈ సడన్ చేంజ్ ని చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు షాక్ ఐపోయి ఆనందించారు.
మొత్తానికి ఒక ఊహ అనేది జీవితం లో ఊహించని ఇన్ని మార్పులని తీసుకొస్తుందని బహుశా మధురిమ కూడా ఊహించి ఉండదు.
ప్రతీ మనిషికి కొన్ని ఊహలు, కొన్ని కలలు ఉంటాయి. ఊహ అంటే కళ్ళ ముందు జరుగుతున్నట్టు మనం కనే కల. కల అంటే కళ్ళు మూసుకున్నప్పుడు కనే ఊహ. అంతే తేడా.
అది కల అయినా, ఊహ అయినా పుట్టేది మన నుంచే. కాబట్టి, ఎంత బోర్ కొట్టినా మంచి ఆలోచనలే చెయ్యండి. ఎంత ఊరించినా చెడ్డ ఆలోచనలు ఊహించకండి.
జీవితం అనేది జీవించటం లోనే మజా ఉంటుంది కానీ, ఊహించటం లో కాదు.
ఊహల్లో బతకటం మొదలు పెడితే, జీవించటం కష్టం అవుతుంది. అప్పుడు అంత వరకూ బతికిన ఆ జీవితం కంటే, కొద్ది సేపు ఊరించిన ఆ ఊహకే మనిషి బానిస ఐపోయి జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు.
ఇది పగటి కలలు కనే వాళ్లకు సరిగ్గా సెట్ అవుతుంది.
అలానే, ప్రేమ కోసం పరితపించే మధురిమ లాంటి వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే, ‘జీవితం లో మీరు పడిన (లేదా) మీరు చూసిన కష్టాలే కష్టాలు కాదు. ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఉంటాయి కూడా. ఏవో కొన్ని బలమైన సంఘటనల వల్ల జీవితాంతం అదే ముద్రతో గడిపేయ్యటం తెలివైన వాళ్ళు చేసే పని అనిపించుకోదు. పోరాడే వాడినే యోధుడు అంటారు. కష్టపడే వాడినే మనిషి అంటారు. కష్టపెట్టే వాడిని కాదు. అందుకే, మిమ్మల్ని వెంటాడే అబధ్రతా భావాల్ని నిరభ్యంతరంగా వదిలెయ్యండి. ప్రేమను మీరు వెంటాడండి. ప్రేమ వెనకాల పరిగెత్తండి.
ప్రేమను నమ్మే మీరు, ప్రపంచం లో ప్రేమనే చూడండి. ప్రేమను ఊహించుకోకండి. ఊహకు కూడా అందని ప్రేమను చూపించండి. అప్పుడు ప్రేమే మీ దాసోహం అవుతుంది.’
అదే ఈ కథ వెనక దాగి ఉన్న
ముఖ్య ఉద్దేశ్యం.
ఈశ్వర చంద్ర
చాలా బాగుంది సార్..💐💐💐💐